లక్నో: మహారాష్ట్ర, తమిళనాడులలో పొత్తులు ఖరారు చేసుకుని ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీకి ఉత్తరప్రదేశ్‌లో అప్నాదళ్ షాక్ ఇచ్చింది. బీజేపీ తమ సమస్యలను పట్టించుకోకుంటే ఎన్డీఏ కూటమి నుంచి వైదోలుగుతామని అప్నాదళ్ నాయకురాలు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ ప్రకటించారు. బీజేపీ మిత్రపక్షాలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఉత్తరప్రదేశ్‌లో అప్నాదళ్ రెండు సీట్లలో విజయం సాధించింది. తర్వాత జరిగిన పరిణామాల కారణంగా అప్నాదళ్‌లో చీలిక వచ్చినప్పటికీ.. అణుప్రియా పటేల్ బీజేపీతో కలిసి ముందుకు సాగిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘తమకు బీజేపీతో కొన్ని సమస్యలు తలెత్తాయి. వాటిని పరిష్కారించేందుకు బీజేపీకి పిబ్రవరి 20వ తేదీ వరకు గడువు ఇచ్చాం. కానీ వారు తమ సమస్యలపై స్పందించలేదు. బీజేపీ తమ మిత్ర పక్షాల సమస్యలను పట్టించుకోవడానికి సిద్దంగా లేదు. మేము పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాం. మా నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామ’ని తెలిపారు. గత కొంతకాలంగా అప్నాదళ్ నేతలు బీజేపీ తమ సమస్యలు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్ కోరినన్ని ఎక్కువ సీట్లు ఇవ్వకపోవడం వల్లనే వారు ఈ విధంగా మాట్లాడుతున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నాయకుల వ్యాఖ్యలను అప్నా దళ్ అధ్యక్షుడు అనీశ్ పటేల్ ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి ప్రధానిగా ఎన్నిక కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. కానీ ఉత్తరప్రదేశ్ బీజేపీ మాత్రం పద్దతి మార్చుకోవాలని సూచించారు. తమ డిమాండ్లు నెరవేరితే.. 2019 ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతిస్తామని ఆయన వెల్లడించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో భారీ సీట్లు సాధించింది. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఎస్పీ, బీఎస్పీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సమయంలో మిత్రపక్షం నుంచి హెచ్చరికలు రావడం బీజేపీకి మంచి పరిణామం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment