ఆ పార్టీలకు 11న కరెంట్ షాక్
యూపీ ఫలితాలపై ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లను ఉద్దేశించి మోదీ
మీర్జాపూర్: ఈ నెల 11న యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు విద్యుత్ షాక్‌లు తగులుతాయని ప్రధాని మోదీ అన్నారు. యూపీలో విద్యుత్ పంపిణీ సరఫరా సరిగా లేదన్న తన ఆరోపణలకు బదులుగా.. కరెంటు ఉందో లేదో తేల్చుకోవడానికి తీగ పట్టుకోవాలని సీఎం సవాల్ విసిరిన నేపథ్యంలో మోదీ స్పందించారు.
‘కరెంటు ఉందో లేదో తీగ పట్టుకుని చూడాలని అఖిలేశ్ సవాల్ విసిరారు. అయితే ఆయన కొత్త మిత్రుడు రాహుల్ గాంధీ మదిహన్ (మీర్జాపూర్) సభలో కరెంటు తీగ పట్టుకుని అందు లో కరెంటు లేదని గులాం నబీ ఆజాద్‌తో చెప్పారు. అఖిలేశ్‌జీ.. ఇప్పుడు ప్రజలు కరెంటును ప్రవహింపజేస్తున్నారు. అది ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లకు మార్చి 11న షాకిస్తుంది’ అని శుక్రవారం మీర్జాపూర్‌లో జరిగిన ఎన్నికల సభలో మోదీ అన్నారు.
ప్రతి పనికీ లంచం..
యూపీలో ప్రతి పనికి, ఉద్యోగానికి లంచాన్ని నిర్ధారించారని ఆరోపించారు. ఈ అవినీతి పోవాలంటే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లను ఓడించాలన్నారు. తన విగ్రహాలకు మీర్జాపూర్ నుంచి రాళ్లను తెప్పించుకున్నానన్న బీఎస్పీ చీఫ్ మాయావతి.. దర్యాప్తు మొదలయ్యాక రాళ్లను రాజస్థాన్ నుంచి తెప్పించుకున్నట్లు చెప్పారని, ఆమెకు మీర్జాపూర్ రాళ్లపైనా ఇంత ద్వేషమెందుకని ప్రశ్నించారు. మీర్జాపూర్‌లోని ఇత్తడి పరిశ్రమకు ప్రభుత్వం విద్యుత్ ఇచ్చి ఉంటే యువత గుజరాత్, మహారాష్ట్రలకు వలసపోయేవారు కారన్నారు.
తప్పుదారి పట్టిస్తున్నారు: అఖిలేశ్
కాన్పూర్ రైలు ప్రమాదం వెనక ఐఎస్‌ఐ హస్తముందన్న మోదీ ఆరోపణలను అఖిలేశ్ ఖండించారు. ఓట్ల కోసం బీజేపీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఘాజీపూర్ సభలో విమర్శించారు. కాన్పూర్‌లో రైలుపట్టాల బాగోగులు పట్టించుకోని రైల్వే మంత్రి.. వాటిని ఐఎస్‌ఐ ధ్వంసం చేసిందంటూ ప్రధానికి నివేదిక ఇచ్చారని, సీఎం అయిన తనకు మాట కూడా చెప్పలేదని అన్నారు.
బీజేపీకి ఆ పార్టీ శ్రేణులే బుద్ధి చెబుతాయి: మాయావతి
యూపీ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులను, నేరచరితులను నిలబెట్టిన బీజేపీకి ఆ పార్టీ సొంత శ్రేణులే గుణపాఠం నేర్పుతాయని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. తమ పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జాన్ పూర్ సభలో ధీమా వ్యక్తం చేశారు.