
సాక్షి, చిత్తూరు జిల్లా: జీడి నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. జీడి నెల్లూరు మండలం వరత్తూరు పంచాయతీలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త శంకర్‌రెడ్డికి చెందిన మామిడి తోటను ధ్వంసం చేశారు. టేకు చెట్లను కూడా టీడీపీ నేతలు నరికివేశారు. మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి.. రైతు శంకర్‌రెడ్డిను పరామర్శించారు.
అనంతరం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎన్నడు ఇలాంటి సంఘటనలు జరగలేదని.. టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఆర్థిక మూలాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రైతులకు రక్షణ లేకుండా పోయింది. ఇదేనా చంద్రబాబు ప్రక్షాళన, సంపద సృష్టి అంటూ మాజీ నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. మామిడి తోట, టేకు చెట్లను నరికివేసి నాలుగు రోజులైంది. ఇప్పటివరకు రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. 1970 పట్టా, పాసు పుస్తకాలు శంకర్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చింది. పచ్చని చెట్లు నరికిన కుటుంబాలు బాగు పడింది లేదు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన పట్టించుకోలేదు. సమాధానం చెప్పలేదు. పాల సముద్రం మండలంలో ఇసుక, మట్టి, గ్రానైట్ సరిహద్దులో ఉన్న తమిళనాడుకు తరలిపోతున్నా పట్టించుకోవడం లేదు. సీఎం చంద్రబాబు గంగాధర నెల్లూరు పర్యటనలో వైఎస్సార్‌సీపీ నాయకులకు ఎలాంటి లబ్ధి చేకూర్చవద్దని బహిరంగ సభలో చెప్పారు.’’ అంటూ నారాయణ స్వామి గుర్తు చేశారు.