
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లడంతో కూటమి సర్కార్‌కు కంగారు పుట్టిందని.. ప్రభుత్వం నిద్రావస్థలో ఉంటే ప్రతిపక్షం సమస్యను ప్రజలకు చూపించాలి.. వైఎస్ జగన్ అదే పని చేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు, రైతు కూలీలను చంద్రబాబు ప్రభుత్వం మోసగిస్తుందన్నారు. గుంటూరు మిర్చి రైతుల విషయంలో సీఎం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
‘‘మిర్చి రైతుకు సరైన ధర లభించలేదని.. ఒప్పుకుంటూ గిట్టుబాటు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మాజీ ముఖ్యమంత్రికి అవసరమైన భద్రతను ప్రభుత్వం ఎందుకు కల్పించలేకపోయింది?. ప్రభుత్వం ఇప్పటి వరకు గిట్టుబాటు ధర నిర్ణయించలేదని మంత్రులు చెప్పడం విడ్డూరం. రైతు నష్టపోతున్నా గిట్టుబాటు ధర ప్రకటించకపోవడం దారుణం. క్వింటాల్ తర్వాత 11 వేల 600 చొప్పున కొనుగోలు చేయాలని ఉద్యానవన శాఖ రిపోర్ట్ ఇచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ లేకుండా రిపోర్టును పక్కన పడేశారు. తీవ్రమైన అసత్య ప్రచారానికి ఒడిగడుతున్నారు’’ అని వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఓ చిన్నారి వైఎస్ జగన్‌తో సెల్ఫీ తీయించుకోవటానికి ప్రయత్నిస్తే ఐటీడీపీ దారుణంగా ట్రోల్ చేసింది. విమర్శలు, ప్రతిపక్షాల నోరు నొక్కడం ద్వారా పాలన కొనసాగించాలనుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి పక్ష నేత సమస్యలను పరిశీలించడానికి వెళ్ళినా కేసు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం దారుణం’’ అని వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు.