
హైదరాబాద్, సాక్షి: భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఏపీలోని కూటమి ప్రభుత్వానికి (Kutami Prabhutvam) చెంపపెట్టులాంటిదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్య హక్కును గౌరవించాలని.. పోలీసులు రాజ్యాంగ ఆదర్శాలకు కట్టుబడి ఉండాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కానీ, ఏపీలో జరుగుతోంది ఏంటి?..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులపై పోలీసు వ్యవస్థను అడ్డగోలుగా ఉపయోగిస్తోంది. ఈ 9 నెలల కాలంలో వందలాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయించింది. కూటమి నేతలను గతంలో విమర్శించారని.. ఇప్పుడేమో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని.. కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఏపీలో ఈ పర్వం ఇంకా కొనసాగుతోంది.
సంబంధిత వార్త: అణచివేతతో కాదు.. భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీం కోర్టు
ప్రెస్‌మీట్ పెట్టినందుకు పోసానిలాంటి వాళ్లను జైళ్లకు పంపి ఇబ్బందులకు గురి చేసింది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరికొందరిని పీఎస్‌ల చుట్టూ తిప్పుతూ వేధింపులకు గురి చేస్తోంది కూడా. అయితే.. ఇప్పటికే కూటమి పాలనలో నమోదు అవుతున్న అక్రమ కేసులను ఏపీ హైకోర్టు తప్పుబట్టింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని భూతద్దంలో చూడడం ఆపాలని ఏపీ పోలీసులకు(AP Police) హితవు పలికింది. ప్రభుత్వ పెద్దల కోసం పని చేయొద్దంటూ పోలీసులనూ తీవ్రంగా మందలించింది. ఇది ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. తాజాగా సుప్రీం కోర్టు కూడా గుజరాత్ పోలీసులపై ఇదే తరహాలో ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
