అక్కడ విపక్షాల అనైక్యత బీజేపీకి వరం | BJP Upper Hand in UP By Elections | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 23 2018 2:35 PM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

BJP Upper Hand in UP By Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్‌ లోక్‌సభ స్థానాలకు మార్చి 11వ తేదీన జరుగుతున్న ఉప ఎన్నికల్లో విజయం ఎవరిదే ముందే తేలిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఈ స్థానాల్లో విజయాన్ని కాంగ్రెస్‌ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీలు సంయుక్తంగా బీజేపీకి పళ్లెంలో పెట్టి అందిస్తున్నాయని చెప్పవచ్చు. గతేడాది ఉత్తరప్రదేశ్‌కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో ఇకముందు కలిసికట్టుగా పోటీ చేయాలని ఈ మూడు పార్టీల నాయకులు ప్రకటించారు. గత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీలు కలిసి పోటీ చేయగా, బీఎస్పీ విడిగా పోటీ చేసిన విషయం తెల్సిందే. 

ఈసారి గోరఖ్‌పూర్, ఫూల్పూర్‌ లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి కట్టుగా పోటీ చేస్తాయని, తద్వారా వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలకు పాలకపక్ష బీజేపీకి ఓ సవాల్‌ను విసురుతాయని రాజకీయ పరిశీలకులు భావించారు. సాక్షి ప్రత్యేకం. ఈసారి ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఎస్పీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ ముందుగానే ప్రకటించారు. ఆయన మొండితనం తెలిసిన కాంగ్రెస్‌ పార్టీ, బీఎస్పీ నాయకురాలు మాయావతిని కదిపి చూసింది. ఆమె ఎలాంటి ఐక్యతా పిలుపునకు స్పందించలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దష్టిలోపెట్టుకొని హెచ్‌డీ దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్‌ (సెక్యులర్‌) పార్టీతో పొత్తు పెట్టుకుంది. 

ఈ నేపథ్యంలో సమాజ్‌వాది పార్టీ గోరఖ్‌పూర్‌ నుంచి సంతోష్‌ నిషాద్, ఫూల్పూర్‌ నుంచి నాగేంద్ర పటేల్‌ను రంగంలోకి దించింది. గోరఖ్‌పూర్‌లో నిషాద్‌ కులస్థులు ఎక్కువగా ఉండడంతో అదే కులస్థుడిని, ఫూల్పూర్‌లో కుర్మీలు ఎక్కువగా ఉండడంతో అదే కులస్థుడిని అభ్యర్థులుగా ప్రకటించింది. ఇక కాంగ్రెస్‌ గోరఖ్‌పూర్‌ నుంచి సుర్హీత ఛటర్జీ కరీంను, ఫూల్పూర్‌ నుంచి మనీష్‌ మిశ్రాను బరిలోకి దింపింది. బీఎస్పీ నాయకురాలు మాయావతి మాత్రం ఈ ఉప ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.సాక్షి ప్రత్యేకం. యూపీలోని ఈ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యతగా తీవ్రంగా ప్రయత్నించిందీ ఒక్క కాంగ్రెస్‌ పార్టీనే. ప్రతిపక్షాల ఐక్యత వల్ల లాభపడేది ఎక్కువగా కాంగ్రెస్‌ పార్టీనే కావడంతో ప్రాంతీయ పార్టీలు, ఇతర చిన్న పార్టీలు పట్టించుకోలేదు. 

2014లో జరిగిన లోక్‌సభ, ఆ తర్వాత జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీనే బాగా దెబ్బతిన్నప్పటికీ ఐక్యత కోసం మాయావతి కలిసి రావడం లేదు. ఆమె నిర్ణయాలు ఎవరికి అర్థం కాకుండా ఉంటున్నాయి. పొత్తుకు అంగీకరించని ఆమె ఉప ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఎలాగూ ఎన్నికలకు దూరంగా ఉన్నప్పుడు ఉమ్మడి అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్లయితే ఫలితం కచ్చితంగా వేరుగా ఉండేది. ప్రస్తుత పరిస్థితుల్లో విజయం బీజేపీ అభ్యర్థులదేనని ఎవరైనా చెప్పవచ్చు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement