మనసు మార్చుకున్న ట్రంప్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ తరుపున నామినీగా తన స్థానం సుస్థిరం చేసుకున్న డోనాల్డ్ ట్రంప్ తన పద్ధతి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ప్రైమరీ ఎన్నికల కోసం జరిగిన ప్రచారంలో అడుగడుగునా వివాదాస్పద వ్యాఖ్యలతో ముఖ్యంగా ముస్లింలపై ఘాటు వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలైన ఆయన చివరకు మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. లండన్ నగరానికి తొలిసారి ఓ ముస్లిం మేయర్ గా ఎంపిక అయిన తర్వాత ముస్లింల విషయంలో కాస్త సానూకూలంగా స్పందించారు.
ముస్లింలకు ఇమ్మిగ్రేషన్ బ్యాన్ చేయాలని ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఆయన.. అది కేవలం తన సలహా మాత్రమేనని చెప్పారు. 'మేం చాలా తీవ్రమైన సమస్యలో ఉన్నాం. అందుకే నిషేధం తాత్కాలికంగా ఉంటుంది. అయితే, అది ఇప్పటి వరకు చేయలేదు. ఎవరూ అలా చేయలేదు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే వరకు ఇది కేవలం నా సలహాగానే ఉంటుంది' అని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పారు. అయితే, ముస్లింల కారణంగానే ఉగ్రవాద సమస్య ఉంటుందని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు మాత్రం స్పందిస్తూ 'ప్రపంచం మొత్తం కూడా తీవ్రమైన ఉగ్రవాద సమస్య ఉంది.
మీరు ప్యారిస్ కు వెళ్లండి.. శాన్ బెర్నార్డియో వెళ్లండి.. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లండి. బహుశా వారు చెప్పకూడదని అనుకుంటే ఆ సమస్య లేదనే చెబుతారు. కానీ, నేను మాత్రం అలా చేయను. ఆ విషయాన్ని ఖండించను' అని ట్రంప్ చెప్పారు. లండన్ కు కొత్తగా ఎంపికైన ముస్లిం మేయర్ సాధిక్ ఖాన్ ను అమెరికాలో అడుగుపెట్టేందుకు మినహాయింపు ఉంటుందని చెప్పిన మరుసటి రోజే ట్రంప్ మరింత సరళంగా ముస్లింల గురించి మాట్లాడటం గమనార్హం.