లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం మూడు ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ, కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల ఇండియా కూటమితోపాటు ఇప్పుడు పీడీఎం (పిచ్చా, దళిత, ముసల్మాన్) కూటమి కూడా బరిలో నిలిచింది.
అప్నా దళ్ కమరావాడి (ADK) నాయకురాలు పల్లవి పటేల్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసి పీడీఎం (PDM) కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమి ఉత్తరప్రదేశ్‌లో తొలి జాబితా విడుదల చేసింది. ఈ రెండు పార్టీలు కలిసి ఏడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి.
పీడీఎం తొలి జాబితాలో బరేలీ నుంచి సుభాష్ పటేల్, హత్రాస్ నుంచి జైవీర్ సింగ్ ధంగర్, ఫిరోజాబాద్ నుంచి న్యాయవాది ప్రేమ్ దత్ బఘేల్, రాయ్ బరేలీ నుంచి హఫీజ్ మహ్మద్ మొబీన్, ఫతేపూర్ నుంచి రామకృష్ణ పాల్, భదోహి నుంచి ప్రేమ్ చంద్ బింద్, చందౌలీ నుంచి జవహర్ బింద్ ప్రకటించారు. ఈ సమాచారాన్ని పీడీఎం కార్యాలయ కార్యదర్శి మహ్మద్ ఆషిక్ తెలిపారు.
ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఇండియా కూటమి తరపున పోటీ చేస్తారనే ఊహాగానాల మధ్య పీడీఎం ఇక్కడ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించుకుంది. ఇది కాంగ్రెస్ అభ్యర్థికి సమస్యగా మారుతుందని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనకు ఒక రోజు ముందుగా శుక్రవారం నాడు లక్నోలో పీడీఎం మొదటి సమావేశం జరిగింది. ఇందులో పీడీఎంకు నేతృత్వం వహిస్తున్న పల్లవి పటేల్‌తో పాటు ఏఐఎంఐఎం నేతలు కూడా పాల్గొన్నారు.
నాలుగైదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను చర్చించారు. ఎన్నికల్లో సీరియస్‌గా పోటీ చేస్తామని, మిగతా స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని పీడీఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు అజయ్ పటేల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment