
అసోసియేటెడ్ ప్రెస్‌ను బహిష్కరించిన ట్రంప్ !
అధ్యక్ష భవనం, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలోకి అనుమతి నిరాకరణ
‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’అనే పాత పేరుకే కట్టుబడినందుకు ఆగ్రహించిన ప్రభుత్వం
అమెరికాలో దాదాపు వందకు పైగా సంచలనాత్మక కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీచేసిన డొనాల్డ్ ట్రంప్ అక్కడి అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థపై కత్తిగట్టారు. అమెరికా తీరప్రాంతమైన ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా మారుస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అయినాసరే పాత పేరునే తమ రోజువారీ వార్తల్లో, కథనాల్లో వినియోగిస్తామని అసోసియేటెడ్ ప్రెస్ (ఏపీ) కరాఖండీగా చెప్పింది. దీంతో అధ్యక్షుడి నిర్ణయాన్నే బేఖాతరు చేస్తారా అన్న ఆగ్రహంతో ట్రంప్ పాలనాయంత్రాంగం శుక్రవారం నుంచి ఏపీ పాత్రికేయులకు అధ్యక్షభవనం, ఎయిర్‌ఫోర్స్ వన్ అధ్యక్ష విమానంలో రిపోర్టింగ్ కోసం అనుమతి నిరాకరించింది.
అన్ని దేశాల్లో దినపత్రికలు, మేగజైన్‌లు, ఇతర వార్తాసంస్థలకు రోజువారీ వార్తలు, కథనాలు అందించే ప్రపంచంలో అతిపెద్ద న్యూస్‌ఏజెన్సీల్లో ఏపీ కూడా ఒకటి. ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే తమ ప్రతినిధులను అధ్యక్షభవనం వంటి ముఖ్యమైన చోటుకు రానివ్వకపోవడంపై ‘ఏపీ’తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇది వార్తాస్వేచ్ఛను అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించింది. దీనిపై ట్రంప్ ప్రభుత్వం స్పందించింది. ‘‘అధ్యక్షుని నిర్ణయాన్ని బేఖాతరు చేయడమంటే వార్తల్లో విభజన తెచ్చే సాహసం చేయడమే. పైగా తప్పుడు విషయాన్ని అందరికీ చేరవేయడమే.
అధ్యక్షుని నిర్ణయానికి గౌరవం ఇవ్వని వ్యక్తులకు వైట్‌హౌస్‌లో, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో తగు స్థానం లేదు. ఆ స్థానాన్ని ఇన్నాళ్లూ వైట్‌హౌస్‌లోకి రాలేక రిపోర్టింగ్ చేయలేకపోయినా ఇతర మీడియా ప్రతినిధులకు కల్పిస్తాం’’అని వైట్‌హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ టేలర్ బుడోవిచ్ వాదించారు. దీనిపై ఏపీ మళ్లీ స్పందించింది. ‘‘అమెరికన్ వినియోగదారులను మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వినియోగదారులకు ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’అనే పేరు వాస్తవం. ఆ దృక్కోణంలో పాత పేరుకే కట్టుబడి ఉన్నాం. ఈ విషయంలో అధ్యక్షుడు కార్యనిర్వాహక ఉత్తర్వును ధిక్కరించినట్లుగా భావించకూడదు’’అని ఏపీ స్పష్టంచేసింది.
దశాబ్దాలుగా పూల్ రిపోర్టర్‌గా..
ప్రముఖ మీడియా సంస్థల కొద్దిపాటి మీడియా ప్రతినిధులు, కెమెరామెన్‌లకు మాత్రమే వైట్‌హౌస్, ఎయిర్‌ఫోర్స్ వన్ వంటి కీలక ప్రదేశాల్లోకి అనుమతిస్తారు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. నాటి అమెరికా అధ్యక్షుడు జేమ్స్ ఏ గార్‌ఫీల్డ్ హత్యోదంతం తర్వాత కొద్దిమంది మీడియా వాళ్లనే అనుమతించడం మొదలెట్టారు. ఇది 1881 ఏడాదినుంచి మొదలైంది. ఈ మీడియా బృంద సభ్యులను పూల్ రిపోర్టర్ అంటారు. ‘ఏపీ’ప్రతినిధి చాన్నాళ్లుగా ఇలా పూల్ రిపోర్టర్‌గా కొనసాగుతున్నారు. తమను లోపలికి అనుమతించకపోవడం పూర్తి వివక్షాపూరిత నిర్ణయం అని ఏపీ ప్రతినిధి ఒకరు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయాలని ‘ఏపీ’భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క ఏపీనే బయటకు గెంటేయడంపై వైట్‌హౌస్‌లోని ‘ది వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్(డబ్ల్యూహెచ్‌సీఏ)’తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ప్రస్తుతానికైతే ఏపీకి బదులు రొటేషన్‌లో భాగంగా వేరే ప్రతినిధికి అవకాశం కల్పిస్తాం. సాధారణంగా ప్రతి రోజూ రొటేషన్‌లో ఏపీకి అవకాశం ఉంటుంది. కానీ ఇలా ఏకపక్షంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లజేస్తూ ప్రభుత్వం సెన్సార్‌షిప్‌కు తెరలేపుతోంది’’అని డబ్ల్యూహెచ్‌సీఏ ఒక ప్రకటనలో తెలిపింది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment