యూపీలోని లఖీంపూర్‌లో సభలో రాహుల్
లఖింపూర్ ఖేరి/ఉన్నావ్: ప్రధాని నరేంద్ర మోదీ 15 మంది ఎంపిక చేసిన వ్యక్తుల ప్రయోజనాలను మాత్రమే పరిరక్షించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులు, పేద ప్రజల ప్రయోజనాలను ఆయన విస్మరించారన్నారు. చెరకు రైతులు తమకు రావాల్సిన బకాయిలు అడిగితే, ఆ రైతుల వల్లనే షుగర్ వ్యాధి వచ్చిందని అన్నారని రాహుల్ మండిపడ్డారు. వాస్తవానికి ఈ వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసినట్లుగా చెబుతారు. 2014లో మోదీ ఎన్నో హామీలు ఇచ్చి, మంచి రోజులని చెప్పి, హామీలను నెరవేర్చలేదని రాహుల్ విమర్శించారు. లఖింపూర్ ఖేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి జాఫర్ అలీ నఖ్వీ తరఫున రాహుల్ ప్రచారం చేశారు. అనంతరం ఆయన ఉన్నావ్‌లోనూ ప్రచారంలో పాల్గొన్నారు.
రఫేల్ ఒప్పందంలో అవకతవకలు ఉన్నాయని రాహుల్ మరోసారి ప్రస్తావించారు. ఒక్క విమానాన్ని కూడా తయారు చేసిన అనుభవం లేని అనిల్ అంబానీకి మోదీ 30 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును కట్టిబెట్టారనీ, బకాయిలు అడిగిన చెరకు రైతులను మాత్రం షుగర్ వ్యాధి మీ వల్లే వచ్చిందని అన్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం తీసుకొస్తున్న కనీస ఆదాయ భద్రత పథకంతో నిరుపేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ పథకం కింద నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ. 72 వేల ఆదాయం ఉండేలా చూస్తామని కాంగ్రెస్ ప్రకటించడం తెలిసిందే. ఆర్థిక వేత్తలు, మేధావులతో సంప్రదించాకే ఈ పథకాన్ని ప్రకటించామనీ, దీని అమలు సాధ్యమేనని రాహుల్ తెలిపారు. మోదీని ఉద్దేశించి ఓ ట్వీట్ చేస్తూ ప్రజల ముందు జిత్తులమారితనం పనిచేయదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment