వారణాసి : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై విమర్శలు గుప్పించడం ద్వారా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భారత ఇంజనీర్లను అవమానించారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం దురదృష్టకరమని, ఇది ఈ ప్రాజెక్టులో భాగమైన భారత ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అవమానించడమేనని ప్రధాని మంగళవారం ఓ ప్రచార ర్యాలీలో పేర్కొన్నారు.
ప్రతికూల వ్యాఖ్యలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, నైతిక స్థైర్యం కోల్పోరాదని ఆయన ప్రజలకు సూచించారు. ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల శ్రమను దేశం గౌరవిస్తోందని, వారు దేశానికి గర్వకారణంగా ప్రజలు భావిస్తున్నారన్నారు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ ప్రారంభించిన మరుసటి రోజే వారణాసి నుంచి ఢిల్లీకి తిరిగివస్తూ సాంకేతిక సమస్యలకు లోనవడంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ విమర్శించిన సంగతి తెలిసిందే.
ప్రధాని మేకిన్ ఇండియా కార్యక్రమం విఫలమైందని, దీనిపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇక వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన తర్వాత కోచ్‌ల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, బ్రేక్‌లు విఫలమవడంతో రైలు నిలిచిపోయిందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment