
- రియల్ ఎస్టేట్ కు శ్రీవారిని బ్రాండ్ అంబాసిండర్ చేస్తారా?
- వెంచర్లలో శ్రీవారి ఆలయం కట్టడానికి టీటీడీ సహకారమా?
- ప్రభుత్వానికి భూమన కరుణాకర్ రెడ్డి సూటి ప్రశ్న
- జీ స్వ్కేర్ సంస్థకు అనుమతులు ఇవ్వడం తప్పు
- తిరుమల ప్రక్షాళన అని చెప్పుకోవడం తప్ప చంద్రబాబు ఏం చేయలేదు
- 10 నెలల పాలనలో కొండపై చేసిన ఒక్క మంచి పనీలేదు
- పైగా కూటమి పాలనలో తిరుమల పవిత్రత మంటగలిసిపోయింది
- కనీసం జేఈవో, ఎస్వీబీసీ చైర్మన్ ను కూడా నియమించలేకపోయారు
- తిరుమల అపచారాలపై పవన్ కళ్యాణ్ నోరెత్తకపోవడం దుర్మార్గం
- వీఐపీలకు కేంద్రంగా తిరుమలను మార్చేశారు
- సామాన్యులకు శ్రీవారి దర్శనం గగనమైపోతోంది
- ప్రెస్‌మీట్‌లో భూమన ధ్వజం
తిరుపతి: ఓ రియల్ ఎస్టేట్ సంస్ధలో టీటీడీ ఆలయాలు కట్టాలనే సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చూస్తుంటే.. శ్రీ వేంకటేశ్వరస్వామిని, టీటీడీని రియల్ ఎస్టేట్ వెంచర్స్ ప్రమోటర్లుగా వాడుకోవడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు.
‘రియల్’ వెంచర్ లో శ్రీవారి ఆలయమా?
రోజూ తిరుమల ప్రక్షాళన గురించి మాట్లాడే చంద్రబాబు ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయిన జీ స్వ్కేర్ వెంచర్ లో టీటీడీ ఆలయాన్ని నిర్మిస్తే తప్పేంటి అని అనడం దారుణం. కూటమి పాలనలో శ్రీవారి పేరు మీద భవిష్యత్తులో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని భయాందోళనలు కలుగుతున్నాయి.
దేశంలో ఎన్నో రియల్ ఎస్టేట్ సంస్థలున్నాయి. వారంతా తమ సొంత ఖర్చుతో ఆలయాలు నిర్మిస్తే వాటిని టీటీడీ తీసుకుంటుందా? ఆ వెంఛర్లకు టీటీడీ ప్రమోటర్‌గా ఉంటుందా? శ్రీ వేంకటేశ్వరస్వామిని వెంచర్లకు ప్రమోటర్‌గా చేయడం కాదా ఇది? వెంచర్ల ఆదాయం పెంచడానికి శ్రీవారిని వాడుకోవడం దుర్మార్గం కాదా? దీనికి ఆగమశాస్త్ర పండితులు సలహాలు సూచనలు ఇవ్వాలనడం ఇంకెంత దారుణమైన విషయం?
తిరుమలలో వరుస దారుణాలు
👉కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ఆలయ ప్రతిష్ట రోజురోజుకీ దిగజారిపోతుందని నెత్తీనోరూ మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తిరుమలలో జరుగుతున్న వరుస సంఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి.
👉శ్రీవారి లడ్డూలో కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు చేసిన దుష్ప్రచారం నుంచి మొదలుపెడితే ఆనాటి నుంచి అనేక ఘటనల్లో కూటమి ప్రభుత్వ దుర్మార్గాలు వరుసగా బయటపడుతూనే ఉన్నాయి. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిజమేనని చెప్పడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటికీ ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయింది.
👉చంద్రబాబు అనుమతించిన హోటల్‌కి స్వామీజీలు ధర్నాలు చేస్తే వారిని పోలీసులతో మెడపట్టి గెంటేయించారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో చంద్రబాబు వెనక్కి తగ్గి అనుమతులు రద్దు చేయాల్సి వచ్చింది.
👉తిరుమలలో జోరుగా మద్యం, మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. కొండపై బిర్యానీలు తింటున్నారు. గంజాయి, మద్యం మత్తులో భక్తుల మీద దాడులు చేస్తున్నారు. ఇవన్నీ వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలు కాదు. తిరుమల పోలీసులే ఆధారాలతో సహా పట్టుకున్నట్టు అన్ని మీడియాల్లో ఫొటోలతో సహా ప్రచురితం అయ్యాయి.
👉ఇటీవల ఒక అన్యమతస్తుడు బైకుపై తిరుమలకు వెళితే మానసిక వికలాంగుడు అని ప్రభుత్వం కవర్ చేసుకుంది. పాపవినాశనం జలపాతంలో జరిగిన బోట్ షికారు ఎందుకునే దానిపై ప్రభుత్వ శాఖల నుంచే భిన్నమైన అభిప్రాయాలు చెప్పినా, వాస్తవం ఏంటనేది ఇంతవరకు ప్రభుత్వం నుంచి సరైన వివరణ రాకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అడుగడుగునా విజిలెన్స్ లోపాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నా ప్రభుత్వం కళ్లుండీ చూసీచూడనట్టు వదిలేస్తుంది.
తేడాను ప్రజలే గుర్తించారు
తన చేతకానితనాన్ని ఒప్పుకోలేని ప్రభుత్వం భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ తమకుతామే కితాబిచ్చుకోవాల్సి దుస్థితి నెలకొంది. లడ్డూ నాణ్యత పెరిగిందని, అన్న ప్రసాదం బాగుందని తమకు తామే చెప్పుకోవడం తప్పించి, లోపాలు ఆధారాలతో సహా బహిర్గతం అవుతున్నా నష్టనివారణ చర్యలు తీసుకోవడానికి మాత్రం ప్రభుత్వానికి చేతకావడం లేదు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుమల వైభవానికి ఇప్పుడు జరుగుతున్న అరాచకాలకు తేడాను పది నెలల్లోనే భక్తులు గుర్తించారు. గత మా ప్రభుత్వంపై బురదజల్లేందుకు తిరుమల కేంద్రంగా జనసేన-టీడీపీ కలిసి చేయించిన దుష్ప్రచారాన్ని ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు.
లోకేష్ పీఏ 12 లెటర్లు పంపుతున్నాడు
👉కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమలను వీఐపీల అడ్డాగా మార్చేశారు. గత మా ప్రభుత్వ హయాంలో వీఐపీలకు రోజుకు 4 వేలు వీఐపీ టికెట్లు ఇస్తే, ఇప్పుడు రోజుకు 7500 టికెట్లు ఇచ్చి దర్శనం కోసం వస్తున్న సామాన్య భక్తులను గంటలపాటు క్యూ లైన్లలో మగ్గేలా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సమీక్షలో మాత్రం సామాన్యులకు పెద్ద పీట వేస్తామని పచ్చి అబద్ధాలు మాయమాటలు చెప్పుకుంటున్నారు.
👉మంత్రికి వీఐపీ బ్రేక్ కోసం రోజుకు ఒక లెటర్ చొప్పున ఆమోదిస్తుంటే, మంత్రి నారా లోకేష్ పీఏ సాంబశివరావు రోజుకు 12 వీఐపీ లెటర్లు పంపుతున్నాడు. అది కూడా పీఎస్ టూ సీఎంఓ పేరుతో సాంబశివరావు పంపుతున్నాడు.
👉అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఇంతవరకు ఎస్వీబీసీ చైర్మన్‌ను, తిరుమల జేఈవోను, సీవీఎస్‌వోను, బర్డ్ డైరెక్టర్‌ను నియమించలేకపోయారు. కొండ మీద పాలన పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం’ అని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో తిరుమల పవిత్రత కాపాడాం
భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో అలిపిరి వద్ద ధర్మశాలను కట్టాలనే నిర్ణయం కూడా వైఎస్సార్‌సీపీ హాయాంలో జరిగిందే. అదేదో తామే చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు.
రాయలసీమకు తలమానికంగా ఉన్న స్విమ్స్ ఆస్పత్రిని కూటమి అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేశారు.
ఏ విషయంలోనూ వైఎస్సార్‌సీపీ కన్నా మిన్నగా కూటమి పాలనలో తిరుమలలో ప్రక్షాళన చేశారో చంద్రబాబు చెప్పాలి.
ఇన్ని అరాచకాలు జరుగుతున్నా సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్, ఇంకెప్పుడు మాట్లాడతారు? కొండమీద జరుగుతున్న అపవిత్రత గురించి ప్రశ్నించలేరా?
చంద్రబాబుకి ఇదే నా సవాల్. టీడీపీ నుంచి ఏ నాయకుడిని పంపినా తిరుమల పవిత్రతపై వారితో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా.
తిరుమల కొండ మీద ఏం జరిగిందో తెలుసుకోవాలని కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశిస్తే వారి కాళ్లూ వేళ్లూ పట్టుకుని అడ్డుకున్న సంఘటన కూటమి పాలనలో జరిగిందా? లేదా? ఇలాంటి ఘటనలు ఏనాడైనా వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగినట్టు నిరూపించగలరా?
ఏ మతస్తుడైనా హిందువుగా మారడానికి తిరుమలలో ఒక వేదిక ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నది కూడా మా హయాంలోనే అనేది గర్వంగా చెబుతున్నా.
గోవింద కోటి రాసిన వారికి కుటుంబ సమేతంగా వీఐపీ దర్శనం కల్పించాలనే నిర్ణయం తీసుకున్నది కూడా వైఎస్సార్‌సీపీ హయాంలోనే. వేంకటేశ్వర దివ్యానుగ్రహ హోమం కూడా మేం తీసుకున్న నిర్ణయమే.
లడ్డూ నాణ్యత మా హయాంలో ఎలా ఉన్నదో ఇప్పుడూ అలాగే ఉన్నది. గడిచిన పది నెలల కూటమి పాలనలో ఒక్క విషయంలోనైనా ప్రక్షాళన జరిగి ఉంటే చూపించాలి. వేంకటేశ్వరుని స్వామిని రాజకీయాలకు వాడుకోవాలనే దురుద్దేశం ఇప్పటికైనా విడనాడాలి.