ఇంకెవ్వరూ దానికి పునరుజ్జీవం కల్పించలేరు
జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారంలో అమిత్ షా వ్యాఖ్య
గులాబ్‌గఢ్/కిష్ట్‌వార్: మళ్లీ కోలుకోనంతగా ఉగ్రవాదాన్ని బీజేపీ ప్రభుత్వం పాతాళంలోకి పాతిపెట్టనుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌లోని కిష్ట్‌వార్ జిల్లాలోని పెదర్–నగ్‌సేని నియోజకవర్గ పరిధిలో సోమవారం గులాబ్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ ప్రసంగించారు.
‘‘1990దశకం నుంచి ఉగ్రవాదంతో కష్టాలుపడుతున్న జమ్మూ కశ్మీర్ ప్రజలకు ఈరోజు మాట ఇస్తున్నా. మళ్లీ ఈ గడ్డపై కనిపించనంత లోతుల్లో ఉగ్రవాదాన్ని మా ప్రభుత్వం పాతిపెడుతుంది. ఇక్కడ తమ ప్రభుత్వం ఏర్పాటైతే జైళ్ల నుంచి ఉగ్రవాదులను విడుదలచేస్తామని నేషనల్ కాన్ఫెరెన్స్(ఎన్‌సీ) కాంగ్రెస్ పార్టీలు హామీ ఇచ్చాయి. మచియాల్ మాత సాక్షిగా చెబుతున్నా. భారతగడ్డపై ఉగ్రవాదాన్ని వ్యాప్తిచేసే సాహసం ఇంకెవ్వరూ చేయరు.
ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు గ్రామ రక్షణ గార్డులు, స్పెషల్ పోలీస్ అధికారులకు పాతరకం .303 రైఫిళ్ల స్థానంలో అధునాతన ఆయుధాలిచ్చాం. ఎక్కడి నుంచైనా ఇక్కడికి ఉగ్రవాదులొస్తే వారి కథ ఇక్కడి మంచుకొండల్లో ముగిసిపోతుంది’’ అని అన్నారు. ఈ సందర్భంగా ఎన్‌సీ, కాంగ్రెస్‌లపై అమిత్ విమర్శలుచేశారు. ‘‘ డోగ్రాల చివరి రాజు మహారాజా హరిసింగ్‌ను వీళ్లు అవమానించారు.
కశ్మీరీ పండిట్లు బలవంతంగా వెళ్లిపోవడానికి కారణం వీళ్లే. వీళ్లు మహిళ హక్కులను లాగేసుకున్నారు. అవసరమైన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కకుండా చేశారు’’ అని ఆరోపించారు. ‘‘ రువ్వేందుకు రాళ్లు పట్టుకున్న యువతకు జైళ్లు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ల్యాప్‌టాప్‌లు, త్రివర్ణపతాకం పట్టుకున్న యువతకు ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి’ అని షా అన్నారు.
రాహుల్ కశ్మీర్‌లో ఐస్‌క్రీమ్ తినొచ్చు
రామ్‌బాన్‌లో జరిగిన ర్యాలీలోనూ అమిత్ మాట్లాడారు. ‘‘ కశ్మీర్‌ను ఎన్‌డీఏ సర్కార్ సురక్షితమైన ప్రాంతంగా మార్చేసింది. అయితే ఇటీవల రాహుల్ ఇక్కడి కొచ్చి లాల్‌చౌక్‌లో ఐస్‌క్రీమ్ తిన్నారు. బైక్ నడిపారు. పైగా మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నారు. రాహుల్ బాబా.. మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారుగానీ ఇంతటి రక్షణ వాతావరణం మా వల్లే సాధ్యమైంది.
మీ ప్రభుత్వాల్లో ఇది అసాధ్యం’’ అని అన్నారు. కాంగ్రెస్ హయాంలో హోం మంత్రిగా ఉండి కూడా లాల్‌చౌక్ ప్రాంతానికి వెళ్లాలంటేనే భయపడేవాడినని కాంగ్రెస్ నేత సుశీల్‌కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలను అమిత్ గుర్తుచేశారు. ‘‘ షిండే గారూ.. ఇప్పుడు పిల్లాజెల్లాతో వచ్చేయండి. ఎంచక్కా లాల్‌చౌక్‌లో వాకింగ్ చేయండి. మీకు హాని చేసేందుకు ఎవరూ సాహసించరు’’ అని అమిత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment