
చిత్తూరు, సాక్షి: కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ, జనసేన శ్రేణులు రెచ్చిపోతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లిలో వైఎస్సార్‌సీపీ నేత మురళీరెడ్డిపై దాడికి పాల్పడ్డారు. గత రాత్రి మరళి ఇంటిపైకి వెళ్లిన ముప్పై మంది టీడీపీ గుండాలు వీరంగం సృష్టించారు. మురళిపై దాడికి పాల్పడింది చిత్తూరు ఎమ్మెల్యే గురజాల అనుచరుడిగా సీసీ ఫుటేజీ ద్వారా బయటపడింది.
గురజాలకు దగ్గరి మనిషి అయిన సాధు దిలీప్ నాయుడు, అతని అనుచరులు మురళిరెడ్డిపై దాడికి పాల్పడినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయ్యింది. తమ రాజకీయం మాత్రమే చెల్లాలంటూ వాళ్లు ఆయన్ని బెదిరించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న చిత్తూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
‘‘చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ రౌడీ రాజకీయలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం చేయించారు. సీపీఫుటేజీ ఆధారంగా వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి. లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం’’ అని విజయానందరెడ్డి హెచ్చరించారు.
