సత్తా చాటాలనుకుంటున్న బీజేపీ, ఎస్పీ
ఢిల్లీ అసెంబ్లీతో పాటే ఫిబ్రవరి 5న యూపీలోని మిల్కీపూర్‌కు ఉప ఎన్నిక
ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న బీఎస్పీ
యూపీ డీజీపీని తొలగించాలని డిమాండ్ చేస్తున్న సమాజ్‌వాదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. మిల్కీపూర్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఎస్పీ, బీజేపీ రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో తమ పూర్తి బలాన్ని చాటుతున్నాయి. మిల్కీపూర్‌లో విజయం సాధించడం ద్వారా ఫైజాబాద్ లోక్‌సభ స్థానం ఓటమి నుంచి కోలుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకోగా, 2022లో తాను దక్కించుకున్న అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ఎస్పీ కృతనిశ్చయంతో ఉంది. ఇటీవల యూపీలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఏడు స్థానాల్లో గెలవగా... ఎస్పీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
2024 జనవరిలో రామమందిరాన్ని ప్రారంభించిన తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ (అయోధ్య) సీటును బీజేపీ కోల్పోయింది. ఇది లౌకికవాద విజయమని ఎస్పీ అప్పట్లో చాలా ప్రచారం చేసింది. ఇక్కడి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా అవధేష్ ప్రసాద్ ఎన్నిక కావడంతో మిల్కీపూర్ సీటు ఖాళీ అయింది. అయితే ఇప్పుడు మిల్కీపూర్ సీటును కైవసం చేసుకోవడం ద్వారా యావత్ దేశానికి అయోధ్యలో తమ బలం ఏమాత్రం తగ్గలేదన్న సందేశం ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. కాగా మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో ఇప్పుడు ఉప ఎన్నిక బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మ«ధ్య ప్రత్యక్ష పోటీగా మారింది.
కాగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యవేక్షణలో ఉన్న మిల్కీపూర్‌లో ఓటర్లను సమీకరించేందుకు ఐదారుగురు మంత్రులను బీజేపీ మొహరించింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో కుందర్కిలో మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ గెలుపునకు కారణమైన మంత్రి జేపీఎస్ రాథోడ్, ఎమ్మెల్సీ ధర్మేంద్ర సింగ్‌లకు కమలదళం మిల్కీపూర్ ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించింది.
వీరితో పాటు అయోద్య జిల్లా ఇంఛార్జ్‌గా ఉన్న మంత్రి సూర్యప్రతాప్ షాహితో పాటు స్వతంత్ర దేవ్ సింగ్, సతీష్ శర్మ, గిరీష్ యాదవ్, మయాంకేశ్వర్ సింగ్‌లతో సహా నేతల బృందం కూడా మిల్కీపూర్‌లో విజయం సాధించే బాధ్యతను తీసుకుంది. నియోజకవర్గంలో చిన్న చిన్న సమావేశాలను నిర్వహించి ఓటర్లను ఆకట్టుకొనే పనిలో ఉన్నారు. అదనంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల మిల్కీపూర్‌ను మూడుసార్లు సందర్శించి వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అంతేగాక మిల్కీపూర్‌లో 5,500 మంది యువతకు అపాయింట్‌మెంట్ లెటర్‌లు పంపిణీ చేయడంతోపాటు 3,415 మంది యువకులకు ట్యాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ పంపిణీ చేశారు.
మరోవైపు, బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించకపోగా, సమాజ్‌వాదీ పార్టీ మాత్రం తమ పార్టీ ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ కుమారుడు అజిత్ ప్రసాద్‌ను రంగంలోకి దింపింది. కాగా ఉత్తరప్రదేశ్‌లోని మిల్కీపూర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత రాజకీయ యుద్ధం ఊపందుకుంది. అక్రమాలకు కారణమయ్యే యూపీ డీజీపీని వెంటనే తొలగించాలని సమాజ్‌వాదీ పార్టీ డిమాండ్ చేస్తోంది. యూపీ డీజీపీని పదవిలో కొనసాగిస్తే, అది ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించడమే కాకుండా ఎన్నికల్లో అక్రమాలకు దారితీయవచ్చని ఎస్పీ ఆరోపిస్తోంది. డీజీపీని తొలగించి ఎన్నికలు నిర్వహిస్తే మిల్కీపూర్‌లో సమాజ్‌వాదీ పార్టీని ఏ శక్తీ ఓడించలేదని సమాజ్‌వాదీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment