భివానీ(హరియాణా): నిరుద్యోగంపై పోరాడేందుకు బాక్సింగ్ రింగ్‌లోకి దిగిన మోదీ.. అడ్వాణీకే ముఖంపై పంచ్ ఇచ్చారని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఎద్దేవా చేశారు. తన రాజకీయ గురువైన అడ్వాణీని మోదీ బీజేపీ మార్గదర్శకమండలికి పరిమితం చేయడంపై రాహుల్ ఈ మేరకు స్పందించారు. మోదీ కారణంగా దేశంలోని నిరుద్యోగులు, చిరువ్యాపారులు, రైతులు సహా అన్నివర్గాల ప్రజలు నష్టపోయారని వ్యాఖ్యానించారు. హరియాణాలో బాక్సర్ల తయారీకేంద్రంగా పేరుగాంచిన భివానీలో రాహుల్ గాంధీ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
చిరు వ్యాపారుల నడ్డివిరిచారు..
భివానీలో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘‘56 అంగుళాల ఛాతి ఉందని ప్రగల్భాలు పలికే మోదీ అనే బాక్సర్ నిరుద్యోగాన్ని, రైతుల సమస్యలను, అవినీతిని ఓడిస్తానని రింగ్‌లోకి దిగాడు. ఈ బాక్సర్ రింగ్‌లోకి దిగిన వెంటనే తన గురువైన అడ్వాణీ ముఖంపై ఒక్క పంచ్ ఇచ్చాడు. ఆ తర్వాత నోట్లరద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్స్(వస్తుసేవల పన్ను–జీఎస్టీ)తో దేశంలోని చిరువ్యాపారుల నడ్డి విరిచాడు. కనీస మద్దతుధర, రుణమాఫీ కోరుతున్న రైతులకు ఇంకో పంచ్ ఇచ్చాడు. గత ఐదేళ్లలో ఈ బాక్సర్ దేశంలోని నిరుపేదలను, వెనుకబడ్డ వర్గాలు, రైతులు, నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్నాడు. దీంతో ప్రజలంతా ‘ఈ బాక్సర్ మాకొద్దు’ అని మొరపెట్టుకుంటున్నారు. అసలు తాను ఎవరితో పోరాడుతున్నాడో ఈ బాక్సర్‌కు అర్థం కావట్లేదు’ అని ఎద్దేవా చేశారు.
రైతులను అరెస్ట్ చేయబోం..
‘మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రుణాలను తిరిగి చెల్లించలేని రైతులను అరెస్ట్ చేయబోం. మేం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీహామీని అమలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి ప్రజాభిప్రాయమే శిరోధార్యం’ అని స్పష్టం చేశారు. సాయుధ బలగాలను బీజేపీ రాజకీయం చేస్తోందనీ, కాంగ్రెస్ ఆ పని ఎన్నటికీ చేయబోదని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ తనను, తన కుటుంబాన్ని ఎంతగా ద్వేషించినా, ఆయన్ను తాను ప్రేమిస్తానని రాహుల్ అన్నారు.
మోదీ అడ్వాణీకి పంచ్ ఇచ్చారు
Published Tue, May 7 2019 4:59 AM | Last Updated on Tue, May 7 2019 4:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment