లక్నో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. దీని కోసం కొన్ని సీట్లను త్యాగం చేయడానికైనా సిద్ధమని పేర్కొన్నారు. బీఎస్పీతో పొత్తు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆదివారం ఒక ర్యాలీలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే కూటమితో కలిసి పని చేస్తామన్నారు.
‘బీఎస్పీతో కలిసి కూటమి ఏర్పాటుకు మేము సిద్ధంగా ఉన్నాం. కూటమికోసం కొన్ని సీట్లను వదులుకోవడానికి రెడీగా ఉన్నాం. 2019 ఎన్నికల్లో బీజేపీని గద్దెదించడమే మా లక్ష్యం. దాని కోసం బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి పనిచేస్తాం’ అని అఖిలేష్ పేర్కొన్నారు.
కాగ ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీని గద్దెదించాలంటే రెండూ పార్టీలు కలిసి పోటీ చేయాలని భావించాయి. 2019ఎన్నికల్లో ఎస్పీతో పొత్తుకు మాయవతి కూడా అనుకూలంగా ఉన్నారు.
మతతత్వ బీజేపీని ఎదుర్కొనేందుకు లౌకిక శక్తులు ఏకం కావల్సిన అవసరముందని, దానిలో భాగంగానే ఎస్పీతో పొత్తు అని మాయావతి పేర్కొన్నారు. మరో వైపు కాంగ్రెస్ కూడా బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా పొత్తులకు సై అంటోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీని గద్దెదించాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment