
- కూటమి సర్కార్ పీ-4 ఈవెంట్ అట్టర్ ఫ్లాప్
- బీసీలపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు దారుణం
- పేదల పట్ల చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే
- -పేదరికాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది
- ఆ బాధ్యత నుంచి తప్పుకుంటున్న కూటమి సర్కార్
- ఇక పేదల జీవితాల్లో వెలుగులు కలే
- బడుగుల పట్ల చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది
- మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ ఫైర్
తాడేపల్లి: హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా నిర్వహించిన పీ–4 కార్యక్రమం ప్రారంభంతోనే అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ పీ4 ప్రారంభ కార్యక్రమంలో బీసీల పట్ల చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పట్ల చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపేనని మరోసారి నిరూపించుకున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే...
పేదల విషయంలో చంద్రబాబుది రెండు నాలుకల దోరణి. చంద్రబాబు పేదల అభ్యున్నతి, సంక్షేమం అంటూ మాట్లాడటమే తప్ప వాస్తవంగా వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చే ఒక్క కార్యక్రమం కూడా చేపట్టరు. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక వర్గం వారి సొంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకి పేదలన్నా, దళితులన్నా, బీసీలన్నా ఎప్పుడూ చులకన భావమే. దళిత కుటుంబంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని బహిరంగంగా వ్యాఖ్యానించిన కుల దురహంకారి. తాజాగా నిన్నటికి నిన్న ఉగాది పండగ రోజున ఆర్భాటంగా నిర్వహించిన పీ–4 కార్యక్రమంలోనూ మళ్లీ ఇదే తరహా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ బడుగు, బలహీన వర్గాల ఆలోచన అంతా ఆ పూటకే ఉంది. చెప్పినా కూడా ఆలోచించరు. ఇప్పుడొచ్చారు. సగం మంది వెళ్లిపోయారు. వారి ఆలోచన అంతా.. మీటింగ్ అయింది.. మా పని అయిపోయింది’ అనుకుంటారు.. అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. పేదలను గొప్పోళ్లను చేస్తానంటూ ఉగాదినాడు ఆర్భాటంగా కార్యక్రమం మొదలుపెట్టి, ఊకదంపుడు ఉపన్యాసాలిస్తుంటే, ఆ ప్రసంగం వినలేక వెళ్లిపోతున్న వారిని చూసి చంద్రబాబుకు కోపం కట్టలు తెంచుకుంది. వారి పట్ల తన మనసులో ఉన్న మాటను వెళ్లగక్కి బడుగులంటే తనకు ఏమాత్రం గిట్టదని మరోసారి రుజువు చేసుకున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు దళిత, బలహీన వర్గాల నుద్దేశించి అంత దారుణంగా మాట్లాడడం అత్యంత హేయం.
ఆది నుంచి ఆయనకు పేదలంటే అలుసే
చంద్రబాబుకు ఆది నుంచి పేదలంటే అలుసే. ఆయన దళితులు, బడుగు, బలహీనవర్గాలపై తనకు అలవాటైన రీతిలో మళ్ళీ మళ్ళీ నోరు పారేసుకుంటునే ఉంటారు. బడుగు, బలహీనవర్గాల ఆలోచన ఆ పూట వరకే ఉంటుందని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. పేదలను ధనికులను చేస్తానంటూ జీరో పావర్టీ పీ–4 పేరుతో నిర్వహించిన సభలోనే వారిపై తనకున్న ఏహ్య భావాన్ని చంద్రబాబుగారు బయటపెట్టారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో నాడు సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబుగారు బీసీలపై తన అక్కసు వెళ్లగక్కారు. తమ బాధలు చెప్పుకునేందుకు సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను.. ‘మీ తోకలు కత్తిరిస్తా.. ఏం తమాషాలు చేస్తున్నారా? అసలు మిమ్మల్ని ఇక్కడి వరకూ రానివ్వడమే తప్పు..’ అంటూ హూంకరించారు.
ఇంకా నేనిచ్చిన బియ్యం తింటున్నారు. నేనేసిన రోడ్లపై నడుస్తున్నారు. నాకెందుకు ఓటు వేయరు. అంటూ నంద్యాల ఉప ఎన్నికల ప్రచార సమయంలో బ్లాక్‌మెయిల్ తరహాలో పేదలను బెదిరించారు. నాయకుడి బాటలో నడుస్తున్న టీడీపీ నేతలు కూడా నోరు పారేసుకుంటున్నారు. దళితులు, బీసీల పట్ల తరచూ హీన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ‘మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు, పదవులు..?’ అంటూ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక సభలో ఎస్సీల పట్ల అవమానకరంగా మాట్లాడటం తెలిసిందే.
‘ఎస్సీలు శుభ్రంగా ఉండరు. వాళ్లు దగ్గరకు వస్తే వాసన వస్తుంది. వాళ్లకి చదువు రాదు..’ అంటూ టీడీపీలో ఉండగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దారుణంగా మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడితే టీడీపీ బీసీల పార్టీ అని చెప్పుకుంటారు. అసలు బీసీలన్నా, దళితులన్నా ఆయనకు పడనే పడదు. వారి కోసం చిత్తశుద్ధితో చేసింది ఒక్కటీ లేదు. ఎప్పటికప్పుడు మాయమాటలు చెప్పి, నమ్మించి ఓట్లు వేయించుకుని మోసం చేయడం తప్ప. టీడీపీ నుంచి రాజ్యసభకు పంపిన వారిని చూస్తే.. దళితులు, బీసీల పట్ల చంద్రబాబుకు ఉన్న అభిప్రాయం, ఆయన వైఖరి అందరికీ అర్ధమవుతుంది.
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన
ఇక గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండ, ప్రతిపక్షంపై దాడులు, హత్యలు, హత్యాయత్నాలు, ఆస్తుల విధ్వంసం యథేచ్ఛగా కొనసాగుతోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైయస్సార్‌సీపీ కార్యకర్త కురుబ లింగయ్యను దారుణంగా హత్య చేశారు. ఉగాది పండగ రోజున గుడికి వెళ్లొస్తుండగా, దారి కాచిన దుండగులు దారుణంగా హతమార్చారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
టీడీపీ ఎమ్యెల్యే పరిటాల సునీత బంధువులే హత్యకు కారణమంటూ, లింగయ్య బంధువులు ఫిర్యాదు చేసినా, పోలీసులు పట్టించుకోవడం లేదు. అనుమానితుల పేర్లు చెప్పినా, పోలీసులు ఖాతరు చేయడం లేదు. ఆ దిశలో కేసు దర్యాప్తు చేయడం లేదు. మరోవైపు లింగయ్య అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బయలుదేరిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది కొనసాగుతోందా? లేక మంత్రి నారా లోకేష్ పదే పదే చెబుతున్నట్లు రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందా? రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి. ఈ పరిస్థితిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తోంది. ఇది మంచి సంప్రదాయం కాదని హెచ్చరిస్తున్నాం. చర్యకు అనుగుణంగా ప్రతి చర్య ఉంటుందని గుర్తు చేస్తున్నాం.
పీ4 పేరుతో బాధ్యతలను విస్మరిస్తారా?
చంద్రబాబు పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రాష్ట్రంలో నిరుపదలను ధనవంతులు సహాయం చేయడం ద్వారా వారి పేదరికాన్ని తొలగిస్తానని చెప్పారు. ఆయన బీఆర్ అంబేద్కర్‌ను కోట్ చేశారు. ఆయనకు కూడా ఇలా సహయం అందడం వల్లే ఆయన ఉన్నత చదువులు చదువుకుని, ఉన్నత స్థానానికి చేరుకున్నారని గుర్తు చేశారు. ఇదే అంబేద్కర్ రాజ్యాంగంలో కొన్ని అంశాలను పేదల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనను బాధ్యతగా తీసుకుంటేనే వారు పేదరికం నుంచి బయటపడతారని చెప్పారు. ప్రజలు తాము చెల్లిస్తున్న పన్నులతో నడుస్తున్న ప్రభుత్వం తమకన్నా దిగువన ఉన్న వారికి సంక్షేమం ద్వారా చేయూతను అందించాలని, సమాజంలో అసమానతలను తగ్గించాలని కోరుకుంటారు.
కానీ చంద్రబాబు దీనికి భిన్నంగా పీ4 పేరుతో పేదలను ఆదుకునే బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ మౌలిక సూత్రాకుల అనుగుణంగా పాలించాల్సిన వారు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. షెడ్యూల్ కులాలకు ఎస్సీ సబ్‌ప్లాన్, బీసీ కులాలకు బీసీ సబ్‌ప్లాన్‌లు ఉన్నాయి. వీటిని పట్టించుకోకుండా సమాజంలోని ధనవంతులు పేదలను దత్తత తీసుకోవడం ద్వారా ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరుగుతుందని చంద్రబాబు సూత్రీకరించారు.
మీరు ఈ రాష్ట్రంలో పేదరికం ఉందనే విషయం ఆలస్యంగా అయినా చంద్రబాబు తెలుసుకున్నారు. కరోనా వంటి ప్రపంచ విపత్తు సమయంలోనే రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది, నేను ఏమీ చేయలేనని చెప్పకుండా ఎంతో బాధ్యతగా పేదలకు అండగా నిలిచిన వైయస్ జగన్ గారిని చూసి నేర్చుకోండి. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే సమయంలో ఖజానాలో ఉన్నది కేవలం రూ.100 కోట్లు మాత్రమే. అలాగే వేలాది కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం బకాయిలు పెట్టి వెళ్ళిపోయినా బెంబేలెత్తలేదు. పేదలకు ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ఎగ్గొట్టాలని ఏనాడు అనుకోలేదు. పేదల ఇళ్ళలో విద్యాజ్యోతిని వెలిగిస్తే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడుతుందని ఆనాడు స్వర్గీయ వైయస్ఆర్ ఫీజురీయింబర్స్‌మెంట్‌ను తీసుకువచ్చారు. చంద్రబాబు మాట్లాడితే బీసీల గురించి మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు దృష్టిలో కేవలం కులవృత్తులతోనే బతకాలని అనుకుంటున్నారు. అంతేకానీ బీసీలకు ఉన్నత విద్యను అందించాలని, వారి జీవితాల్లో మార్పులు తేవాలని ఏనాడు ఆలోచన చేయలేదు.