Apna Dal
-
పల్లవి పటేల్‌తో ఒవైసీ కూటమి.. తొలి జాబితా విడుదల
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం మూడు ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల ఇండియా కూటమితోపాటు ఇప్పుడు పీడీఎం (పిచ్చా, దళిత, ముసల్మాన్) కూటమి కూడా బరిలో నిలిచింది. అప్నా దళ్ కమరావాడి (ADK) నాయకురాలు పల్లవి పటేల్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసి పీడీఎం (PDM) కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమి ఉత్తరప్రదేశ్‌లో తొలి జాబితా విడుదల చేసింది. ఈ రెండు పార్టీలు కలిసి ఏడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. పీడీఎం తొలి జాబితాలో బరేలీ నుంచి సుభాష్ పటేల్, హత్రాస్ నుంచి జైవీర్ సింగ్ ధంగర్, ఫిరోజాబాద్ నుంచి న్యాయవాది ప్రేమ్ దత్ బఘేల్, రాయ్ బరేలీ నుంచి హఫీజ్ మహ్మద్ మొబీన్, ఫతేపూర్ నుంచి రామకృష్ణ పాల్, భదోహి నుంచి ప్రేమ్ చంద్ బింద్, చందౌలీ నుంచి జవహర్ బింద్ ప్రకటించారు. ఈ సమాచారాన్ని పీడీఎం కార్యాలయ కార్యదర్శి మహ్మద్ ఆషిక్ తెలిపారు. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఇండియా కూటమి తరపున పోటీ చేస్తారనే ఊహాగానాల మధ్య పీడీఎం ఇక్కడ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించుకుంది. ఇది కాంగ్రెస్ అభ్యర్థికి సమస్యగా మారుతుందని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనకు ఒక రోజు ముందుగా శుక్రవారం నాడు లక్నోలో పీడీఎం మొదటి సమావేశం జరిగింది. ఇందులో పీడీఎంకు నేతృత్వం వహిస్తున్న పల్లవి పటేల్‌తో పాటు ఏఐఎంఐఎం నేతలు కూడా పాల్గొన్నారు. నాలుగైదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను చర్చించారు. ఎన్నికల్లో సీరియస్‌గా పోటీ చేస్తామని, మిగతా స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని పీడీఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు అజయ్ పటేల్ తెలిపారు. -
ఆ అడుగుల్లో భాగమేనా? వెనక్కి తగ్గిన పల్లవి పటేల్ పార్టీ
వచ్చే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన అప్నా దళ్ (కెమెరవాడి) తన నిర్ణయాన్ని మార్చుకుంది. పార్టీ అభ్యర్థుల సవరించిన జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి రామ్ సనేహి పటేల్ ఒక ప్రకటనలో ప్రకటించారు. ‘ఇండియా’ కూటమికి చెందిన అప్నా దళ్ (కామెరవాడి) కౌశంబి, ఫుల్పూర్, మీర్జాపూర్ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అయితే తరువాత పార్టీ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ స్థానాల నుండి తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఆ పార్టీ గతంలో 2022 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఇంతకుముందు వారి సహకారం ఉన్నప్పటికీ, 2024 ఎన్నికలకు అప్నా దళ్ (కెమెరవాడి)తో పొత్తు ఉండదని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. దీంతో అప్నా దళ్ (కెమెరవాడి) త్వరలో అభ్యర్థుల కొత్త జాబితాను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. కాగా రెండు రోజుల క్రితం ఆ పార్టీ ముఖ్య నాయకురాలు పల్లవి పటేల్.. తమ పార్టీ ‘ఇండియా’ కూటమిలో ఉండాలా వద్దా అనేది కాంగ్రెస్ నిర్ణయించుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేలో చేరే అవకాశంపై సంకేతాలు ఇచ్చారు. బీజేపీ నుంచి ఏదైనా ఆఫర్ వస్తే తమ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని పల్లవి పటేల్ చెప్పారు. పార్టీ ప్రకటించిన స్థానాల విషయంలో నిర్ణయాన్ని మార్చుకోవడం ఇందులో భాగమేనా అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
అక్కా.. వచ్చేస్తున్నా! ఎన్డీఏ వైపు పల్లవి పటేల్
లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ‘ఇండియా’ కూటమికి షాకిస్తూ అప్నా దళ్ (కామెరవాడి) నాయకురాలు, సిరతు ఎమ్మెల్యే పల్లవి పటేల్ ( Pallavi Patel ) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇక పొత్తుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బిహార్‌లో ‘ఇండియా’ కూటమికి నితీష్ కుమార్ ఇచ్చిన షాకే ఉత్తరప్రదేశ్‌లోని అప్నా దళ్-కామెరవాడి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. "ప్రస్తుతం ఎన్డీఏతో చర్చలు లేవు. ఒకవేళ ఆఫర్ వస్తే తమ పార్టీ పరిశీలిస్తుంది" అని డాక్టర్ పల్లవి పటేల్ చెప్పారు. మరోవైపు అప్నా దళ్ (కామెరవాడి) ఉత్తరప్రదేశ్‌లోని మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఒక రోజు తర్వాత సమాజ్‌వాదీ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కృష్ణ పటేల్ నేతృత్వంలోని పార్టీతో పొత్తు లేదని తెలిపింది. “అప్నాదళ్ (కె), సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు 2022 అసెంబ్లీ ఎన్నికల కోసమే కానీ, 2024 ఎన్నికల కోసం కాదు” అని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. పల్లవి పటేల్ సోదరి, అప్నా దళ్ (సోనేలాల్) అధినేత్రి అనుప్రియా పటేల్ ( Anupriya Patel ) ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. అప్నా దళ్ (కే) ప్రకటించిన మూడు స్థానాల్లో మీర్జాపూర్ స్థానం నుండి అనుప్రియా పటేల్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఫుల్పూర్, కౌశంబి లోక్‌సభ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. -
ఆ గట్టున తల్లి.. ఈ గట్టున కూతురు!
‘ఇండియా’ కూటమికి మిత్రపక్షమైన అప్నా దళ్ (కామెరవాడి) ఉత్తరప్రదేశ్‌లో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఫుల్పూర్, మీర్జాపూర్, కౌశాంబి మూడు స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. “అప్నా దళ్ (కె) కేంద్ర కార్యవర్గ సమావేశం జాతీయ అధ్యక్షురాలు కృష్ణ పటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ఇండియా కూటమిలో భాగంగా మూడు స్థానాల్లో పోటీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు' అని కేంద్ర కార్యాలయ కార్యదర్శి రామ్ సనేహి పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు సీట్ల పంపకాన్ని నిర్ణయించుకున్నాయి, దాని ప్రకారం కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయగా, సమాజ్‌వాదీ పార్టీ 63 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనుంది. సమాజ్‌వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కి భదోహి సీటును ఇచ్చింది. అక్కడ లలితేష్ త్రిపాఠిని అభ్యర్థిగా నిలిపింది. అప్నాదళ్ (కె) సీట్లను ప్రకటించడంపై సమాజ్‌వాదీ పార్టీ నేతలను ప్రశ్నించగా.. దాని గురించి తమకు తెలియదన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో అప్నా దళ్ (సోనీలాల్) నాయకురాలు అనుప్రియ పటేల్ (Anupriya Patel) సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్ చరిత్ర నిషాద్పై పోటీ చేసి 2,32,008 ఓట్ల తేడాతో గెలిచారు. అప్నా దళ్ (సోనీలాల్) ఎన్డీఏ మిత్రపక్షంగా ఉంది. అనుప్రియా పటేల్ మోదీ ప్రభుత్వంలో వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనుప్రియ అప్నా దళ్ (సోనేలాల్) పార్టీని స్థాపించిన సోనే లాల్ పటేల్ కుమార్తె. రాబోయే ఎన్నికల్లో మీర్జాపూర్లో అప్నా దళ్ (సోనేలాల్) వర్సెస్ అప్నా దళ్ (కామెరావాడి) మధ్య పోటీ జరుగుతుందని భావిస్తున్నారు. -
యూపీ అసెంబ్లీ ఎన్నికలు: ఆ పార్టీలతోనే బీజేపీ పొత్తు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలతో పొత్తు ఖరారు చేసుకుంది. అప్నాదళ్, నిషాద్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ప్రకటించారు. ఈ రెండు పార్టీలకు వెనుబడిన వర్గాల నుంచి మద్దతు ఉంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు కలసికట్టుగా పోరాటం చేస్తాయని నడ్డా విలేకరుల సమావేశంలో చెప్పారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శాంతి భద్రతలు, పెట్టుబడులు, సామాజిక అభ్యున్నతిలో మంచి పనితీరుని కనబరుస్తోందని చెప్పారు. త్వరలోనే సీట్లసర్దుబాటు పూర్తవుతుం దని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న అప్నాదళ్ చీఫ్ అనుప్రియ పటేల్, నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్‌లు మోదీ ప్రభుత్వం ఒబిసిల ప్ర యోజనాల కోసం పని చేస్తుందని కొనియాడారు. చదవండి: (పశ్చిమ యూపీ బీజేపీకి కత్తిమీద సామే!) -
‘ఎస్పీ–బీఎస్పీ’కి 7 సీట్లు వదిలిన కాంగ్రెస్
లక్నో: రాజకీయంగా కీలక రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ 12కు పైగా ఎంపీ సీట్లను ఇతర పార్టీలకు వదిలేసింది. ఇందులో ఎస్పీ–బీఎస్పీ–ఆరెల్డీ కూటమికి 7 సీట్లను వదిలేసినట్లు ప్రకటించింది. వీటితో పాటు అప్నాదళ్‌కు 2 సీట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ‘7 లోక్‌సభ స్థానాల్లో మా అభ్యర్థులను బరిలో నిలపడంలేదు. ఇందులో మైన్‌పురి, కనౌజ్, ఫిరోజాబాద్ ఉన్నాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఆరెల్డీ అధ్యక్షుడు అజిత్ సింగ్, ఆయన కుమారుడు జయంత్ చౌదరి పోటీ చేస్తున్న స్థానాల్లో కూడా మా అభ్యర్థులను నిలపడంలేదు’ అని యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ తెలిపారు. అయితే ఏడో స్థానం గురించి కాంగ్రెస్ స్పష్టతనివ్వలేదు. రాయ్‌బరేలి (సోనియా గాంధీ), అమేథి (రాహుల్) పోటీ చేస్తున్న స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపడం లేదని ఎస్పీ–బీఎస్పీ–ఆరెల్డీ కూటమి ఇçప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో మైన్‌పురి నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ములాయంసింగ్ యాదవ్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కనౌజ్ నుంచి, బదౌన్, ఫిరోజాబాద్ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు ధర్మేంద్ర యాదవ్, అక్షయ్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. అప్నాదళ్‌కు గోండా, పిలిభిత్ స్థానాలను వదిలేస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. -
బీజేపీకి కేంద్ర మంత్రి అల్టిమేటం
లక్నో: మహారాష్ట్ర, తమిళనాడులలో పొత్తులు ఖరారు చేసుకుని ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీకి ఉత్తరప్రదేశ్‌లో అప్నాదళ్ షాక్ ఇచ్చింది. బీజేపీ తమ సమస్యలను పట్టించుకోకుంటే ఎన్డీఏ కూటమి నుంచి వైదోలుగుతామని అప్నాదళ్ నాయకురాలు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ ప్రకటించారు. బీజేపీ మిత్రపక్షాలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఉత్తరప్రదేశ్‌లో అప్నాదళ్ రెండు సీట్లలో విజయం సాధించింది. తర్వాత జరిగిన పరిణామాల కారణంగా అప్నాదళ్‌లో చీలిక వచ్చినప్పటికీ.. అణుప్రియా పటేల్ బీజేపీతో కలిసి ముందుకు సాగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘తమకు బీజేపీతో కొన్ని సమస్యలు తలెత్తాయి. వాటిని పరిష్కారించేందుకు బీజేపీకి పిబ్రవరి 20వ తేదీ వరకు గడువు ఇచ్చాం. కానీ వారు తమ సమస్యలపై స్పందించలేదు. బీజేపీ తమ మిత్ర పక్షాల సమస్యలను పట్టించుకోవడానికి సిద్దంగా లేదు. మేము పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాం. మా నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామ’ని తెలిపారు. గత కొంతకాలంగా అప్నాదళ్ నేతలు బీజేపీ తమ సమస్యలు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్ కోరినన్ని ఎక్కువ సీట్లు ఇవ్వకపోవడం వల్లనే వారు ఈ విధంగా మాట్లాడుతున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నాయకుల వ్యాఖ్యలను అప్నా దళ్ అధ్యక్షుడు అనీశ్ పటేల్ ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి ప్రధానిగా ఎన్నిక కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. కానీ ఉత్తరప్రదేశ్ బీజేపీ మాత్రం పద్దతి మార్చుకోవాలని సూచించారు. తమ డిమాండ్లు నెరవేరితే.. 2019 ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతిస్తామని ఆయన వెల్లడించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో భారీ సీట్లు సాధించింది. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఎస్పీ, బీఎస్పీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సమయంలో మిత్రపక్షం నుంచి హెచ్చరికలు రావడం బీజేపీకి మంచి పరిణామం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఆఖరి పోరు.. ఎవరిది జోరు?
వారణాసిపైనే అందరి దృష్టీ ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల యుద్ధం బుధవారంతో ముగుస్తోంది. చివరిదైన ఏడో దశలో పోలింగ్ 40 సీట్లకు జరుగుతోంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగాల్సి ఉన్న ఆలాపూర్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మరణించడంతో అక్కడ గురువారం ఎన్నిక ఉంటుంది. ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి జిల్లా ఈ చిట్టచివరి పోలింగ్ జరిగే ప్రాంతంలో ఉండటంతో ఈ దశకు సహజంగానే ప్రాధాన్యం పెరిగింది. మొత్తం ఏడు జిల్లాల్లో పోలింగ్ జరగనుండగా వాటిలోని వారణాసి, ఘాజీపూర్, మీర్జాపూర్, చందౌలీ, జౌన్ భోజ్‌పురీ ప్రాంతంలోనివే. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 40 సీట్లలో ఎస్పీ అత్యధికంగా 23 గెల్చుకోగా, బీఎస్పీ 5, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇతర పార్టీలు 5 సీట్లు సాధించాయి. ఈ ఏడింటిలో సీట్ల రీత్యా చిన్న జిల్లా భదోహీ( 3 సీట్లు) కాగా, పెద్దది జౌన్ పూర్(9). కులం ప్రభావం ఎక్కువే! అన్ని విధాలా వెనుకబడిన ఆరు జిల్లాల్లో యాదవులు, బ్రాహ్మణులు, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. 2012 ఎన్నికల్లో వీరే యాదవ పరివార్ నాయకత్వంలోని ఎస్పీ 20కి పైగా సీట్లు కైవసం చేసుకోవడానికి తోడ్పడ్డారు. అలాగే బ్రాహ్మణులు, ఠాకూర్‌లతోపాటు యాదవేతర బీసీల మద్దతు 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని విజయాన్నందించింది. కొండలు, అడవులతో పాటు సంపన్న వర్గాల దోపిడీ కూడా ఉండటంతో నక్సలైట్లకు కూడా మూడు జిల్లాల్లో జనాదరణ ఉంది. అప్నాదళ్‌తో పొత్తు లాభిస్తుందా? కుర్మీల(పటేళ్లు) పార్టీగా పరిగణించే అప్నాదళ్(సోనేలాల్)తో బీజేపీ పొత్తుపెట్టుకుంది. ఈ పార్టీ నాయకురాలు మీర్జాపూర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్. అనుప్రియ అప్నాదళ్ ఈ ప్రాంతంలో 11 సీట్లలో బీజేపీతో కలిసి పోటీచేస్తోంది. ఆమె తల్లి కృష్ణ పటేల్ నేతృత్వంలోని అప్నాదళ్ కూడా యూపీలో 150 సీట్లకు ఒంటరిగా పోటీచేసింది. భారతీయ సమాజ్ పార్టీతో కూడా బీజేపీ కలిసి పోటీచేస్తుండడంతో చివరి దశ పోలింగ్ జిల్లాల్లో ఈసారి పరిస్థితి కమలానికి అనుకూలంగా ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. -
'నా కుమార్తెను బీజేపీ లాక్కెళ్లింది'
వారణాసి: తన కుమార్తెను బీజేపీ లాక్కుపోయిందని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ తల్లి, అప్నాదళ్ పార్టీ అధ్యక్షురాలు కృష్ణా పటేల్ ఆరోపించారు. తమ పార్టీని బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. 'లోక్‌సభ ఎన్నికల్లో కుర్మీ సామాజిక వర్గం ఓట్ల కోసం మా పార్టీని పావుగా బీజేపీ వాడుకుంది. ఇప్పుడు మా కుటుంబంలో చిచ్చు పెట్టింద'ని కృష్ణా పటేల్ పేర్కొన్నారు. అప్నా దళ్ నుంచి బహిష్కరించిన అనుప్రియకు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టడాన్ని ఆమె తప్పుబట్టారు. నాయకత్వంపై తల్లితో విభేదించిన అనుప్రియను గతేడాది పార్టీ నుంచి బహిష్కరించారు. 'నా కూతురి విషయంలో బీజేపీ చేసింది తప్పు. నా కూతుర్ని లాక్కుపోయి మమ్మల్ని బీజేపీ మోసం చేసింది. అనుప్రియకు మంత్రి పదవి ఇస్తున్న విషయం మాట మాత్రంగానైనా మాకు చెప్పలేదు. సంకీర్ణ కూటమిలో ఉన్న పార్టీకి కనీస సమాచారం ఇవ్వకపోవడం దారుణం. మేము ఎక్కువకాలం ఎన్డీలే కొనసాగకపోవచ్చు. భవిష్యత్ ఎన్నికల్లో మేము ఒంటరిగా బరిలోకి దిగుతామ'ని కృష్ణా పటేల్ పేర్కొన్నారు. -
బీజేపీకి బిగ్ బూస్ట్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. యూపీలో అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. యూపీలో ముఖ్యంగా ఓబీసీలలో పట్టున్న ఆప్నా దళ్.. బీజేపీలో విలీనంకానున్నట్టు సమాచారం. వారణాశి-మీర్జాపూర్ ప్రాంతంలో ఆప్నా దళ్‌కు చెప్పుకోదగ్గ ఓటు బ్యాంక్ ఉంది. బీజేపీవైపు కుర్మీ ఓట్లు మళ్లే అవకాశముంది. అప్నా దళ్‌ను డాక్టర్ సోనె లాల్ పటేల్ స్థాపించారు. ప్రస్తుత లోక్‌సభలో ఆ పార్టీకి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. మంగళవారం జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆప్నా దళ్ మీర్జాపూర్ ఎంపీ అనుప్రియ పటేల్‌కు కేబినెట్ బెర్తు దక్కవచ్చని భావిస్తున్నారు. -
యూపీలో సరికొత్త రాజకీయ పరిణామం
న్యూఢిల్లీ: రానున్న యేడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆరాష్ట్రంలో సరి కొత్త రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. అప్నాదళ్ పార్టీ బీజేపీలో విలీనమైంది. ఆపార్టీకి వారణాసి, మీర్జాపూర్ లో ఓబీసీ వర్గాల్లో మంచి పట్టుంది. దీంతో యూపీలో అధిక శాతంలో ఉన్న కుర్మిల్లాల మద్దతు బీజేపీకి లభించనుంది. ప్రస్తుతం అప్నా దళ్ పార్టీకి లోకసభలో రెండు స్థానాలున్నాయి. రేపు జరుగనున్న కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఆపార్టీ మిర్జాపూర్ ఎంపీ అనుప్రియా పటేల్ కు అవకాశం దక్కనుందని సమాచారం. -
తల్లిపై ఎంపీ అనుప్రియ ఆగ్రహం
లక్నో(యూపీ): తన సోదరి పల్లవి పటేల్ కు పార్టీ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టడాన్ని అప్నా దళ్ ఎంపీ అనుప్రియ పటేల్ తప్పుబట్టారు. అప్నా దళ్ అధ్యక్షురాలు, తన తల్లి కృష్ణా పటేల్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె వ్యతిరేకించారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం తన సోదరి నియామకం చెల్లదన్నారు. పార్టీ అధ్యక్షురాలు తనకు తానుగా కొత్తపదవి సృష్టించే అధికారం లేదన్నారు. ఉపాధ్యక్ష పదవిని రద్దు చేస్తూ ఈనెల 20న జరిగిన జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవం తీర్మానం చేసిందని అనుప్రియ తెలిపారు. అనుప్రియ అప్నా దళ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అనుప్రియ అక్కను పార్టీ ఉపాధ్యక్ష పదవిలో ఇటీవల కృష్ణా పటేల్ నియమించారు.