న్యూఢిల్లీ, సాక్షి: సుదీర్ఘంగా సాగుతున్న(46 రోజులపాటు) సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా.. రేపు(మే 25, శనివారం) ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఉదయం 7గం.కు పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ విడతలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 889 మంది ఎన్నికల బరిలో నిలబడ్డారు.
ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోటాపోటీగా సాగిన ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. ఢిల్లీ పరిధిలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో, హర్యానాలోని మొత్తం 10 స్థానాల్లో ఒకేదఫాలో శనివారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటితోపాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల మూడో విడతలో 42 ఎమ్మెల్యే స్థానాలకూ రేపే పోలింగ్ జరగనుంది.
బరిలో ముఖ్య నేతలు
బీజేపీ నేతలు మనోహర్ లాల్ ఖట్టర్(హరియాణాలోని కర్నాల్), ధర్మేంద్ర ప్రధాన్(ఒడిశాలోని సంబల్‌పూర్), అభిజిత్ గంగోపాధ్యాయ్(పశి్చమబెంగాల్‌లోని తామ్లుక్), నవీన్ జిందాల్ (కురుక్షేత్ర), రావు ఇందర్‌జిత్ సింగ్( గురుగ్రామ్), మేనకా గాంధీ( ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్)తోపాటు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ( జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్–రాజౌరీ) బరిలో ఉన్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ నేత మనోజ్ తివారీ, కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ పోటీ పడుతున్నారు.
ఇప్పటివరకు ఐదు దశల్లో వివిధ రాష్ట్రాల్లో 428 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. జూన్ 1వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఏడో విడత మిగిలిన 57 స్థానాలకు పోలింగ్‌తో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన లోక్‌సభతో పాటు ఒడిషా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. తెలంగాణ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment