మీడియా సమావేశంలో మాయావతికి పుష్పగుచ్ఛమిస్తున్న అఖిలేశ్ యాదవ్
లక్నో/న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు కూటమిగా బరిలోకి దిగాలని గతంలో బద్ధశత్రువులైన బీఎస్పీ, ఎస్పీ పార్టీలు శనివారం నిర్ణయించుకున్నారు. శనివారం లక్నోలో∙మీడియా సమావేశంలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్, బీఎస్పీ చీఫ్ మాయావతి ఈ విషయం ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీలు చెరో 38 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి ఉంచుతాయని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా సొంత నియోజకవర్గాలు అమేథీ, రాయ్‌బరేలీల్లో తమ అభ్యర్థులు బరిలో ఉండరని వీరు చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో ఎస్‌పీ, బీఎస్‌పీలు పోటీ చేయగా మిగిలిన మరో రెండు సీట్లను చిన్న పార్టీలకు వదిలివేస్తున్నట్లు ప్రకటించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో బీజేపీ 71 సీట్లు, అప్నా దళ్ రెండు చోట్ల గెలిచాయి. ఎస్‌పీకి 5, కాంగ్రెస్‌కు 2 స్థానాలు దక్కగా బీఎస్‌పీ ఒక్కటీ కూడా గెలవలేదు.
వారిద్దరికీ నిద్ర కరువే
1995లో తనపై ఎస్‌పీ కార్యకర్తలు చేసిన దాడిని మనసులో ఉంచుకోనని, జాతి ప్రయోజనాల కోసం, బీజేపీ విధానాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం అప్పట్లో జరిగిన ఆ ఘటనను పట్టించుకోనని మాయావతి స్పష్టం చేశారు. తమ కూటమి ఏర్పాటుతో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలకు ఇకపై నిద్ర కరవవుతుందన్నారు. ‘మాది సహజ కూటమి. మా బంధం లోక్‌సభ ఎన్నికల్లోనే కాదు యూపీ అసెంబ్లీ ఎన్నికల వరకూ కొనసాగుతుంది. ఇది రాజకీయ విప్లవం’ అని ప్రకటించారు. ‘ఈవీఎం దుర్వినియోగం, రామ మందిరం అంశం వంటివి లేకుంటే బీజేపీని ఓడిస్తాం’ అని తెలిపారు.
అందుకే కాంగ్రెస్‌ను కలుపుకోలేదు
కూటమిలో కాంగ్రెస్‌ను చేర్చుకోకపోవడంపై మాయావతి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పాలనలో దేశంలో పేదరికం, నిరుద్యోగం, అవినీతి విపరీతంగా పెరిగిపోయాయి. రక్షణ రంగ ఒప్పందాల్లో భారీ కుంభకోణాలు చోటుచేసుకున్నాయి. గతంలో కాంగ్రెస్‌తో బీఎస్‌పీ పొత్తు పెట్టుకున్న సమయంలో మాకు ఎలాంటి లాభం కలగలేదు. మా పార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ అయ్యాయి. కానీ, ఆ పార్టీ ఓట్లు మా అభ్యర్థులకు పడలేదు. మళ్లీ కాంగ్రెస్‌తో పొత్తుతో మాకు ప్రయోజనం ఉండదు. కానీ, ఎస్‌పీ– బీఎస్‌పీ బంధంతో ఓట్ల బదిలీ పక్కాగా జరుగుతుంది’ అని వివరించారు.
నాకూ అవమానమే: అఖిలేశ్
మాయావతి ప్రధానమంత్రి అభ్యర్థి అయితే మద్దతిస్తారా అన్న ప్రశ్నకు అఖిలేశ్ సూటిగా సమాధానం ఇవ్వకుండా ‘నేను ఎవరికి మద్దతిస్తానో మీకు తెలుసు’ అని అన్నారు. గతంలో యూపీ పలువురు ప్రధానమంత్రి అభ్యర్థులను దేశానికి అందించింది. మరోసారి అలాగే జరిగితే చాలా సంతోషం అని అన్నారు. మాయావతికి తగు గౌరవం ఇవ్వాలని ఈ సందర్భంగా తమ పార్టీ శ్రేణులకు అఖిలేశ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ‘మాయావతిని గౌరవిస్తే నన్ను గౌరవించినట్లే. ఆమెకు అవమానం నాకూ అవమానమే. బీజేపీ నేతలు కానీ మరెవరైనా కానీ ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడితే, అది నాకు వ్యతిరేకంగా మాట్లాడినట్లే భావించాలి’ అని అన్నారు. 1995లో మాయావతిపై జరిగిన ఎస్‌పీ కార్యకర్తల దాడిని దృష్టిలో ఉంచుకుని తమ శ్రేణులకు ఆయన ఈ వార్నింగ్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ‘సహనంతో ఉండి బీఎస్‌పీ కార్యకర్తలతో సోదరభావంతో మెలగండి’ అని ఎస్పీ కార్యకర్తలను అఖిలేష్ కోరారు. ఈ కూటమి ఏర్పాటును తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితరులు స్వాగతించారు.
1995లో ఏం జరిగింది?
1993లో బీజేపీని నిలువరించేందుకు ఎస్‌పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బీఎస్‌పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం చేతులు కలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి 167 సీట్లు గెలుచుకుని అధికారం చేపట్టింది. నేతల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాల నేపథ్యంలో 1995లో ఓ సమావేశంలో పాల్గొన్న బీఎస్‌పీ నేత మాయావతిపై ఎస్‌పీ కార్యకర్తలు దాడి చేశారు. ఆమె కార్యాలయాన్ని ధ్వంసం చేసి, అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో బీజేపీ నేత ఒకరు ఆమెను కాపాడారు. అనంతర పరిణామాలతో బీజేపీతో చేతులు కలిపి బీఎస్‌పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఎస్‌పీతో మాయావతి సంబంధాలు తెంచుకున్నారు. రెండు దశాబ్దాల అనంతరం మళ్లీ ఎస్‌పీకి మాయావతి స్నేహ హస్తం చాశారు.
మొత్తం స్థానాల్లో పోటీ చేస్తాం: రాహుల్
లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని అన్ని చోట్ల నుంచి అభ్యర్థులను బరిలో ఉంచుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. ఎస్‌పీ, బీఎస్‌పీ కూటమిలో కాంగ్రెస్‌కు చోటు కల్పించకపోవడంపై దుబాయ్ పర్యటనలో ఉన్న ఆయన స్పందించారు. ‘ఎస్‌పీ, బీఎస్‌పీ పార్టీల నేతలపై నాకు ఎనలేని గౌరవం ఉంది. నచ్చిన విధంగా వ్యవహరించే స్వేచ్ఛ వారికుంది. ఆ రెండు పార్టీలు రాజకీయ నిర్ణయం తీసుకున్నాయి. యూపీలో పార్టీని బలోపేతం చేసుకోవడం మా బాధ్యత. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయనున్నాం’ అని స్పష్టం చేశారు. ఈ కూటమి అస్తిత్వం కోసమే తప్ప, దేశం కోసమో, లేక ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కోసమో కాదని బీజేపీ విమర్శించింది. ఎస్‌పీ– బీఎస్‌పీ మైత్రిని అవినీతి– గూండాయిజం కూటమిగా యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment