secular parties
-
అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా!
సాక్షి, హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సస్పెండెడ్ నేత రాజా సింగ్ సెక్యులర్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణం పోయినా ఫర్వాలేదుగానీ.. అలాంటి పార్టీల్లోకి వెళ్లనని ప్రకటించారు. ‘‘చచ్చినా నేను సెక్యులర్ పార్టీలకు వెళ్ళను. నా ప్రాణం పోతున్నా.. బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల వైపు చూడను. తెలంగాణను హిందు రాష్ట్రం చేయాలని నా లక్ష్యం. బీజేపీ గనుక నాకు టికెట్ ఇవ్వకుంటే.. రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టేస్తా. కానీ, హిందూ రాష్ట్రం కోసం పని చేసుకుంటా. అయినా బీజేపీ అధిష్టానం నా విషయంలో సానుకూలంగా ఉంది. సరైన టైంలో నాపై వేటు ఎత్తేస్తుందన్న నమ్మకం ఉందని తెలిపారాయన. అలాగే.. బీఆర్ఎస్, ఎంఐఎంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది. అందుకే పెండింగ్ పెట్టారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. కానీ ఇండిపెండెంట్‌గా కాని.. వేరే పార్టీల నుంచి కాని పోటీ చేయను అని స్పష్టం చేశారాయన. -
ప్రాంతీయ పార్టీలు బీజేపీకి మద్దతివ్వవు
న్యూఢిల్లీ/సిమ్లా: లోక్‌సభ ఎన్నికల్లో లౌకికవాద పార్టీలు గరిష్టస్థాయిలో సీట్లు గెలుచుకుంటాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలసివస్తాయనే సంకేతాలిచ్చారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) వంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వవన్నారు. రాహుల్ శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీకి ప్రజలిచ్చిన అవకాశాన్ని ఆయన వృథా చేశారన్నారు. గాంధీజీ భావజాలానికి, మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌లు పూర్తిగా విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం (ఈసీ) పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తోందనీ, మోదీ ప్రచార సభలను దృష్టిలో పెట్టుకునే, ఆయనకు ఇబ్బంది కలగకుండా ఆదేశాలు ఇస్తోందన్నారు. ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయని ప్రశ్నించగా జవాబు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. అయితే తాము మోదీలా కాకుండా, సీనియర్ నాయకుల అనుభవాన్ని వాడుకుంటామని, మాజీ ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తదితరుల సలహాలు తీసుకుంటామని తెలిపారు. మోదీ తప్పించుకోకుండా ఒక పద్ధతి ప్రకారం అన్ని ద్వారాలనూ మూసేయడమే తమ పార్టీ వ్యూహమని రాహుల్ చెప్పారు. ఇప్పటికే 90 శాతం ద్వారాలను తాము మూసివేయగా, మరో 10 శాతం ద్వారాలను మోదీ తనంతట తానే మూసేశారని వ్యాఖ్యానించారు. అంతకుముందు రాహుల్ మీడియాతో మాట్లాడుతూ మోదీ తొలిసారిగా విలేకరుల సమావేశానికి హాజరవుతుండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందనీ, అయితే కొందరు జర్నలిస్టులను ఆ భేటీకి రానివ్వడం లేదని తెలిసిందన్నారు. అవినీతిపై చర్చకు రండి.. రాహుల్ శుక్రవారం సిమ్లాలోని సోలన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతిపై తనతో చర్చకు రావాలని మోదీకి సవాల్ విసిరారు. ‘నాకు 15 నిమిషాలు ఇవ్వండి. నేను నాలుగు ప్రశ్నలడుగుతాను. సమాధానం చెప్పడానికి మోదీ మూడు, నాలుగు గంటల సమయం తీసుకోవచ్చు. ఆ చర్చ తర్వాత మోదీ తన ముఖాన్ని దేశ ప్రజలకు చూపించలేరు’ అని రాహుల్ అన్నారు. వాళ్లు గాడ్సే ప్రేమికులు.. గాంధీజీని హత్య చేసిన గాడ్సేపై బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ ‘బీజేపీ, ఆరెస్సెస్ వాళ్లు దేవుడి ప్రేమికులు (గాడ్–కే–లవర్స్) కాదు, గాడ్సే ప్రేమికులు (గాడ్–సే–లవర్స్)’ అని వ్యంగ్యంగా అన్నారు. భోపాల్ బీజేపీ అభ్యర్ధి ప్రజ్ఞాఠాకూర్ గురువారం మాట్లాడుతూ గాడ్సే దేశభక్తుడని పేర్కొనడం, తీవ్ర విమర్శలు రావడంతో కొద్దిసేపటి తర్వాత ఆమె క్షమాపణలు చెప్పడం తెలిసిందే. -
దక్షిణాది రాష్ట్రాల్లోని లౌకికవాద పార్టీలతో కూటమి!
సాక్షి, చెన్నై: పార్టీ ఏర్పాటుకు ముందే విశ్వనాయకుడు కమల్‌హాసన్ కూటమి ఏర్పాటుపై దృష్టి పెట్టారు. ప్రధానంగా బిజేపికి వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల్లోని లౌకికవాద పార్టీలను ఏకం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి 21 నుంచి దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం స్వస్థలం రామేశ్వరం నుంచి రాష్ట్ర పర్యటనకు కమల్ సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార పత్రికలో ఆర్టికల్ రాస్తూ వస్తున్న కమల్ తాజాగా శుక్రవారం వెలువడ్డ సంచికలో బిజేపికి వ్యతిరేకంగా కొత్త ప్రయత్నం గురించి స్పందించారు. అందులో ద్రావిడం అన్నది ఒక్కత మిళనాడుకే పరిమితం కాదని, ఇది దేశవ్యాప్తంగా ముడిపడి ఉన్న పదం అని వివరించారు. దక్షిణ భారతం అంతా ఒకే ద్రావిడం అన్న పదానికి కట్టుబడక తప్పదన్నారు. చంద్రబాబు నాయుడు, పినరయ్ విజయన్, చంద్రశేఖర రావు, సిద్దరామయ్యలూ ద్రవిడులేనని వ్యాఖ్యానించారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ అందరితోఆశల్ని పంచుకోవాల్సి ఉందని, ఇది భవిష్యత్తులో సత్పలితాన్ని ఇవ్వడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. రామనాథపురం జిల్లా రామేశ్వరం నుంచి తన పయనం మొదలు కానున్నదని, ఆ రోజు నుంచి ప్రజలతో అన్ని విషయాలను పంచుకుంటానని, అందరిలోకి తీసుకెళ్తాననని ఆయన పేర్కొన్నారు. అందరం ఒకే వేదిక మీద, ఒకే వైపు ఉంటే ఫలితం ఉంటుందన్నారు. పరోక్షంగా కేంద్రం వద్ద తలలు దించుకోవాల్సిన అవసరం లేదని, అన్నీ దరి చేరే రీతిలో ఐక్యతతో దక్షిణ భారతంలోని లౌకికవాదులందరూ ముందడుగు వేయడానికి సిద్ధం కావాలని ఆ కాలంలో పరోక్షంగా వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఆ రెండు పార్టీలు కూటమిలోకి వస్తేనే..
పట్నా: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే లౌకికవాద పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు ఈ కూటమిలోకి రావాలని సూచించారు. ఆదివారం పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో లాలు మాట్లాడుతూ.. బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోవాలంటే ఇదే మార్గమమని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి మహా కూటమి (ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్) విజయం సాధించడాన్ని ఉదాహరించారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించగా, సమాజ్‌వాదీ పార్టీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఇక బీఎస్పీ మూడో స్థానానికి పరిమితమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత లౌకికవాద పార్టీలు ఒక కూటమిగా ఏర్పడాలని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానించారు. బిహార్‌లో ఆర్జేడీకి మిత్రపక్షమైన జేడీయూ నేతలు కూడా ఇలాంటి సూచనే చేయగా.. తాజాగా లాలు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.