
తిరుపతి,సాక్షి: గోశాల వద్ద ఘోరాలను వెలికితీస్తామని కూటమి నేతల్లో భయం పట్టుకుందని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
గోశాల మరణాలపై టీడీపీ ఎక్స్ వేదికగా ఛాలెంజ్ చేసింది. టీడీపీ సవాలును మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వీకరించారు. ఛాలెంజ్‌లో భాగంగా ఉదయం 10 గంటలకు గోశాలకు బయల్దేరిన భూమన కరుణాకరరెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి , వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ..‘గోశాలకు వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకోవడం అన్యాయం. గోవుల మృతిపై కూటమి నేతలో తలో మాట మాట్లాడుతున్నారు. నన్ను రమ్మన్న వాళ్లే అడ్డుకోవడం అన్యాయం. నేను ఒక్కడినే రావడానికి సిద్ధం. టీడీపీ నేతలు వెళ్లిపోయిన తర్వాత అనుమతి ఇస్తే ఏం లాభం. టీడీపీ నేతల ఛాలెంజ్ మీద స్పందించా. గోశాలకు రమ్మనమని పల్లా నాగేశ్వర్ రావు ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్‌ను స్వీకరించా. గోశాల వద్ద ఘోరాలను వెలకితీస్తామని కూటమి నేతల్లో భయం పట్టుకుంది. టీడీపీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అనుమతించాలి’ అని డిమాండ్ చేశారు.