నేనూ పేదరికం అనుభవించా..
అందుకే పేదల జీవితం బాగుపడాలని కోరుకుంటున్నా..
► కాంగ్రెస్, ఎస్‌పీ, బీఎస్‌పీ యూపీని నాశనం చేశాయి
► ఆ పార్టీలను ఎన్నికల్లో ఓడించండి: ప్రధాని మోదీ
వారణాసి: ‘‘నేను కూడా ఒకప్పుడు పేదరికం అనుభవించా. అందుకే దేశంలో ఉన్న లక్షలాది మంది పేదల జీవితాలు బాగుపడాలని కోరుకుంటున్నా..’’అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మూడు రోజులుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో మోదీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం రోహనియా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఖుషీపూర్ గ్రామంలో నిర్వహించిన ఆఖరి ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్–ఎస్‌పీ, బీఎస్‌పీలు ఉత్తరప్రదేశ్‌ను నాశనం చేశాయని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని యూపీ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని, పోలీసు విభాగంలో ప్రొఫెషనలిజం తీసుకొస్తామని పునరుద్ఘాటించారు. 2022 నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని, అప్పటికల్లా దేశంలోని ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు కల్పించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. 45 నిమిషాల పాటు సాగిన తన ప్రసంగంలో మోదీ బీజేపీ మిత్ర పక్షాలైన ఆప్నాదళ్, భారతీయ సమాజ్ పార్టీల గురించి కూడా ప్రస్తావించారు.
బీజేపీ పూర్తి మెజారిటీ వచ్చినా.. మిత్రపక్షాలతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా రైతుల అభివృద్ధిపైనే ఆధారపడిందని, వారి కొనుగోలు శక్తి పెరిగినప్పుడే దేశం ముందుకెళుతుందని చెప్పారు. 2022 నాటికి వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. 2019 నాటికి దేశంలోని ఐదు కోట్ల పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే పథకాన్ని తమ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తుచేశారు.
అఖిలేశ్ యాదవ్ సర్కార్‌పై మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో 50–60 శాతం మంది రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలోకి తీసుకొస్తే..యూపీలో మాత్రం 14 శాతం మందే ఈ పథకం కిందికి వచ్చారని, ఇది యూపీ సర్కారు వైఫల్యమేనని మండిపడ్డారు. పోటీపరీక్షల విషయంలో బంధుప్రీతి, అవినీతిల్లో ఎస్‌పీ ప్రభుత్వం కూరుకుపోయిందని, కిందిస్థాయి ఉద్యోగాలకు ఇంటర్యూలు లేకుండా చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోంటే.. అఖిలేశ్ సర్కారు మాత్రం దానికి అడ్డుపడుతోందని ఆరోపించారు.
లాల్‌బహదూర్ శాస్త్రికి నివాళి
అంతకుముందు ప్రధాని మోదీ గర్హా్వ ఘాట్ ఆశ్రమాన్ని సందర్శించారు. స్వామి శరణానంద నేతృత్వంలోని ఈ ఆశ్రమానికి ఎక్కువగా యాదవ సామాజికవర్గం వారే వస్తుంటారు. అలాగే సంప్రదాయంగా ఈ ఆశ్రమం సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా ఉంటుందనే ప్రచారం ఉంది. అనంతరం రామ్‌ఘాట్‌కు చేరుకున్న మోదీ అక్కడ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహానికి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అలాగే శాస్త్రి చిన్నతనంలో నివసించిన ఇంట్లో కాసేపు గడిపారు. కాగా, యూపీ ఎన్నికల తుది దశ ప్రచారం ముగియడంతో ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీ చేరుకున్నారు.