వారిది ‘ప్రజాపతి’ మంత్రం
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కాపాడుతున్నారు
♦ కొందరి కోసం.. కొందరి అభివృద్ధికే వారు పనిచేస్తున్నారు
♦ అఖిలేశ్, ఎస్పీ–కాంగ్రెస్‌లపై ప్రధాని మోదీ విమర్శలు
♦ వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని
జౌన్ పూర్(ఉత్తర్‌ప్రదేశ్): అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు గాయత్రి ప్రజాపతి విషయంలో యూపీ సీఎం అఖిలేశ్ నిద్రపోతున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ప్రజలను హింసించిన వారికి బుద్ది చెప్పే అవకాశం ఓటర్లకు వచ్చిందని, చిత్రహింసలకు గురిచేసిన వారికి పిండప్రదానం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ మాదిరి ‘అందరి కోసం.. అందరి అభివృద్ధికే..’ నినాదంలా కాకుండా.. ‘ప్రతిపక్షాలు కొందరి కోసం.. కొందరి అభివృద్ధికే..’’అనే నినాదంతో పనిచేస్తున్నాయని విమర్శించారు. దేశంలో మనం ఏదైనా మంచిపని చేసేటప్పుడు లేదా చేసినప్పుడు గాయత్రి మంత్రం పఠిస్తామని, కానీ, ఎస్‌పీ–కాంగ్రెస్ కూటమి మాత్రం ‘గాయత్రి ప్రజాపతి’ మంత్రాన్ని పఠిస్తోందన్నారు.
ప్రజాపతిపై ఓ కేసు నమోదైందని, కానీ సీఎం ఆయన కోసం ప్రచారం చేశారని, అప్పుడు ప్రజాపతి అక్కడికి వచ్చారని, కానీ ఇప్పుడు పోలీసులకు ప్రజాపతి ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని చెపుతున్నారని విమర్శించారు. ఓ కూతురు న్యాయం కోసం ఎదురుచూస్తోందని, కానీ సీఎం నిందితునికి కొమ్ముకాస్తున్నారని ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందన్నారు. ఓ మంత్రి గేదెలు తప్పిపోతే మాత్రం.. మొత్తం ప్రభుత్వమే వాటి కోసం పరుగులు పెడుతుందని.. అదే న్యాయం కోసం ఓ కూతురు కన్నీరు పెట్టుకుంటున్నా.. ముఖ్యమంత్రి, పోలీసులు నిద్రపోతున్నారని.. ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమేథీలో ఎస్‌పీ టికెట్‌పై పోటీచేస్తున్న ప్రజాపతి తరఫున ఇటీవల అఖిలేశ్ ప్రచారం నిర్వహించారు.
అయితే ఓ మైనర్ బాలికపై అత్యాచారం.. ఆమె తల్లిపై సామూహిక అత్యాచారం అభియోగాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రజాపతిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అఖిలేశ్ కామ్ బోల్తా హై(పనే మాట్లాడుతుంది) నినాదంపై ప్రధాని స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్యకలాపాలపై తాను కొన్ని ఎన్నికల సభల్లో ప్రశ్నించగానే.. దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి తొలగించారని, ఇదేనా మీరు చెప్పే పని మాట్లాడే పద్ధతి అని ప్రశ్నించారు.
ఉత్తరప్రదేశ్‌కు విద్యుత్ ఇస్తామంటే ముఖ్యమంత్రి వద్దన్నారంటూ.. విద్యుత్ విషయంలో ముఖ్యమంత్రి నిజాలే చెపుతున్నారా అని ప్రజలను ప్రశ్నించారు. ‘లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణం చేస్తే.. నేను (మోదీ) ఎస్పీకి ఓటేస్తానని అఖిలేశ్‌జీ చెప్పారు. కానీ.. జౌన్ పూర్‌లోని ఖేతాసరాయ్–ఖుతాన్ రోడ్లపై కొత్త మిత్రుడు (రాహుల్)తో కలిసి సైకిల్‌పై ప్రయాణించండని అఖిలేశ్‌ను కోరుతున్నా. ఆ తర్వాత ఆయనే ఎస్పీకి ఓటేయరు’ అని ప్రధాని మోదీ విమర్శించారు.
మోదీపై కేసు నమోదుచేయండి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ముందస్తు అనుమతి లేకుండా వారణాసిలో రోడ్‌షో నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ప్రధాని మోదీతో పాటు ఇతర బీజేపీ నేతలపై కేసులు నమోదుచేయాలని శనివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని(ఈసీ) కోరింది. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని ఈసీ రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించింది. సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే ప్రధాని మోదీ వారణాసిలో రోడ్‌షో నిర్వహించారని కాంగ్రెస్ ఈసీకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది.
వారణాసిలో మోదీ పూజలు..
వారణాసి: లోక్‌సభకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలోని కాశీవిశ్వనాథునికి, కాల భైరవునికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం వారణాసిలో ప్రధాని రోడ్‌షో నిర్వహించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభైన ఈ రోడ్‌షో వారణాసి వీధుల గుండా సాగింది. ఈ రోడ్‌షోలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూత్వ సిద్ధాంతకర్త మదనమోహన మాలవ్య విగ్రహానికి మోదీ నివాళులర్పించారు. ఆఖరి దశ ఎన్నికలు జరగనున్న వారణాసి ప్రాంతంలో మొత్తం 49 నియోజకవర్గాలు ఉన్నాయి.