ముస్లింలను అమెరికా రానివ్వొద్దు
న్యూయార్క్ : రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించకుండా పూర్తి నిషేధం విధించాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగనున్న ట్రంప్ దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కాలిఫోర్నియా కాల్పుల ఘటనపై ట్రంప్ ఈ విధంగా స్పందించారు. 'ఉగ్రవాద సమస్య ప్రమాదాన్ని, ముప్పును గుర్తించనంత వరకూ భయంకరమైన దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇకముందు వారి తీవ్రవాద దాడులకు మన దేశంలోని పౌరులు బలి కాకూడదు... వారు జిహాదీని మాత్రమే నమ్ముకున్నారు. అమెరికా పట్ల ముస్లింల వైఖరి తెలిసేంత వరకు వాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయాలని' ట్రంప్ కోరారు.
కాగా దక్షిణ కరోలినాలో జరిగిన ప్రచారంలోనూ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి డిమాండ్లనే చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగింది. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలని ఖండిస్తూ వివిధ రాష్ట్రాల గవర్నలు విమర్శలు ఎక్కుపెట్టారు. డోనాల్డ్ మాటలను వైట్ హౌస్ వర్గాలు తప్పుపట్టాయి. అమెరికా విలువలకు, జాతీయ భద్రతా వైఖరికి ట్రంప్ వ్యాఖ్యలు వ్యతిరేకంగా ఉన్నాయని వైట్‌హౌస్ పేర్కొంది. అటు ఫ్లోరిడా గవర్నర్ జెబ్ బుష్ తీవ్రంగా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు మతి తప్పినవిగానూ, రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, అతని మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ చేశారు. అలాగే ఓహియా, సౌత్ కరోలినా, న్యూజెర్సీ గవర్నర్లు డొనాల్డ్ వ్యాఖ్యలతో విభేదించారు.
డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు క్రూరంగా తయారవుతున్నారంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతకుముందు వికలాంకుడైన ఓ జర్నలిస్టును అనుకరిస్తూ ఆయన వ్యంగ్యంగా మాట్లాడాడు. అంతేకాకుండా ఓ మహిళా అభిమాని ఛాతీపై ట్రంప్ సంతకం చేసి సంచలనం సృష్టించారు.