లక్నో : యూపీలో కాంగ్రెస్‌ను పక్కనపెట్టి ఎస్పీ, బీఎస్పీలు సీట్ల సర్ధుబాటు చేసుకోవడంతో కీలక రాష్ట్రంలో సొంతంగా పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదునుపెడుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల కోసం లౌకిక శక్తుల ఏకీకరణతో పాటు యూపీలో బలం పెంచుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఫిబ్రవరిలో పశ్చిమ యూపీలో ఏకంగా 15 ప్రచార ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రైతుల సమస్యలను ప్రధానంగా లేవెనెత్తుతూ ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో చేపటిన వ్యవసాయ రుణాల మాఫీని ప్రజల ముందుకు తీసుకువెళ్లేలా ఈ ర్యాలీలకు రూపకల్పన జరుగుతోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ వైఫల్యాలు, వ్యవసాయ సంక్షోభం, రైతుల దుస్ధితిని ఈ ర్యాలీల్లో రాహుల్ ప్రజల ముందుంచనున్నారు.
పశ్చిమ యూపీలోని హపుర్‌తో తొలి ర్యాలీని చేపట్టే రాహుల్ అనంతరం మొరదాబాద్, షహరన్‌పూర్, బరేలీ ర్యాలీల్లో పాల్గొంటారు. కాగా యూపీలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని అఖిలేష్, మాయావతి ప్రకటించిన నేపథ్యంలో యూపీపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని రాహుల్ పార్టీ నేతలకు సూచించారు. ఎస్పీ, బీఎస్పీలు రాజకీయ నిర్ణయం తీసుకున్నాయని, కాంగ్రెస్ యూపీలో పూర్తిసామర్థ్యంతో పోరాడుతుందని దుబాయ్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాహుల్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment