
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే మైనర్ బాలికపై లైంగికదాడి జరిగితే, కారకుడైన నిందితుడికి అధికారపార్టీ అండగా నిలవడం దారుణమన్నారు. తమ పార్టీకి చెందిన వ్యక్తులు ఎటువంటి ఘాతుకాలకు పాల్పడినా వారికి రక్షణ కల్పించాలన్న రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే..
సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈనెల 2వ తేదీన 12 ఏళ్ల మైనర్ బాలికపై గిడ్డెగానిపెంట గ్రామానికి చెందిన ఆర్.రమేష్ అనే టీడీపీ కార్యకర్త లైంగిక దాడి చేశాడు. పోలీస్ విచారణలో ఆ బాలికపై నిందితుడు రమేష్ అత్యాచారం చేసినట్టు నిర్ధారణ కావడంతో పోక్సో కేసు నమోదు చేశారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో వెంటనే అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనితో నిందితుడు పరారయ్యాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో ఇలాంటి ఘటన జరగడం చూసి రాష్ట్రమంతా నివ్వెరపోయింది.
ఈ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకుంటారని భావిస్తున్న తరుణంలో ఏకంగా కేసును రాజీ కుదిర్చేందుకు అధికార పార్టీకి చెందిన నేతలు రంగంలోకి దిగడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. తమ పార్టీకి చెందిన కార్యకర్తను కాపాడుకునేందుకు తెలుగుదేశం నేతలు ఏకంగా బాలిక తండ్రిని బెదిరించి, బలవంతంగా లక్ష రూపాయలకు రాజీకి రావాలని ఒత్తిడి చేశారు. దీనిలో భాగంగా రూ.20 వేలు కూడా అడ్వాన్స్‌గా చెల్లించారు. తన నియోజకవర్గంలోనే ఇటువంటి దారుణం జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదు? అంటే తన పార్టీకి చెందిన వారు ఏది చేసినా అది సమంజసమేనని సమర్థిస్తున్నారా?
గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహించే పిఠాపురం నియోజకవర్గంలో బాలికపై తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ కార్పోరేటర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆడబిడ్డలపై దాడులు చేసే వారికి అదే వారి ఆఖరి రోజు అంటూ గొప్పగా ప్రకటనలు చేసిన చంద్రబాబు తమ పార్టీ వారే కీచకులుగా మారి మహిళలు, బాలికలపై లైంగికదాడులకు పాల్పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మహిళల రక్షణ అంటూ మాట్లాడే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గంలో జరిగిన ఇటువంటి దారుణాలపై నోరు మెదపడం లేదు.
దిశయాప్‌ను నిర్వీర్యం చేశారు
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. వ్యవసనాల బారిన పడిన ఆకతాయిలు బాలికలపైనా, మహిళలపైనా దాడులకు తెగబడుతున్నారు. గతంలో మహిళల రక్షణ కోసం తీసుకువచ్చిన దిశయాప్‌ను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఎంతో గొప్పగా శక్తీయాప్‌ను తీసుకువచ్చామని ప్రచారం చేసుకుంది. అయినా కూడా రాష్ట్రంలో ప్రతిచోటా మహిళలపై ఈరకమైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటిని నివారించే చిత్తశుద్ది కూటమి ప్రభుత్వంలో కనిపించడం లేదు