హ్యాట్సాఫ్‌.. మీ నిబద్ధతకు ఎప్పుడూ రుణపడి ఉంటా: వైఎస్‌ జగన్‌ | YS Jagan Key Comments AT YSRCP Local Bodies Representatives Meeting Updates, Watch News Video Inside | Sakshi
Sakshi News home page

హ్యాట్సాఫ్‌.. మీ నిబద్ధతకు ఎప్పుడూ రుణపడి ఉంటా: వైఎస్‌ జగన్‌

Published Wed, Apr 2 2025 11:23 AM | Last Updated on Wed, Apr 2 2025 2:35 PM

YS Jagan Key Comments AT YSRCP local bodies Representatives Meeting Updates

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ పాలనలో పేదల నోట్లోకి నాలుగు ముద్దలు వెళ్లేవని.. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు నుంచి ఉన్న కంచం లాగిపడేసిందని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్రకార్యాలయంలో భేటీ అయిన ఆయన.. ఈ సందర్భంగా కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు.

‘‘మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీకూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హాట్సాఫ్‌. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే, 39 స్థానాలు వైఎస్సార్‌సీపీ గెలిచింది. కార్యకర్తలు తెగింపు చూపారు. తెలుగుదేశం పార్టీకి ఈ స్థానాల్లో ఎక్కడా గెలిచే నంబర్లు లేవు. వారికి సంఖ్యా బలం లేనే లేదు. కానీ.. 

భయాందోళనల ఈ ప్రభుత్వం మధ్య ఎన్నికలు నిర్వహించాలనుకుంది. పోలీసులతో భయపెట్టి, బెదిరించారు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకుంటున్న చంద్రబాబుకి బుద్ధిలేదు. వాస్తవంగా ఈ ఎన్నికలను టీడీపీ వదిలేయాలి. కానీ అధికార అహంకారంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూశారు. నిజంగా ఇది ధర్మమేనా? న్యాయమేనా?. 

చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేశారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారు. చంద్రబాబు పాలనలో అబద్ధాలు, మోసాలే కనిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ పాలనలో ఏదో ఒక బటన్‌ నొక్కేవాళ్లం. ఏదోరూపంలో ప్రతి కుటుంబానికీ మంచి జరిగింది. నాలుగువేళ్లూ నోట్లోకి పోయే పరిస్థితి ఉండేది.  చంద్రబాబు ఇప్పుడు ఉన్న ప్లేటును కూడా తీసేశాడు. ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలను కూడా పంపే పరిస్థితి ఆయనకు లేదు. 

తిరుపతి మున్సిపల్‌ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలను ప్రజలంతా చూశారు. విశాఖపట్నంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి, అక్కడ అక్రమాలు చేస్తున్నారు. మన కార్పొరేటర్లను కాపాడుకునే ప్రయత్నం మనవాళ్లు చేశారు. అక్కడ 40వ వార్డు కార్పొరేటర్‌ ఇంటికి వెళ్లి.. ఆయన భార్యను భయపెట్టే ప్రయత్నం పోలీసులు చేశారు. రామగిరిలో 10 ఎంపీటీసీల్లో 9కి వైయస్సార్‌సీపీవే. కాని అక్కడ ఎన్నిక జరగనీయకుండా అడ్డుకుంటున్నారు. భద్రత పేరుతో పోలీసులు తీసుకెళ్లి.. దారి మళ్లించి, స్వయంగా ఎస్సై ఎంపీటీసీలను కిడ్నాప్‌చేసే పరిస్థితి కనిపిస్తోంది. అప్పటికీ వినకపోతే, ఏకంగా మండల కార్యాలయంలో నిర్బంధించి బైండోవర్‌ చేశారు. అంతటితో ఆగకుండా లింగమయ్య అనే బీసీ నాయకుడ్ని చంపేశారు. ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు ఇలాంటి దారుణాలు చేయిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఇలాంటి పాలన చేస్తుందా?.. 

	ఎంపీటీసీ, జడ్పీటీసీలతో వైఎస్ జగన్ భేటీ

.. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 16కు 16 ఎంపీటీసీలు మనవాళ్లే. ఆరుగుర్ని ప్రలోభపెట్టి.. తీసుకెళ్లిపోయాడు. మరో 9 మంది వైఎస్సార్‌సీపీతోనే ఉన్నారు. వాళ్లను ఎన్నికల కేంద్రానికి వెళ్లనీయకుండా పోలీసులు, టీడీపీ వాళ్లు అడ్డుకున్నారు. కోరం లేకపోయినా.. గెలిచామని డిక్లేర్‌ చేయించుకున్నారు. రాష్ట్రానికి సీఎం, కుప్పంకు ఎమ్మెల్యే చంద్రబాబే.. అయినా సరే ఒక చిన్నపదవికోసం ఇన్ని దారుణాలు చేశారు.

ఈ ఎన్నికల్లో నా చెల్లెమ్మలు, నా అక్కలు మరింత గట్టిగా నిలబడ్డారు. దీనికి నేను గర్వపడుతున్నాను. ఇలాంటి ఘటనలు జరుగుతున్న పార్టీ ప్రజాప్రతినిధులు గట్టిగా నిలబడి స్ఫూర్తిని చూపించారు. వీరు చూపించిన స్ఫూర్తి చిరస్థాయిగా ఉంటుంది. కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన నిబద్ధతకు మీ జగన్‌ ఎప్పుడూ రుణపడి ఉంటాడు. 



చంద్రబాబు మోసాలు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి. P-4 అనే కొత్త మోసాన్ని మొదలుపెట్టాడు. సమాజంలో ఉన్న 20శాతం పేదవాళ్ల బాగోగులకు 10శాతం మందికి అప్పగిస్తాడంట!. రాష్ట్రంలో తెల్ల రేషన్‌ కార్డులు ఎన్ని ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 1.61 కోట్ల కుటుంబాలు ఉంటే అందులో 1.48శాతం కుటుంబాలకు తెల్ల రేషన్‌ కార్డుదారులు ఉన్నారు. వీరంతా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నారు. రాష్ట్రంలో ఇన్‌కం ట్యాక్స్‌ కట్టేవారు ఎంతమంది ఉన్నారో చంద్రబాబుకు తెలుసా?. రాష్ట్రంలో 8.6 లక్షల మంది ఇన్‌కంట్యాక్స్‌ కడుతున్నారు. ఆయన చెప్పిన ప్రకారం.. ఈ 1.48 కోట్ల మంది కుటుంబాలను 8.6 లక్షల మందికి అప్పగించాలి కదా?. ఇన్ని రకాలుగా మోసాలు చేస్తాడు చంద్రబాబు. 

చివరకు చంద్రబాబు మీటింగ్‌ల నుంచి ప్రజలు వెళ్లిపోతున్నారు. చంద్రబాబుకు అన్నీ తెలుసు, కాని కావాలనే మోసం చేస్తాడు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ గురించి అడిగితే రాష్ట్రం అప్పుల పాలు అంటాడు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ ఎగరగొట్టడానికి అప్పులపై అబద్ధాలు చెప్తున్నాడు. ప్రజలకు సమస్యలు వస్తే వాటి పరిష్కారంకోసం తపించే ప్రభుత్వం రావాలని ప్రజలు మళ్లీ కోరుకుంటారు. మాటచెప్తే.. ఆ మాటమీద నిలబడే ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూస్తుంటారు. 

రాబోయే రోజులు మనవి. కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. వైఎస్సార్‌సీపీ(YSRCP) అఖండ మెజార్టీతో గెలుస్తుంది. ఈసారి కార్యకర్తలకోసం కచ్చితంగా పార్టీ నిలబడుతుంది. కోవిడ్‌ కారణంగా నేను కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు. జగన్‌ 2.O దీనికి భిన్నంగా ఉంటుంది. కార్యకర్తలకోసం గట్టిగా నిలబడతాను’’ అని జగన్‌ అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement