
తాడేపల్లి : ఎమ్మెల్యే పరిటాల సునీత కక్ష సాధింపుతోనే కురబ లింగమయ్య హత్య గావించబడ్డాడని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. సునీత్ డైరెక్షన్, ఎస్పై సుధాకర్ ప్రోత్సాహంతోనే హత్య జరిగిందన్నారు. నిందితులను కాపాడేందుకు పోలీసులే ప్రయత్నిస్తున్నారని, రామగిరి ఎంపీపీని దక్కించుకోవటానికి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు.
తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన తోపుదుర్తి ప్రకాస్ రెడ్డి.. ఎస్పై సుధాకర్ తన ఫోన్ నుంచే పరిటాల సునీత, శ్రీరామ్ లకు వీడియో కాల్ చేసి తమ ఎంపీటీసీలను బెదిరించారని ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ గూండాలతో తమ ఎంపీటీలసీ కిడ్నాప్ చేయించటానికి ప్రయత్నించారని, దీన్ని అడ్డుకున్నందుకు తమపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారన్నారు. మండలానికొక వైఎస్సార్ సీపీ నాయకుడిని చంపాలని పరిటాల శ్రీరామ్ రెచ్చగొట్టాడని ధ్వజమెత్తారు. తమ పార్టీకి చెందిన నాయకుడు జయచంద్రారెడ్డి ఇంటి మీద రెండు రోజుల పాటు దాడులు చేశారన్నారు.
‘కురుబ లింగమయ్యను దారుణంగా కొట్టి హతమార్చారు. టీడీపీ గూండాలు ఆదర్శ్, మనోజ్, నర్సింహా, నవకాంత్, రమేష్, సురేష్ లే ఈ దారుణాలకు పాల్పడ్డారు. ఐతే పోలీసులు మాత్రం నిందితులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిటాల సునీత కనుసన్నల్లోనే పోలీసులు పని చేస్తున్నారు. చివరికి కోర్టు ఆదేశాలను కూడా పోలీసులు పాటించటం లేదు’ అని తోపుదుర్తి పేర్కొన్నారు.
