
తూర్పుగోదావరి జిల్లా: కూటమి ప్రభుత్వంలోని నేతలు ఇసుక పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామంలో కూటమి నేతల ఇసుక దందాపై తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు.
అడ్డగోలుగా బాటలు వేసుకుని ఉచిత ఇసుక పేరుతో కూటమి నేతలు దందా సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక కోసం తీసిన గోతుల్లో పడి ఒక అమాఇయకుడు మృతి చెందడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన త్రిమూర్తులు.. ఇసుక పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమన్నారు.
స్నానానికి దిగి యువకుడు గల్లంతు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం కేదార లంక గ్రామంలో స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఉచిత ఇసుక పేరిట గోదావరిలో భారీ గోతులు తీయడంతో యువకుడు గల్లంతయ్యాడు. ఐదుగురు స్నానానికి దిగగా, నీటిలో ఉన్న గోతులు పసిగట్ట లేక రొట్టె దుర్గాప్రసాద్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని వెలికి తీసి కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.