
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ బుధవారం సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. చౌకీదార్ చోర్ హై(మోదీ దొంగ) అని సుప్రీంకోర్టు చెప్పిందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరుతూ సుప్రీంకోర్టు ముందు 3 పేజీల అఫిడవిట్‌ను దాఖలుచేశారు. తనకు సుప్రీంకోర్టుపై చాలా గౌరవముందని వ్యాఖ్యానించారు. తాను చౌకీదార్ చోర్ హై అన్న వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా సుప్రీం తీర్పునకు ఆపాదించలేదనీ, అది అనుకోకుండా జరిగిందన్నారు.
తనపై క్రిమినల్ విచారణ జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టును కోరారు. రఫేల్ ఒప్పందం విషయంలో పిటిషనర్లు సాక్ష్యాలుగా సమర్పించిన పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు 2019, ఏప్రిల్ 10న తెలిపింది. ఈ నేపథ్యంలో అమేథీలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ..‘చౌకీదార్ చోర్’ అని సుప్రీంకోర్టు కూడా తేల్చిందని వ్యాఖ్యానించారు. దీంతో రాహుల్ తన వ్యాఖ్యలను సుప్రీం తీర్పుకు ఆపాదించారనీ, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
క్రిమినల్ విచారణను కొట్టేయండి..
ఈ కేసు విచారణ సందర్భంగా బుధవారం సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ రాహుల్ తరఫున వాదిస్తూ.. ‘సుప్రీంకోర్టు తీర్పుకు తన అభిప్రాయాన్ని ఆపాదించినందుకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు కోరుతున్నారు. అనుకోకుండా ఆ వ్యాఖ్యలను చేశాననీ, ఉద్దేశపూర్వకంగా చెప్పలేదని వివరణ ఇచ్చారు. ఈ అఫిడవిట్‌ను న్యాయస్థానం అంగీకరించి, తనపై జరుగుతున్న క్రిమినల్ ధిక్కార విచారణను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరుతున్నారు’ అని తెలిపారు. బీజేపీ మీనాక్షి లేఖి పిటిషన్‌పై గతంలో రాహుల్ క్షమాపణలు కోరుతూ సుప్రీంకోర్టులో రెండు అఫిడవిట్లు దాఖలుచేశారు.