
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి ఘోరంగా విఫలమవ్వడంతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. మిత్రపక్షమైన ఎస్పీకి కనీస ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకున్నట్టు మాయావతి మంగళవారం ప్రకటించారు. అంతేకాకుండా యూపీలో త్వరలో 11 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించి.. అఖిలేశ్ యాదవ్‌కు షాక్ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఏఎన్‌ఐ వార్తాసంస్థతో ముచ్చటించారు. యూపీలో పొత్తులు ఎందుకు వికటించాయో ఆయన విశ్లేషించారు. కొన్నిసార్లు ప్రయోగాలు విజయవంతం కాకపోయినప్పటికీ.. వాటి వల్ల మన బలహీనతలు ఏమిటో తెలుస్తాయని అఖిలేశ్ అభిప్రాయపడ్డారు. మాయావతి అంటే ఇప్పటికీ తనకు ఎనలేని గౌరవముందని తెలిపారు. పొత్తులు, ఎన్నికల్లో పోటీ అనేవి రాజకీయ అంశాలని, వీటిలో అందరికీ అన్ని మార్గాలు ఉంటాయని విశ్లేషించారు. ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనే విషయమై పార్టీ నేతలతో చర్చించి.. భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు.