న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ పౌరసత్వం అంశం తేలేదాకా ఆయన్ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బ్రిటన్‌కు చెందిన ఓ కంపెనీ 2005–06లో వెలువరించిన తన వార్షిక నివేదికలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొందంటూ దాఖలైన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ గురువారం విచారించింది. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి అందజేసిన సమాచారంపై కేంద్రం, ఈసీ స్పందించిన తీరు తమకు అసంతృప్తి కలిగించిందని పిటిషనర్లు జై భగవాన్ గోయెల్, సీపీ త్యాగి పేర్కొన్నారు.
రాహుల్ బ్రిటిష్ జాతీయుడనేందుకు ప్రాథమిక ఆధారాలున్నందున ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు ఆయన్ను యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్‌ల నుంచి పోటీ చేయకుండా చూడాలని కోరారు. బ్రిటిష్ పౌరుడైన రాహుల్ పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించేలా ఈసీకి సూచించాలని కోరారు. ద్వంద్వ పౌరసత్వం కలిగినట్లు ఆరోపణలున్న రాహుల్ ప్రధాని కావాలనుకుంటున్నారని పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం..‘ఓ కంపెనీ తన పత్రాల్లో రాహుల్ జాతీయతను బ్రిటిష్ అని పేర్కొన్నంత మాత్రాన ఆయన బ్రిటిష్ పౌరుడైపోతారా? ఒకవేళ 123 కోట్ల మంది ప్రజలు ఆ వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుంటే మీరేం చేస్తారు?’ అని ప్రశ్నించింది.
‘అసలు మీరెవరు? మీరేం చేస్తుంటారు?’అని ధర్మాసనం ప్రశ్నించగా..‘ప్రజా సంబంధ అంశాలపై స్పందిస్తుంటాం, సంఘ సేవకులం, రాజకీయాల్లో కూడా ఉన్నాం’ అని పిటిషనర్లు బదులిచ్చారు. అందుకు ధర్మాసనం.. ‘అయితే, మీరు రాజకీయ సామాజిక సేవలో ఉన్నారన్నమాట’ అని వ్యాఖ్యానించింది. 2005–2006 సంవత్సరాల్లో ఈ ఘటన జరగ్గా ఇప్పటిదాకా కోర్టుకు ఎందుకు రాలేదు? మీరు ఈ విషయం ఎప్పుడు తెలుసుకున్నారు? అని ధర్మాసనం అడగ్గా.. ఈ అంశం 2015లో మాత్రమే వెలుగులోకి వచ్చిందని పిటిషనర్ల లాయర్ బదులిచ్చారు. ‘అయినప్పటికీ, న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు మీరు నాలుగేళ్లు తీసుకున్నారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
బీఎస్‌ఎఫ్ జవాన్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీం
న్యూఢిల్లీ: వారణాసి లోక్‌సభ స్థానంనుంచి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వేసిన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ, మాజీ బీఎస్‌ఎఫ్ జవాన్ తేజ్‌బహదూర్ యాదవ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘పిటిషన్‌ను విచారించడానికి సహేతుకమైన కారణాలు కనిపించడం లేదు’ అంటూ సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంపై ఎన్నికల సంఘం మోదీకి అనుకూలంగా పనిచేస్తుందని ఆరోపిస్తూ బహదూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment