సాక్షి, తాడేపల్లి: ఏపీలో తాలిబన్ల తరహా పాలన సాగుతోంది. ప్రత్యర్థి పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు ఆగడం లేదు. హత్యలు, ఆస్తుల విధ్వంసాలు నిత్యం కొనసాగుతున్నాయి. ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అమలుపై ప్రజాస్వామ్యవాదుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి మాజీ సీఎం, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లపైనా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు హెచ్చరించినా పోలీసులు పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వ ఉన్మాదంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్టవ్యాప్తంగా పచ్చమూకల దాడులు
ఎన్నికల ఫలితాలు వెలువడి నెలదాటినా రాష్ట్రంలో టీడీపీ శ్రేణుల అరాచకాలకు అంతులేకుండాపోతోంది. పచ్చమూకల దాడులతో రాష్ట్రం అట్టుడుకుతున్నా ప్రభుత్వ పెద్దలకు, పోలీసులకు పట్టడంలేదు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు కూడా స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నా ఆయనలో చలనంలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పుంగనూరు, కుప్పంలో టీడీపీ శ్రేణులు ఏం చేసినా చూసీచూడనట్లు వ్యవహరించాలని మౌఖిక ఆదేశాలిచ్చారంటూ పోలీసు వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతుండడం ఇక్కడి తీవ్రతకు అద్దంపడుతోంది.
పైగా.. పత్రికల వారికి సమాచారం ఇస్తున్నారన్న నెపంతో మళ్లీమళ్లీ దాడులకు తెగబడుతూ వికృతానందం పొందుతున్నారు. అలాగే, ఈ ఘటనలకు ప్రచారం కల్పిస్తున్నారంటూ విలేకరులను సైతం వారి ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులే లక్ష్యంగా కూటమి మూకలు చెలరేగిపోతున్నాయి. ఫలితంగా.. ప్రతిరోజూ నలుగురైదుగురు తీవ్రంగా గాయపడుతున్నారు. ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందలేని దుస్థితిలో బాధితులున్నారు.
వైఎస్సార్‌సీపీకి ఓటేశారని పది కుటుంబాలపై పగ..
పుంగనూరు నియోజకవర్గం సోమల మండల పరిధిలో నంజంపేట కమ్మపల్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీకి ఓటేశారని ఓ పది కుటుంబాలను రెండు వారాలుగా నిర్బంధించి దాడులకు పాల్పడుతూ తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ అరాచకాలు భరించలేక టీడీపీ కార్యకర్తే ఒకరు మీడియాకు వీడియోలు, ఫొటోలతో సమాచారం ఇస్తుంటే.. అవి కూడా వైఎస్సార్‌సీపీ వాళ్లే పంపుతున్నారంటూ తిరిగి ఆ పది కుటుంబాల వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు.
దీంతో.. వీరిలో ఒకటైన సుబ్రమణ్యంరెడ్డి కుటుంబం అడవిలోకి వెళ్లి తలదాచుకుంది. వీరి ఆచూకీ కోసం మిగిలిన కుటుంబాలను నానా రకాలుగా వేధిస్తున్నారు. టీడీపీ వారికి అనుకూలంగా పేపర్లపై సంతకాలు పెట్టి, కాళ్లు పట్టించుకుని క్షమించమని వేడుకుంటే ఊర్లో బతకటానికి అవకాశమిస్తామని చెబుతున్నట్లు తెలిసింది. బాధితులు గత్యంతరంలేక.. చిత్రహింసలు భరించలేక వారు చెప్పినట్లు చేసినట్లు సమాచారం. మరోవైపు.. సుబ్రమణ్యంరెడ్డి కుటుంబం గ్రామంలోకి వస్తే నిర్బంధించి చిత్రహింసలకు గురిచేయాలని భావించిన టీడీపీ శ్రేణులు వారిపై దుష్ప్రచారానికి తెరతీశారు. ఆ కుటుంబం గ్రామంలో అప్పులుచేసి పరారైందని.. వారిని అప్పజెప్పిన వారికి రూ.50 వేలు బహుమతి ఇస్తామని దంపతుల ఫొటో పెట్టి సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారు.
పాలు కొనుగోళ్లు బంద్.. పొలంలోనే టమాటా పంట..
ఇక వైఎస్సార్‌సీపీకి ఓట్లేసిన ఆ పది కుటుంబాల పంట దిగుబడులను విక్రయించకుండా కూడా టీడీపీ మూకలు అడ్డుకున్నాయి. దీంతో సుమారు 12 ఎకరాల్లోని టమాటా పంట ఎందుకూ పనికిరాకుండా పోయింది. అలాగే, ఆ కుటుంబాల వారి పాలు కూడా గ్రామంలో ఎవ్వరూ కొనుగోలు చేయటానికి వీల్లేదని హుకుం జారీచేసినట్లు తెలిసింది. అదే విధంగా.. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం సింగసముద్రానికి చెందిన అశోక్ వైఎస్సార్‌సీపీకి ఓటేశాడని అతనిపై తప్పుడు కేసు పెట్టించారు. పోలీసులు అశోక్‌ని రోజూ స్టేషన్‌కి పిలిపించుకుని టీడీపీ నేతల తిట్ల దండకం అనంతరం పొద్దుపోయాక విడిచిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్న అశోక్‌తోపాటు అతని కుటుంబంలోని వారందరిపైనా స్థానిక టీడీపీ వర్గీయులు దాడికి తెగబడ్డారు.
వృద్ధులని కనికరించకుండా ఇళ్లకు తాళాలు..
అలాగే, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మిట్టమీద కండ్రిగలో వైఎస్సార్‌సీపీకి ఓటేశారని 11 కుటుంబాలపైనా టీడీపీ శ్రేణులు కక్షగట్టారు. వారి నివాసాలు అక్రమమంటూ ఇళ్లకు తాళాలువేశారు. లోపల అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులున్నారని కూడా కనికరించలేదు. దీంతో వారు భయంతో కేకలు వేయడంతో స్థానికులు తాళాలు పగులగొట్టి వారిని రక్షించారు. టీడీపీ నేతలకు స్థానిక వీఆర్వో అండగా నిలిచినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పట్టాలున్నా తమపై కావాలనే కక్ష సాధిస్తున్నారని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు.
సర్పంచ్ సహా అజ్ఞాతంలో మరో 70 కుటుంబాలు..
ఇదిలా ఉంటే.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రూరల్ మండలం ఎంపేడు సర్పంచ్ కొండయ్య ఉంటున్న ఈశ్వరయ్య కాలనీలో వైఎస్సార్‌సీపీకి ఓటేసిన కుటుంబాల ఇళ్లలోకి టీడీపీ నేతలు చొరబడి చిన్నాపెద్దా తేడాలేకుండా బరితెగించి దాడులు చేశారు. గతనెల 11, 12, 28 తేదీల్లో జరిగిన దౌర్జన్యాలు, దాడులతో ఈశ్వరయ్య కాలనీకి చెందిన సర్పంచ్ కొండయ్య కుటుంబంతో పాటు మరో 70 గిరిజన కుటుంబాలు ఊరొదిలి వెళ్లిపోయాయి.
వీరంతా ఎక్కడున్నారో ఇంతవరకు ఆచూకీ లేదు. ఇంకా అనేకమంది వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ శ్రేణుల హెచ్చరికలతో అజ్ఞాతంలోనే ఉన్నారు. ఊర్లోకి వస్తే గంజాయి, సారా కేసులుపెట్టి జైల్లో పెడతామని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో ఇలా ప్రతిరోజూ దాడులు జరుగుతున్నా పోలీసులు మొక్కుబడిగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈశ్వరయ్య కాలనీ ఘటనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. పైగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 200కు పైగా దాడులు జరిగితే నమోదైన కేసులు మాత్రం 22 మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment