సిర్సాలో ఎన్నికల ప్రచారవేదికపై రాహుల్ గాంధీ
సిర్సా(హరియాణా)/బినా(మధ్యప్రదేశ్)/ఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని అవినీతిపరుడంటూ విమర్శలు చేస్తున్న ప్రధాని మోదీ రఫేల్ ఒప్పందంలో ఏం చేసిందీ ప్రజలకు వెల్లడించాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీ, హరియాణాలోని సిర్సా, మధ్యప్రదేశ్‌లోని బినాలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ మాట్లాడారు. ‘మీరు నా గురించి, రాజీవ్ గురించి నిరభ్యంతరంగా మాట్లాడవచ్చు. కానీ, ముందుగా రఫేల్ ఒప్పందం, యువతకు 2 కోట్ల ఉద్యోగాలిస్తామంటూ చేసిన హామీ అమలు విషయం ఏం చేశారో చెప్పండి’ అని మోదీని నిలదీశారు.
‘రైతులకు మద్దతు ధర ఇచ్చారా? ప్రజల బ్యాంకు అకౌంట్లలో రూ.15 లక్షల చొప్పున జమ చేశారా?’ అంటూ గత ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలను రాహుల్ గుర్తు చేశారు. ‘తనకు 56 అంగుళాల ఛాతీ ఉందంటూ గొప్పలు చెప్పుకునే మోదీ రైతులు, నిరుద్యోగ యువత గురించి ఈ ఎన్నికల్లో మాట్లాడటం లేదు’ అని దెప్పిపొడిచారు. ‘గత ఐదేళ్లలో మీరు ఏం చేశారు? దేశానికి మీరు ఏమిచ్చారో మోదీ చెప్పాలి’అని అన్నారు. తన ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పుకునేందుకు ఏమీలేకనే గతంలో జరిగిన విషయాలపై మోదీ మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
‘మీరు ఏం చేశారు? ఏం చేయగలరు? అనేది తెలుసుకునేందుకే ప్రజలు మిమ్మల్ని ప్రధానిగా ఎన్నుకున్నారు తప్ప ఇతరులు ఏం చేశారో మీరు చెబుతారని కాదు’ అని పేర్కొన్నారు. పకోడీలను అమ్ముకోవడం కూడా మంచి ఉద్యోగమేనన్న ప్రధాని వ్యాఖ్యలపై ఆయన.. మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా పథకాల గురించి మాట్లాడే మోదీ పకోడీలతో ముగిస్తారు’ అంటూ ఎద్దేవా చేశారు. హరియాణా, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్.. ఇలా మోదీ ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో విద్వేషం నూరిపోస్తుంటారని రాహుల్ ఆరోపించారు.
మధ్యప్రదేశ్‌లో రైతులకు అమలు చేసిన రుణమాఫీ ద్వారా బీజేపీ నేతలు కూడా లబ్ధిపొందారని చెప్పారు. బీజేపీకి, మోదీకి వీడ్కోలు చెప్పాల్సిన సమయం దగ్గరపడిందని తెలిపారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు కనీసం ఆదాయం కల్పించే న్యాయ్ పథకాన్ని ప్రవేశపెడుతుంది. ఈ పథకం నిధుల్లో ఒక్క నయా పైసా కూడా మధ్యతరగతి, లేదా ఇతరుల నుంచి వసూలు చేయబోం. మోదీ హయాంలో అతిగా లాభపడిన పారిశ్రామిక వేత్తల నుంచి ఈ పథకానికి అవసరమైన నిధులను రాబడతాం’ అని అన్నారు. కాగా, ఢిల్లీలో మోదీని ఓడించే సత్తా ఆప్‌కు లేదని, కాంగ్రెస్‌కే అది సాధ్యమవుతుందని ఢిల్లీలో ప్రచారసభలో రాహుల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment