ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నేడు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు ఎంపీలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్నాదళ్ (ఎస్) నాయకురాలు అనుప్రియా పటేల్ మోదీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఇంతకీ అనుప్రియా పటేల్ ఎవరు?
అనుప్రియా పటేల్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 1981 ఏప్రిల్ 28న జన్మించారు. ‘అప్నా దళ్’ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అనుప్రియ తన విద్యను లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఛత్రపతి సాహూ జీ మహారాజ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఆమె సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పూర్తి చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ పార్లమెంట్ స్థానం నుంచి అప్నాదళ్ (ఎస్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌కు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ఈసారి టికెట్ ఇచ్చింది. అనుప్రియ పటేల్ 37,810 ఓట్ల తేడాతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థి రమేష్ చంద్ బింద్‌పై విజయం సాధించారు. ఎన్డీఏ అభ్యర్థిగా పటేల్ వరుసగా మూడోసారి ఇక్కడ నుంచి విజయం సాధించారు. గతంలో అంటే 2014, 2019 ఎన్నికల్లో కూడా ఆమె ఇక్కడి నుంచే గెలుపొందారు.
వెనుకబడిన కుర్మీ వర్గానికి చెందిన ప్రముఖ నేత, అప్నా దళ్ వ్యవస్థాపకుడు, దివంగత డాక్టర్ సోనేలాల్ పటేల్ కుమార్తె అనుప్రియా పటేల్. ఈ పార్టీ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల తర్వాత మూడవ అతిపెద్ద పార్టీ. 2009లో తన తండ్రి మరణించినప్పటి నుంచి ఆమె ‘అప్నాదళ్’ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment