ఆఖరి పోరు.. ఎవరిది జోరు?
వారణాసిపైనే అందరి దృష్టీ
ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల యుద్ధం బుధవారంతో ముగుస్తోంది. చివరిదైన ఏడో దశలో పోలింగ్ 40 సీట్లకు జరుగుతోంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగాల్సి ఉన్న ఆలాపూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మరణించడంతో అక్కడ గురువారం ఎన్నిక ఉంటుంది. ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లా ఈ చిట్టచివరి పోలింగ్ జరిగే ప్రాంతంలో ఉండటంతో ఈ దశకు సహజంగానే ప్రాధాన్యం పెరిగింది.
మొత్తం ఏడు జిల్లాల్లో పోలింగ్ జరగనుండగా వాటిలోని వారణాసి, ఘాజీపూర్, మీర్జాపూర్, చందౌలీ, జౌన్ భోజ్‌పురీ ప్రాంతంలోనివే. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 40 సీట్లలో ఎస్పీ అత్యధికంగా 23 గెల్చుకోగా, బీఎస్పీ 5, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇతర పార్టీలు 5 సీట్లు సాధించాయి. ఈ ఏడింటిలో సీట్ల రీత్యా చిన్న జిల్లా భదోహీ( 3 సీట్లు) కాగా, పెద్దది జౌన్ పూర్(9).
కులం ప్రభావం ఎక్కువే!
అన్ని విధాలా వెనుకబడిన ఆరు జిల్లాల్లో యాదవులు, బ్రాహ్మణులు, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. 2012 ఎన్నికల్లో వీరే యాదవ పరివార్ నాయకత్వంలోని ఎస్పీ 20కి పైగా సీట్లు కైవసం చేసుకోవడానికి తోడ్పడ్డారు. అలాగే బ్రాహ్మణులు, ఠాకూర్లతోపాటు యాదవేతర బీసీల మద్దతు 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని విజయాన్నందించింది. కొండలు, అడవులతో పాటు సంపన్న వర్గాల దోపిడీ కూడా ఉండటంతో నక్సలైట్లకు కూడా మూడు జిల్లాల్లో జనాదరణ ఉంది.
అప్నాదళ్‌తో పొత్తు లాభిస్తుందా?
కుర్మీల(పటేళ్లు) పార్టీగా పరిగణించే అప్నాదళ్(సోనేలాల్)తో బీజేపీ పొత్తుపెట్టుకుంది. ఈ పార్టీ నాయకురాలు మీర్జాపూర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్. అనుప్రియ అప్నాదళ్ ఈ ప్రాంతంలో 11 సీట్లలో బీజేపీతో కలిసి పోటీచేస్తోంది. ఆమె తల్లి కృష్ణ పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్ కూడా యూపీలో 150 సీట్లకు ఒంటరిగా పోటీచేసింది. భారతీయ సమాజ్ పార్టీతో కూడా బీజేపీ కలిసి పోటీచేస్తుండడంతో చివరి దశ పోలింగ్ జిల్లాల్లో ఈసారి పరిస్థితి కమలానికి అనుకూలంగా ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.