న్యూఢిల్లీ/సిమ్లా: లోక్‌సభ ఎన్నికల్లో లౌకికవాద పార్టీలు గరిష్టస్థాయిలో సీట్లు గెలుచుకుంటాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలసివస్తాయనే సంకేతాలిచ్చారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) వంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వవన్నారు. రాహుల్ శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీకి ప్రజలిచ్చిన అవకాశాన్ని ఆయన వృథా చేశారన్నారు.
గాంధీజీ భావజాలానికి, మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌లు పూర్తిగా విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం (ఈసీ) పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తోందనీ, మోదీ ప్రచార సభలను దృష్టిలో పెట్టుకునే, ఆయనకు ఇబ్బంది కలగకుండా ఆదేశాలు ఇస్తోందన్నారు. ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయని ప్రశ్నించగా జవాబు చెప్పేందుకు ఆయన నిరాకరించారు.
అయితే తాము మోదీలా కాకుండా, సీనియర్ నాయకుల అనుభవాన్ని వాడుకుంటామని, మాజీ ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తదితరుల సలహాలు తీసుకుంటామని తెలిపారు. మోదీ తప్పించుకోకుండా ఒక పద్ధతి ప్రకారం అన్ని ద్వారాలనూ మూసేయడమే తమ పార్టీ వ్యూహమని రాహుల్ చెప్పారు. ఇప్పటికే 90 శాతం ద్వారాలను తాము మూసివేయగా, మరో 10 శాతం ద్వారాలను మోదీ తనంతట తానే మూసేశారని వ్యాఖ్యానించారు. అంతకుముందు రాహుల్ మీడియాతో మాట్లాడుతూ మోదీ తొలిసారిగా విలేకరుల సమావేశానికి హాజరవుతుండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందనీ, అయితే కొందరు జర్నలిస్టులను ఆ భేటీకి రానివ్వడం లేదని తెలిసిందన్నారు.
అవినీతిపై చర్చకు రండి..
రాహుల్ శుక్రవారం సిమ్లాలోని సోలన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతిపై తనతో చర్చకు రావాలని మోదీకి సవాల్ విసిరారు. ‘నాకు 15 నిమిషాలు ఇవ్వండి. నేను నాలుగు ప్రశ్నలడుగుతాను. సమాధానం చెప్పడానికి మోదీ మూడు, నాలుగు గంటల సమయం తీసుకోవచ్చు. ఆ చర్చ తర్వాత మోదీ తన ముఖాన్ని దేశ ప్రజలకు చూపించలేరు’ అని రాహుల్ అన్నారు.
వాళ్లు గాడ్సే ప్రేమికులు..
గాంధీజీని హత్య చేసిన గాడ్సేపై బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ ‘బీజేపీ, ఆరెస్సెస్ వాళ్లు దేవుడి ప్రేమికులు (గాడ్–కే–లవర్స్) కాదు, గాడ్సే ప్రేమికులు (గాడ్–సే–లవర్స్)’ అని వ్యంగ్యంగా అన్నారు. భోపాల్ బీజేపీ అభ్యర్ధి ప్రజ్ఞాఠాకూర్ గురువారం మాట్లాడుతూ గాడ్సే దేశభక్తుడని పేర్కొనడం, తీవ్ర విమర్శలు రావడంతో కొద్దిసేపటి తర్వాత ఆమె క్షమాపణలు చెప్పడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment