అఖిలేశ్, రాహుల్ అసమర్థులు
వాళ్లు కఠిన నిర్ణయాలు తీసుకోలేరన్న మోదీ
► వారణాసిలో బీజేపీ భారీ బహిరంగ సభ
► ఎస్పీ, బీఎస్పీలు ఒకే నాణేనికి రెండువైపులన్న ప్రధాని
వారణాసి: యూపీ సీఎం అఖిలేశ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు సున్నితంగా ఆలోచిస్తారని.. కఠినమైన నిర్ణయాలు తీసుకోవటంలో వీళ్లు అసమర్థులని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారణాసిలో జరిగిన బహిరంగసభలో మోదీ మాట్లాడుతూ.. ‘అఖిలేశ్‌కు ఆయన తండ్రి ములాయం సింగ్ నుంచి అధికారం వచ్చింది. రాహుల్ గాంధీకి.. తాతలు తండ్రుల నుంచి వచ్చింది. ఇద్దరూ ఉచితంగా వచ్చిన అధికారాన్నే అనుభవిస్తున్నారు. వీళ్లు సున్నితంగా పెరిగారు. కఠిన నిర్ణయాలు తీసుకోలేరు. నేను గెలిచింది కాశీ ప్రజల ఆశీర్వాదం తోనే. అందుకే కఠినమైన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని సమస్యలనుంచి బయటపడేస్తా. ఆ ధైర్యం నాకుంది’ అని మోదీ పేర్కొన్నారు. ఎస్పీ, బీఎస్పీలు రెండూ ఒకే నాణేనికి రెండు వైపులన్నారు.
దేశం మొత్తం నోట్లరద్దు నిర్ణయాన్ని సమర్థిస్తే.. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. యూపీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే బాధ్యత తనదని ఓటర్లకు ప్రధాని భరోసా ఇచ్చారు. ఇటీవల దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ దారుణంగా ఓడిపోతోందని.. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండేదని పరిశోధకులు చెప్పుకునే రోజు వస్తుందని మోదీ అన్నారు. వారణాసి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న చిరు వ్యాపారులు అవినీతిపై చేస్తున్న దాడుల గురించి భయపడాల్సిన పనిలేదని.. రాజకీయ నాయకులు, అధికారులే దేశాన్ని దోచుకున్నారని ప్రధాన మంత్రి తెలిపారు.
పథకాల అమల్లోనూ అఖిలేశ్ వివక్ష
ఎస్పీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో వివక్ష చూపిందని.. ‘కుఛ్ కా సాథ్, కుఛ్ కా వికాస్’ అన్నట్లుగానే పనిచేసిందని మోదీ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా అఖిలేశ్ ప్రభుత్వం అడుగడుగునా అవరోధాలు సృష్టించిందని ప్రధాని ఆరోపించారు. వారణాసికి తను ఇచ్చిన ప్రాజెక్టులను అఖిలేశ్ ఉద్దేశపూర్వకంగానే నెమ్మదింపజేశారన్నారు. తూర్పు ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి తన వద్ద బ్లూప్రింట్ సిద్ధంగా ఉందన్న మోదీ.. ఈ ప్రాంతంలో రోడ్లు, రైల్వే లైన్లు, పరిశ్రమలు తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు.
మార్చి 8న జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలని మోదీ కోరారు. ‘తూర్పు యూపీలో అభివృద్ధి పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. కేంద్రం నిధులను రాష్ట్రం ఖర్చుచేయలేకపోయింది. అందుకే వారు పెట్టిన ఖర్చు చెప్పాలని నేను అడుగుతున్నా. ప్రజానిధులను దోచుకున్నందుకు ప్రశ్నిస్తే.. నన్ను ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కలిసి విమర్శిస్తున్నాయి’ అని మోదీ తెలిపారు. తనపై కానీ తన ప్రభుత్వంపై ఒక్క అవినీతి మరక కూడా లేదని మోదీ గుర్తుచేశారు. వారణాసి ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలున్నాయి.
అంతకుముందు, బెనారసీ సాంప్రదాయ దుస్తుల్లో మోదీ రెండోరోజు ఎన్నికల ర్యాలీని ప్రారంభించారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు పార్టీ జెండాలతో ప్రధానికి స్వాగతం పలికారు. పోలీస్ లైన్స్ హెలిప్యాడ్ నుంచి పాండేపూర్ చౌరాహ వరకు కిలోమీటర్ దూరం మోదీ ర్యాలీ వెళ్లేందుకు 45 నిమిషాలు పట్టింది. మహిళలు రోడ్లకు ఇరువైపులా పూలబుట్టలతో నిలబడి మోదీపై పూలు చల్లారు.