త్రిముఖ హోరాహోరీ | third phase of UP elections, tough fight to all | Sakshi
Sakshi News home page

త్రిముఖ హోరాహోరీ

Published Fri, Feb 17 2017 10:30 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

త్రిముఖ హోరాహోరీ - Sakshi

త్రిముఖ హోరాహోరీ

మూడో దశ పోరు ముగ్గురికీ ప్రతిష్టాత్మకం
- 2012 ఫలితాల పునరావృతం కోసం ఎస్‌పీ తహతహ
- 2014 ఫలితాలను మళ్లీ రాబట్టేందుకు బీజేపీ కృషి
- ఆ రెండిటినీ మౌనంగా అధిగమించేంలా బీఎస్‌పీ వ్యూహం
- మారుతున్న పరిస్థితుల్లో మూడు పక్షాల హోరాహోరీ


(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం జరుగనున్న మూడో దశ ఎన్నికలు.. అధికార సమాజ్‌వాది పార్టీతో పాటు.. అటు బీజేపీకి, ఇటు బీఎస్‌పీకి కూడా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్న సమాజ్‌వాది పార్టీకి ఇక్కడ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కీలకం. రాష్ట్రంలో అధికారంలోకి రెండో స్థానంలోనన్నా నిలవడం బీజేపీకి ముఖ్యం. ఆ రెండు పార్టీలనూ ఓడించి.. ప్రస్తుత సమీకరణాలను మార్చివేయడం బీఎస్‌పీకి అత్యవసరం.

మూదో దశలో ఫరూకాబాద్, హర్దోయ్, కన్నౌజ్, మయిన్‌పురి, ఇటావా, అరాయియా, కాన్పూర్, కాన్పూర్ , ఉన్నావ్‌, లక్నో, బారాబంకి, సితాపూర్ – మొత్తం 12 జిల్లాల్లోని 69 శాసనసభ నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్ జరుగనుంది. శుక్రవారం సాయంత్రం ఇక్కడ ప్రచారం ముగిసింది. 2012 శాసనసభ ఎన్నికల్లో ఈ 69 సీట్లలో ఎస్పీ 55 సీట్లు గెలుచుకోగా బీఎస్పీ ఆరు సీట్లు, బీజేపీ ఐదు సీట్లు, కాంగ్రెస్ రెండు సీట్లు, స్వతంత్ర అభ్యర్థి ఒక సీటు చొప్పున గెలుచుకున్నారు. అయితే.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ నాయకత్వానికి చెందిన యాదవ్‌ కుటుంబానికి సొంత కోటలైన కన్నౌజ్‌, మయిన్‌పురి జిల్లాలు మినహా మిగతా అన్ని చోట్లా బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేసింది.

ఈ నేపథ్యంలో.. 2012 ఫలితాలను పునరావృతం చేయాలని ఎస్‌పీ.. 2014 ఫలితాలను నిలుపుకోవాలని బీజేపీ.. ఆ రెండిటినీ అధిగమించాలని బీఎస్‌పీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఈ మూడు పార్టీల మధ్యా హోరాహోరీ పోరాటం నెలకొంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం లక్నో, ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ స్వస్థలమైన ఇటావా, ఆయన భార్య ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం కన్నౌజ్, ఎస్‌పీ ఎంపీ, ములాయం బంధువు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మయిన్‌పురి ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలకు మరింత ప్రతిష్టాత్మకం అవుతున్నాయి.

ఇది కోటీశ్వరుల ఖిల్లా!
మూడో దశ ఎన్నికల్లో పోటీపడుతున్న 826 మంది అభ్యర్థుల్లో 250 మంది కోటీశ్వరులు, 110 మంది నేర చరితులు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వాచ్‌లు వెల్లడించాయి. మొత్తం ఆరు జాతీయ పార్టీలు, ఏడు రాష్ట్ర పార్టీలు, 92 గుర్తింపులేని పార్టీల అభ్యర్థులతో పాటు.. 225 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ‘మూడో దశ’లో.. 67 మంది బీఎస్పీ అభ్యర్థుల్లో 56 మంది, 68 మంది బీజేపీ అభ్యర్థుల్లో 61 మంది, 59 మంది ఎస్పీ అభ్యర్థుల్లో 51 మంది, 14 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఏడుగురు, 40 మంది ఆర్ఎల్డీ అభ్యర్థుల్లో 13 మంది, 225 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 24 మంది.. తమకు కోటి రూపాయల కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎస్పీకి చెందిన అనూప్‌కుమార్ గుప్తా (రూ. 42 కోట్లు) అత్యధిక ధనవంతుడు. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌కపూర్ (రూ. 31 కోట్లు), ఎస్పీ అభ్యర్థి సీమా సచన్ (రూ. 29 కోట్లు) ఉన్నారు.

110 మంది నేరచరితులు: ఇక నేరారోపణలు గల 110 మంది అభ్యర్థుల్లో.. 82 మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థుల్లో 21 మంది, బీఎస్పీ అభ్యర్థుల్లో 21 మంది, ఎస్పీ అభ్యర్థుల్లో 13 మంది, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఐదుగురు, ఆర్ఎల్డీ అభ్యర్థుల్లో ఐదుగురు, స్వతంత్రుల్లో 13 మందిపై ఈ కేసులు ఉన్నాయి.

ఐదేళ్లలో పరిస్థితులు మారాయి
సమాజ్‌వాది పార్టీకి గత ఎన్నికల్లో భారీ ఆధిక్యాన్ని అందించిన ఈ 12 జిల్లాల్లో ఇప్పుడు పరిస్థితులు మారాయని.. ఆ పార్టీ ఓటు బ్యాంకును ఒకవైపు బీఎస్‌పీ, మరోవైపు బీజేపీలు కొల్లగొడుతున్న పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు చెప్తున్నారు. 2012 ఎన్నికల్లో మయిన్‌పురి, ఇటావా, ఆరాయియా, బారాబంకి, కన్నౌజ్ జిల్లాల్లో ఎస్పీ స్వీప్ చేసింది. హర్దోయ్ జిల్లాలోని 8 సీట్లలో ఆరు సీట్లను, ఫరూఖాబాద్ జిల్లాలోని నాలుగు సీట్లలో మూడు సీట్లను, ఉన్నావ్‌ జిల్లాలోని ఆరు సీట్లలో ఐదు సీట్లను గెలుచుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ, బీఎస్పీలకు ఇక్కడ విజయం నామమాత్రంగానే ఉండింది. కానీ.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుకట్టి పోటీ చేస్తున్న అధికార పార్టీకి.. అభ్యర్థుల ఎంపికల్లో గొడవలు, అసమ్మతి నేతల తిరుగుబాట్లు, కులాల పునఃసమీకరణలు వంటి అంశాలు చిక్కుల్లోకి నెడుతున్నాయని అంచనా.

పట్టణాల్లో మారుతున్న గాలి
అలాగే సంప్రదాయంగా గతంలో బీజేపీకి ఆలంబనగా ఉన్న పట్టణ ప్రాంతాలు లక్నో, కాన్పూర్‌లలో ఐదేళ్ల కిందట సైకిల్‌ హవా వీచినా.. ఇప్పుడు గణనీయమైన మార్పులు రావచ్చునంటున్నారు. ఈ రెండు జిల్లాల్లోనే 19 సీట్లు (కాన్పూర్‌ రూరల్‌ మినహాయించి) ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఇమేజీని గ్రామీణ పార్టీ నుంచి ఆధునిక పార్టీగా మార్చడానికి అఖిలేశ్‌ చేసిన కృషితో పాటు.. ఉచిత ల్యాప్‌టాప్‌లు, నిరుద్యోగ భృతి, పెన్షన్లు, ఉచిత వైద్యం వంటి హామీలు ఇక్కడ కలిసివచ్చాయి. మరోవైపు అంతర్గత పోరుతో పాటు సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఫలితంగా.. బీజేపీ ఆధిక్యం ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీని ఎస్‌పీ అధిగమించింది. లక్నోలోని 9 సీట్లలో ఏడు, కన్పూర్‌లోని 10 సీట్లలో ఐదింటిని గెలుచుకుంది. ఇక్కడ గతంలో ఎన్నడూ ఎస్‌పీకి ఈ విజయం అందలేదు. ఇక బీజేపీ లక్నోలో ఒక్క సీటు, కాన్పూర్‌లో నాలుగు సీట్లు గెలుచుకుంది. కన్పూర్‌లో మరొక సీటును కాంగ్రెస్‌ దక్కించుకుంది. అయితే.. ఇప్పుడు ఈ పట్టణ ప్రాంత ఓటర్లు మళ్లీ బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. ఎస్‌పీ, కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థుల ఎంపికలో లోపాలు, కొన్నిచోట్ల అసంతృప్త నేతల తిరుగుబాటుతో పాటు.. బీజేపీ బలమైన అభ్యర్థులను నిలపడం ఇందుకు ఒక కారణమైతే.. బీఎస్‌పీ అభ్యర్థుల వల్ల కూడా అధికార పార్టీకి నష్టం వాటిల్లేలా ఉందని చెప్తున్నారు.

లక్నోలో లక్కు ఎవరిదో..?
రాష్ట్ర రాజధాని లక్నో నగరంలోని 9 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం ఎస్పీకి చాలా కీలకమైన విషయం. వీటిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఏడు స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ, బీఎస్పీలో చెరొకటి ఖాతాలో వేసుకున్నాయి. అయితే.. 2014 పార్లమెంటు ఎన్నికల్లో లక్నో లోక్‌సభ స్థానం బీజేపీ వశమైంది. ఇప్పుడు.. ములాయం చిన్న కోడలు అపర్ణాయాదవ్ లక్నో కంటోన్మెంట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుండగా.. మరో ముగ్గురు మంత్రులు కూడా నగరంలో బరిలో ఉన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షురాలు రీటాబహుగుణజోషి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. ఆమె మీద అపర్ణాయాదవ్‌ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ తరఫున యోగేష్‌దీక్షిత్ బరిలో ఉన్నారు. సరోజినీ నగర్‌లో అఖిలేశ్‌ బంధువైన అనురాగ్‌యాదవ్‌కు ఎస్‌పీ టికెట్‌ ఇవ్వడంతో.. పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే ఆర్‌ఎల్‌డీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

బీఎస్‌పీ ఆకర్షణ మంత్రం..
ఇక ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి బీఎస్‌పీ రచించిన వ్యూహం.. ఈ మూడో దశ ఎన్నికల్లో ఆ పార్టీకి లాభించే అవకాశం ఉందనీ చెప్తున్నారు. బారాబంకి, రామ్‌నగర్‌ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఏనుగు వైపు మొగ్గుచూపుతుండటం.. ఎస్‌పీ ఠాకూర్‌ అభ్యర్థులకు ప్రతికూలంగా మారవచ్చు. సీతాపూర్‌ జిల్లాలోని లహార్‌పూర్‌, సెవాటా సీట్లతో పాటు.. కన్నౌజ్‌ జిల్లాలోని చిబ్రమావు, ఉన్నావ్‌ జిల్లాలోని బంగేర్‌మావు, ఫరూకాబాద్‌ జిల్లాలోని ఫరూకాబాద్‌ సదర్, హర్దోయ్‌ జిల్లాలోని షాహాబాద్ సీట్లలో కూడా ముస్లిం ఓటర్లు ఎక్కువగా బీఎస్‌పీ వైపు చూస్తున్నట్లు పరిశీలకులు చెప్తున్నారు.

అలాగే.. ఎతావా, భగ్వంత్‌నగర్‌ సీట్లలో బీఎస్‌పీ ముస్లిమేతర అభ్యర్థులకు.. బీజేపీ అభ్యర్థులను ఓడించగల సత్తా ఉండటంతో అక్కడి ముస్లిం ఓటర్లు కూడా ఏనుగు గుర్తుకే ఓటు వేస్తామని చెప్తున్నారు. దీనికి బీఎస్‌పీ మౌనంగా ఉపయోగిస్తున్న ‘బ్రాహ్మణ కార్డు’ కూడా తోడవుతోంది. ఈసారి 67 మంది బ్రాహ్మణ అభ్యర్థులను ఆ పార్టీ బరిలోకి దించింది. రాష్ట్రంలో మరే పార్టీ ఇంత మంది బ్రాహ్మణ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేదు. పార్టీ ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడకపోయినా కూడా.. అది దోహదం చేస్తోంది. హర్దోయ్‌ జిల్లాలోని సవాయిజ్‌పూర్, బిల్‌గ్రామ్‌-మల్లవాన్ సీట్లు, ఆరాయియా జిల్లాలోని దిబియాపూర్, ఎతావా జిల్లాలోని ఎతావా సదర్‌ సీట్లలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని బ్రాహ్మణ వర్గాలు సంప్రదాయంగా బీజేపీ మద్దతుదారులైనప్పటికీ.. ఈసారి వారిలో బీఎస్‌పీ అభ్యర్థులకు ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది.

బీఎస్‌పీకి శివ్‌పాల్‌ సాయం!
ఇక ఎస్‌పీ నాయకత్వ కుటుంబంలో ఇటీవల రచ్చరచ్చ అయిన ఆధిపత్య పోరు.. యాదవ్‌ల కోటలైన ఇటావా, మయిన్‌పురి జిల్లాల్లో ప్రతిఫలిస్తోంది. ఇక్కడ అఖిలేశ్‌ బాబాయ్‌ శివ్‌పాల్‌ యాదవ్‌ శిబిరం.. బీఎస్‌పీ అభ్యర్థులకు సాయం చేస్తున్నట్లు చెప్తున్నారు. శివ్‌పాల్‌ సన్నిహితులైన కొందరు సిటింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం.. ఆయన మద్దతుదారులను ఆగ్రహానికి గురిచేసింది. మయిన్‌పురి జిల్లాలోని కిష్నీ, కర్హాల్‌, భోగావ్‌ సీట్లలో బీజేపీ కన్నా.. బీఎస్‌పీ నుంచే అధికార పార్టీ బలమైన పోటీని ఎదుర్కొంటోంది. ఇక్‌ మయిన్‌పురి సదర్‌ నియోజకవర్గంలో శివ్‌పాల్‌ మద్దతుదారులు ఎస్‌పీ అభ్యర్థికి వ్యతిరేకంగా బాహాటంగానే పనిచేస్తున్నారు. ఇక సీతాపూర్‌ జిల్లాలో సెవాతా, బిస్వాన్‌ నియోజవర్గాల్లో పార్టీ టికెట్‌ లభించిన ఇద్దరు సిటింగ్‌ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి.. ఎస్‌పీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.

మారుతున్న కుల సమీకరణాలు
ఇక ఎస్‌సీ వర్గాల వారిలో కూడా రాజకీయ సమీకరణాలు మారుతుండటం ఎస్‌పీకి ఇబ్బందులు కలిగించే అవకాశముంది. ఈ ప్రాంతంలో బలమైన ఎస్‌సీ వర్గమైన పాసీలు సంప్రదాయంగా ఎస్‌పీ, బీఎస్‌పీ మద్దతుదారులు. అయితే.. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈ వర్గం ఓట్లను గణనీయంగా సంపాదించుకోగలిగింది. ఇప్పుడు కూడా లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్‌, హర్దోయ్‌ జిల్లాలోని బలామావు, సాండీ (మూడూ ఎస్‌సీ రిజర్వుడు స్థానాలు)ల్లో కమలదళం బలమైన పాసీ అభ్యర్థులను రంగంలోకి దించడంతో ఆ వర్గాల వారు బీజేపీ వైపు మొగ్గుతున్నట్లు చెప్తున్నారు. బారాబంకి-సీతాపూర్‌ ప్రాంతంలో కుర్మీల అసంతృప్తి కూడా ఎస్‌పీకి సమస్యగా మారిందని పరిశీలకులు చెప్తున్నారు. ఎస్‌పీ రాజ్యసభ్యుడు, కుర్మీ నాయకుడు అయిన బేణీప్రసాద్‌వర్మ కుమారుడికి టికెట్‌ నిరాకరించడంతో.. ఆ వర్గం వారు బీఎస్‌పీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement