
తిరుపతి : ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రెచ్చిపోయి మరీ అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. వైఎస్సార్‌సీపీ విజయోత్సవ సంబరాలు చేసుకున్న క్రమంలో కూడా కేసు నమోదు చేశారంటే ఏపీ ప్రభుత్వం తీరు ఎలా ఉందో అందరికీ అర్ధమవుతోంది. నిన్న( గురువారం) తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకున్న అనంతరం సంబరాలు చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు.ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ కేసు నమోదు చేశారు. ఎస్ఐ కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు 9 మందిపై కేసు నమోదు చేశారు యూనివర్శిటీ పోలీసులు.
పోలీసుల తీరుపై ప్రజలు నవ్వుతున్నారు..
వైఎస్సార్‌సీపీ విజయోత్సవ సంబరాలు చేసుకుంటే కేసులు నమోదు చేయడాన్ని చంద్రగిరి పార్టీ ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఖండించారు. టీడీపీ తరఫున పసుపు చొక్కాలు వేసుకుని పోలీసులు పని చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరుపై ప్రజలు నవ్వుతున్నారన్నారు. పోలీసుల తీరుపై హైకోర్టు ఇటీవల వ్యాఖ్యలు చేసినా వీరిలో మార్పు రావడం లేదన్నారు మోహిత్ రెడ్డి. ఎవరో మెప్పు కోసం పోలీసులు పని చేస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ఇంకా ఏమన్నారంటే..
‘37 మంది ఎంపీటీసీ ఉంటే 34 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారు..ఎంపీపీ ఎన్నికల్లో విజయం సాధించాం. మా ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేశారు, ఎక్కడా తలొగ్గలేదు. జై జగన్ జైజై జగన్ అంటూ నినాదాలు చేస్తే వారిపై కేసు నమోదు చేస్తారా?, మా నాన్నగారిపై 88 కేసులు పెట్టారు. నాపై 4వ కేసు పెట్టారు.. నాపై మరో 40 కేసులు పెట్టిన ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. ఈ కూటమి ప్రభుత్వం పై అరాచకాలు పై మా పోరాటం కొనసాగుతుంది. జై జగన్ నినాదాలు చేసినందుకే కేసులు పెట్టడం ఆశ్చర్యం గా ఉంది..
చంద్రగిరి ఎమ్మెల్యే ప్రస్టేషన్ లో ఉన్నారు..వాళ్ళు చేసిన భూ ఆక్రమణలు బయట పడుతున్నాయి, ప్రజలు నిలదీస్తున్నారు. ఇదే తప్పుడు కేసులు కొనసాగితే.. జిల్లా ఎస్పీ కార్యాలయం ముట్టడిస్తాం, జిల్లాకు వచ్చే మంత్రిని కూడా వదిలి పెట్టం ప్రతి చోటా అడ్డుకుని నిరసన తెలుపుతాం’ అని మోహిత్ రెడ్డి హెచ్చరించారు.