
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందానికి సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులపై చేసిన వ్యాఖ్యలను గాను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ క్షమాపణలు కోరారు. రఫేల్ ఒప్పందంలో ప్రధాని మోదీని సుప్రీంకోర్టు తప్పుపట్టిందంటూ రాహుల్ పేర్కొన్నారని, న్యాయస్థానం పేర్కొనని విషయాలను కూడా ఆయన జోడించారంటూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి ఈనెల 15వ తేదీన సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం ఆ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా భావిస్తూ 22వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం రాహుల్ అఫిడవిట్ దాఖలు చేశారు.
ఎన్నికల ప్రచార వేడిలో తాను చేసిన వ్యాఖ్యలను రాజకీయ ప్రత్యర్థులు వక్రీకరించారని అందులో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశం తనకు లేదన్నారు. ప్రధాని మోదీ కూడా రఫేల్ ఒప్పందంలో తనకు సుప్రీంకోర్టు క్లీన్‌చిట్ ఇచ్చినట్లు చెప్పుకున్నారని పేర్కొన్నారు. ఈ అఫిడవిట్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించనుంది. కాగా, రాహుల్ అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాలపై బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ..రఫేల్ ఒప్పందం విషయంలో ప్రధానిపై చేసిన ఆరోపణలు అబద్ధాలంటూ రాహుల్ సుప్రీంకోర్టులో అంగీకరించారని అన్నారు. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ వ్యాఖ్యలు తీవ్ర కోర్టు ధిక్కారం కిందికి వస్తాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment