రాజస్ధాన్ ఎన్నికల ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ
జైపూర్ : రెండు కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఏమైందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మోదీ నిజంగా ఉద్యోగాలు ఇచ్చిఉంటే ఆల్వార్‌లో నలుగురు యువకులు ఇటీవల ఎందుకు ఆత్మహత్యకు పాల్పడేవారని ఆయన నిలదీశారు.రాజస్ధాన్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ గత నెలలో ఆల్వార్ జిల్లాలో కదులుతున్న రైలు నుంచి దూకి ఈ యువకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనను ప్రస్తావించారు.
నిరుద్యోగ సమస్యతోనే వారు బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాధమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాధనంతో పారిశ్రామికవేత్తల ఖజానాలను నింపుతున్నారని ధ్వజమెత్తారు. మోదీ తన ప్రసంగంలో భారత్ మాతాకీ జై అంటారని, వాస్తవగా ఆయన అనిల్ అంబానీకి, మెహుల్ చోక్సీ, నీరవ్, లలిత్ మోదీలకు జై కొట్టాలని ఎద్దేవా చేశారు. అనిల్ అంబానీ వంటి సంపన్నుల కోసమే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. కాగా, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈనెల ఏడున జరగనుండగా, 11న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment