పేదల కోసం రాజస్థాన్ ప్రభుత్వ అమలు చేస్తున్న 'చిరంజీవి ఆరోగ్య బీమా పథకం’ అద్భుతమని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఇలాంటి పథకాన్ని అమలు చేస్తామన్నారు. కేరళలోని తన లోక్‌సభ నియోజకవర్గం వాయనాడ్‌లోని సుల్తాన్ బతేరిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కొత్త బ్లాక్‌ను ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
జాతీయ స్థాయిలో ఆరోగ్య భద్రతను పునఃపరిశీలించాల్సిన అవసరాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దేశ ప్రజలందరికీ అందుబాటులో మెరుగైన వైద్యం అందించడాన్ని ప్రథమ ప్రాధాన్యతగా కేంద్ర ప్రభుత్వం భావించాలన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన హామీలలో ఒకటని రాహుల్ అన్నారు. దీనిపై రాజస్థాన్‌లో తమ ప్రభుత్వం కృషి చేసిందని, 2024లో తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఈ రకమైన ఆలోచనలను అమలు చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.
రాజస్థాన్‌లో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న చిరంజీవి ఆరోగ్య బీమా పథకాన్ని దేశానికే ఆదర్శమని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ తాము మళ్లీ గెలిస్తే మెడికల్ కవరేజీని రూ. 50 లక్షలకు పెంచుతామని ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించింది. రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాలకు గాను 199 స్థానాలకు నవంబర్ 25న పోలింగ్ జరగగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment