ఆ రెండు పార్టీలు కూటమిలోకి వస్తేనే..
పట్నా: వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే లౌకికవాద పార్టీలన్నీ ఒక్కతాటిపైకి రావాలని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు ఈ కూటమిలోకి రావాలని సూచించారు.
ఆదివారం పట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో లాలు మాట్లాడుతూ.. బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోవాలంటే ఇదే మార్గమమని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి మహా కూటమి (ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్) విజయం సాధించడాన్ని ఉదాహరించారు.
ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించగా, సమాజ్‌వాదీ పార్టీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఇక బీఎస్పీ మూడో స్థానానికి పరిమితమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత లౌకికవాద పార్టీలు ఒక కూటమిగా ఏర్పడాలని పలువురు రాజకీయ నాయకులు వ్యాఖ్యానించారు. బిహార్‌లో ఆర్జేడీకి మిత్రపక్షమైన జేడీయూ నేతలు కూడా ఇలాంటి సూచనే చేయగా.. తాజాగా లాలు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.