'నా కుమార్తెను బీజేపీ లాక్కెళ్లింది'
వారణాసి: తన కుమార్తెను బీజేపీ లాక్కుపోయిందని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ తల్లి, అప్నాదళ్ పార్టీ అధ్యక్షురాలు కృష్ణా పటేల్ ఆరోపించారు. తమ పార్టీని బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. 'లోక్సభ ఎన్నికల్లో కుర్మీ సామాజిక వర్గం ఓట్ల కోసం మా పార్టీని పావుగా బీజేపీ వాడుకుంది. ఇప్పుడు మా కుటుంబంలో చిచ్చు పెట్టింద'ని కృష్ణా పటేల్ పేర్కొన్నారు. అప్నా దళ్ నుంచి బహిష్కరించిన అనుప్రియకు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టడాన్ని ఆమె తప్పుబట్టారు. నాయకత్వంపై తల్లితో విభేదించిన అనుప్రియను గతేడాది పార్టీ నుంచి బహిష్కరించారు.
'నా కూతురి విషయంలో బీజేపీ చేసింది తప్పు. నా కూతుర్ని లాక్కుపోయి మమ్మల్ని బీజేపీ మోసం చేసింది. అనుప్రియకు మంత్రి పదవి ఇస్తున్న విషయం మాట మాత్రంగానైనా మాకు చెప్పలేదు. సంకీర్ణ కూటమిలో ఉన్న పార్టీకి కనీస సమాచారం ఇవ్వకపోవడం దారుణం. మేము ఎక్కువకాలం ఎన్డీలే కొనసాగకపోవచ్చు. భవిష్యత్ ఎన్నికల్లో మేము ఒంటరిగా బరిలోకి దిగుతామ'ని కృష్ణా పటేల్ పేర్కొన్నారు.