
వాషింగ్టన్
చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా అధ్యక్షుల వాగ్వాదానికి, పరస్పర ఆక్షేపణలకు, వాగ్బాణాలకు వైట్‌హౌస్ శుక్రవారం వేదికగా నిలిచింది. మీడియా సాక్షిగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షంగా ప్రసారమైన భేటీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధినేత వొలొదిమిర్ జెలెన్‌స్కీ మధ్య సాగిన విమర్శలపర్వం సర్వత్రా చర్చనీయంగా మారింది. నిజానికి ఈ రగడకు అగ్గి రాజేసింది వారితో పాటు చర్చల్లో పాల్గొన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. అలా ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కాస్తా చూస్తుండగానే అదుపు తప్పిపోయింది. చివరికి జెలెన్‌స్కీని ట్రంప్ వైట్‌హౌస్ వదిలి పొమ్మనడం, చర్చలకు అర్ధాంతరంగా ఫుల్‌స్టాప్ పెట్టి ఆయన వెనుదిరగడం దాకా వెళ్లింది! జెలెన్‌స్కీ వైట్‌హౌస్ సందర్శన రద్దవడమే గాక రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు అమెరికా దన్ను కొనసాగడం కూడా అనుమానంలో పడింది. వారి మధ్య వాగ్యుద్ధం ఎలా జరిగిందంటే...
వాన్స్: (బైడెన్‌ను ఉద్దేశించి) నాలుగేళ్లుగా అమెరికా (తాజా మాజీ) అధ్యక్షుడు (బైడెన్) రష్యా అధినేత పుతిన్‌ను ఉద్దేశించి గట్టి మాటలు మాట్లాడుతూ వచ్చారు. అయినా పట్టించుకోకుండా ఉక్రెయిన్ౖపె దండెత్తిన పుతిన్ ఆ దేశాన్ని చాలావరకు నేలమట్టం చేశారు. ఇప్పుడిక దౌత్యమే శాంతికి మార్గం. నామమాత్రపు బెదిరింపులకు దిగుతూ, ఛాతీ చరుచుకుంటూ బైడెన్ చూపిన దారి పనికొచ్చేది కాదని తేలిపోయింది. దౌత్యానికి బాటలు వేసినప్పుడే అమెరికా మంచి దేశమని అనిపించుకోగలదు. ట్రంప్ సరిగ్గా అదే చేస్తున్నారు.
జెలెన్‌స్కీ: నేనొకటి అడగొచ్చా?
వాన్స్: తప్పకుండా.
జెలెన్‌స్కీ: పుతిన్ మా దేశాన్ని ఆక్రమించాడు. నిజమే. 2014లోనూ అతనదే చేశాడు. క్రిమియాను ఆక్రమించాడు. మా ప్రజలను భారీగా పొట్టన పెట్టుకున్నాడు. అప్పుడెవరూ అతన్ని ఆపలేదు. ఇన్నేళ్లుగా కూడా ఆపడం లేదు. 2014లో ఒబామా, తర్వాత ట్రంప్, ఆ తర్వాత బైడెన్... ఏ అధ్యక్షుడూ పట్టించుకోలేదు. దేవుని దయవల్ల పుతిన్‌ను ఇప్పుడు బహుశా ట్రంప్ ఆపుతారేమో.
ట్రంప్: 2015లోనా?
జెలెన్‌స్కీ: 2014లో
ట్రంప్: అవునా? అప్పుడు అధ్యక్షున్ని నేను కాదుగా.
వాన్స్: అదే కదా!
జెలెన్‌స్కీ: కావచ్చు. కానీ 2014 నుంచి 2022 దాకా కూడా మా దుస్థితి అలాగే కొనసాగుతూ వచ్చింది. సరిహద్దుల వెంబడి మా ప్రజలు నిస్సహాయంగా చనిపోతూనే వచ్చారు. ఈ దారుణాన్ని ఆపేవారే లేకపోయారు. పుతిన్‌తో చర్చలు జరిపాం. ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు. అతనితో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం. (ట్రంప్‌నుద్దేశించి) మీరు కూడా 2019లో పుతిన్‌తో ఒప్పందం చేసుకున్నారు. (ఫ్రాన్స్ అధ్యక్షుడు) మాక్రాన్, (నాటి జర్మనీ చాన్సలర్) మెర్కెల్ కూడా. కాల్పుల విరమణ ఒప్పందాలూ కుదిరాయి. పుతిన్ వాటిని ఉల్లంఘించబోడనే మీరంతా మాకు హామీ ఇచ్చారు. కానీ ఏం జరిగింది? దానికతను తూట్లు పొడిచాడు. మావాళ్లను మరింతగా పొట్టన పెట్టుకున్నాడు. ఖైదీల మార్పిడి ఒప్పందాన్నీ తుంగలో తొక్కాడు. ఇదెక్కడి దౌత్యం? జేడీ! మీరేం మాట్లాడుతున్నారో, వాటికి అర్థమేమిటో మీకైనా తెలుస్తోందా?
వాన్స్: మీ దేశంలో సాగుతున్న వినాశనానికి తెర దించగలిగే దౌత్యం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. కానీ ఒక్కటి మాత్రం మీకు స్పష్టంగా చెప్పదలచుకున్నా. ఇలా ఓవల్ ఆఫీసులో కూర్చుని అమెరికా మీడియా సమక్షంలో మీరిలా వాదనకు దిగడం చాలా అమర్యాదకరం. మీకిప్పుడు రష్యాతో పోరాడేందుకు సరిపడా సైన్యమే లేదు. మరో దారిలేక పౌరులకు ఆయుధాలిచ్చి బలవంతంగా యుద్ధక్షేత్రంలోకి నెడుతున్నారు. అలాంటి ఘర్షణకు తెర దించేందుకు కృషి చేస్తున్నందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు మీరు నిజానికి కృతజ్ఞతలు తెలపాలి.
జెలెన్‌స్కీ: మాకెలాంటి సమస్యలున్నాయో కళ్లతో చూసినట్టే చెబుతున్నారు! మీరెప్పుడైనా ఉక్రెయిన్‌లో పర్యటించారా?
వాన్స్: అవును.
జెలెన్‌స్కీ: ఓసారి ఇప్పుడొచ్చి చూడండి.
వాన్స్: ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోందో చూశాను. కథలు కథలుగా విన్నాను. నిజానికి మీరు తరచూ దేశాధినేతలు తదితరులను మీ దేశానికి రప్పించుకుంటూ ఉంటారు. అవన్నీ ఫక్తు ప్రచార టూర్లు. మీకు సమస్యలున్నది నిజం కాదంటారా? సైన్యంలో చేరేందుకు జనమే లేకపోవడం నిజం కదా?
జెలెన్‌స్కీ: అవును. మాకు సమస్యలున్నాయి.
వాన్స్: అలాంటప్పుడు అమెరికాలో పర్యటిస్తూ, వైట్‌హౌస్‌లో ఓవల్ ఆఫీసులో కూర్చుని మరీ, అదీ అధ్యక్షుని సమక్షంలోనే మా యంత్రాంగంపై దాడికి దిగడం మర్యాదా? మీ దేశ వినాశనానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయతి్నస్తున్న మా ప్రభుత్వంపై నోరు పారేసుకోవడం సబబా?
జెలెన్‌స్కీ: వరుసబెట్టి చాలా ప్రశ్నలే అడిగేశారు. అన్నింటినీ ఒక్కొక్కటిగా చర్చిద్దాం.
వాన్స్: అలాగే కానిద్దాం.
జెలెన్‌స్కీ: ముందుగా మీరొకటి అర్థం చేసుకోవాలి. యుద్ధ సమయంలో ఎవరికైనా సమస్యలే ఉంటాయి. రేపు మీకైనా అంతే. కాకపోతే ఇప్పుడు మీకది తెలియకపోవచ్చు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి వస్తే మీకూ తెలిసొస్తుంది.
ట్రంప్: మున్ముందు మాకెలా అనిపిస్తుందో మీరేమీ మాకు చెప్పాల్సిన అవసరం. మేం కేవలం మీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. మీ పరిస్థితే మాకొస్తే ఎలా ఉంటుందో మాకు చెప్పే సాహసం చేయకండి.
జెలెన్‌స్కీ: నేను మీకేమీ చెప్పడం లేదు. నాకు సంధించిన ప్రశ్నలకు బదులిస్తున్నానంతే.
ట్రంప్: అలా కాదు. ఏం జరగాలో, ఎలా జరగాలో నిర్దేశించే పరిస్థితిలో మీరు ఎంతమాత్రమూ లేరు.
వాన్స్: కానీ మీరు ఎంతసేపూ కేవలం మీకేం కావాలో మాకు నిర్దేశించే ప్రయత్నమే చేస్తూ వస్తున్నారు.
ట్రంప్: మాకూ మీలాంటి పరిస్థితే వస్తే మాకెలా ఉంటుందో చెప్పే పరిస్థితిలో మీరు లేరు. ముందు అది తెలుసుకోండి. మేం బాగుంటాం.
జెలెన్‌స్కీ: (మాలాంటి పరిస్థితే గనక వస్తే) ఎంతోమంది ప్రభావితం చేసేందుకు ప్రయతి్నంచడం మీకూ అనుభవంలోకి వస్తుంది.
ట్రంప్: మేమెప్పుడూ శక్తిమంతంగా ఉంటాం.
జెలెన్‌స్కీ: మళ్లీ చెబుతున్నా. అలాంటి పరిస్థితే వస్తే ఎలా ఉంటుందో అప్పుడు మీకూ అనుభవంలోకి వస్తుంది.
ట్రంప్: ప్రస్తుతం మీ పరిస్థితి అస్సలు బాగా లేదు. ఇదంతా స్వయంకృతం. మీరు స్వయంగా కొనితెచ్చుకున్నదే.
జెలెన్‌స్కీ: యుద్ధం మొదలైనప్పటి నుంచీ...
ట్రంప్: (మధ్యలోనే అడ్డుకుంటూ) చెప్తున్నాగా. మీరు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. మీ దగ్గర ప్రస్తుతం వాడేందుకు ఎలాంటి కార్డులూ లేవు. మేం దన్నుగా ఉన్నప్పుడే మీరు ఏమైనా చేయగలిగేది!
జెలెన్‌స్కీ: నేనేమీ కార్డులు ప్లే చేయడం లేదు. సమస్య పరిష్కారానికి చాలా చిత్తశుద్ధితో ఉన్నా. మిస్టర్ ప్రెసిడెంట్! మీరది అర్థం చేసుకోవాలి.
ట్రంప్: లేదు లేదు. ఎంతసేపూ మీరు కార్డులే ప్లే చేస్తున్నారు. లక్షలాది జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అందరినీ మూడో ప్రపంచ యుద్ధ భయంలోకి నెడుతున్నారు.
జెలెన్‌స్కీ: మీరేం మాట్లాడుతున్నారు!
ట్రంప్: అవును. మీరు అందరినీ మూడో ప్రపంచయుద్ధం దిశగా నెట్టే జూదానికి దిగారు. అంతేకాదు! మీ ప్రవర్తన అమెరికా పట్ల అత్యంత అమర్యాదకరంగా ఉంది. కేవలం మాటలు చెప్పే ఎన్నో దేశాల కంటే మీకు అన్నివిధాలా దన్నుగా నిలిచింది మేమే.
వాన్స్: అందుకు మీరు కనీసం ఒక్కసారన్నా కృతజ్ఞతలు తెలిపారా?
జెలెన్‌స్కీ: ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు చెప్పా! ఇప్పుడూ చెబుతున్నా.
వాన్స్: నేననేది ఈ భేటీలో. ఇప్పటిదాకా మాపై, మా దేశంపై విమర్శలే తప్ప కృతజ్ఞతాపూర్వకమైన మాటలు ఒక్కటైనా మాట్లాడారా? గత అక్టోబర్లో పెన్సిల్వేనియాలో మా ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన చరిత్ర మీది!
జెలెన్‌స్కీ: నేనలా చేయలేదు.
వాన్స్: ఇప్పటికైనా అమెరికాకు, మీ దేశాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న మా అధ్యక్షునికి కృతజ్ఞతగా కనీసం మంచి మాటలైనా చెప్పండి.
జెలెన్‌స్కీ: మీరేమనుకుంటున్నారు? గొంతు చించుకు అరిస్తే సరిపోతుందా...
ట్రంప్: (ఆగ్రహంగా మధ్యలోనే కలగజేసుకుంటూ) ఆయన (వాన్స్) గొంతు చించుకోవడం లేదు. అంత గట్టిగా మాట్లాడటం లేదు. వాస్తవమేమిటంటే, మీ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.
జెలెన్‌స్కీ: ఆయన అన్నదానికి నన్ను కనీసం సమాధానమైనా చెప్పనిస్తారా?
ట్రంప్: చెప్పనిచ్చే సమస్యే లేదు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశారు. ఓవైపు మీ దేశమే చాలా సమస్యల్లో ఉంది.
జెలెన్‌స్కీ: అవును. నాకు తెలుసు.
ట్రంప్: మీరు (యుద్ధం) గెలవబోవడం లేదు. ఈ ఆపద నుంచి బయట పడేందుకు మీకున్న ఏకైక అవకాశం మా దన్ను మాత్రమే.
జెలెన్‌స్కీ: మిస్టర్ ప్రెసిడెంట్! మేమెవరినీ ఆక్రమించలేదు. మా దేశంలో మేం బతుకుతున్నాం. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచీ మేం ఒంటరిగానే పోరాడుతున్నాం. అయినా సరే, మీ దేశం పట్ల మొదటినుంచీ కృతజ్ఞతగానే ఉన్నాం. ఇప్పుడు కూడా చెబుతున్నా. కృతజ్ఞతలు.
ట్రంప్: కాల్పుల విమరణకు మీరు అంగీకరించి తీరాల్సిందే. మా సాయుధ సాయం లేకపోతే ఈ యుద్ధం రెండే రెండు వారాల్లో ముగిసిపోయేది.
జెలెన్‌స్కీ: కాదు. మూడే రోజుల్లో. అలాగని పుతిన్ కూడా అన్నారు.
ట్రంప్: ఏమో! అంతకంటే కూడా ముందే ముగిసేదేమో! ఇలాగైతే మీతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా చాలా కష్టం.
వాన్స్: ఇప్పటికైనా కనీసం కృతజ్ఞతలు తెలపండి.
జెలెన్‌స్కీ: ఒక్కసారి కాదు. ఎన్నోసార్లు చెప్పా. అమెరికా పౌరులకు కృతజ్ఞతలు.
వాన్స్: మన మధ్య అభిప్రాయ భేదాలున్నాయని అంగీకరించండి. మీరు చేస్తున్నదే తప్పు. అలాంటప్పుడు వాటిని చర్చించుకుని పరిష్కరించుకోవాలి. అంతే తప్ప ఇలా అమెరికా మీడియా సాక్షిగా మాతో గొడవకు దిగడం చాలా తప్పు.
ట్రంప్: కానీ నా ఉద్దేశంలో ఇదీ మంచిదే. ఏం జరుగుతోందో ఇప్పుడు అమెరికా ప్రజలంతా చూస్తున్నారు. వారికీ తెలియనీయండి. ఇది చాలా ముఖ్యం. అందుకే ఈ సంవాదాన్ని ఇంతసేపు కొనసాగించా. జెలెన్‌స్కీ అమెరికాకు కృతజు్ఞడై ఉండాల్సిందే.
జెలెన్‌స్కీ: అవును. నేను కృతజు్ఞన్ని.
ట్రంప్: మీ దగ్గర వాడటానికి ఇంకే కార్డులూ లేవు. మీరు నిండా మునిగారు. మీ జనం చనిపోతున్నారు. పోరాడేందుకు మీకు సైనికుల్లేరు. ఎలా చూసుకున్నా యుద్ధానికి తెర దించడమే మీకు మంచిది. కానీ మీరు చూస్తే కాల్పు విరమణే వద్దంటున్నారు! అది కావాలి, ఇది కావాలని పేచీకి దిగుతున్నారు! మీకొక్కటే చెప్పదలచుకున్నా. కాల్పుల విరమణకు ఇప్పుడే, ఇక్కడే ఒప్పుకుంటారా సరేసరి. మీ దేశంపై తూటాల వర్షం ఆగుతుంది. జన నష్టానికి తెర పడుతుంది.
జెలెన్‌స్కీ: యుద్ధం ఆగాలనే మేమూ కోరుతున్నాం. కానీ అందుకోసం మేం కోరుతున్న హామీలు కావాలి. ఆ విషయం మీకిప్పటికే స్పష్టంగా చెప్పా.
ట్రంప్: అంటే ఏమిటి మీరనేది? కాల్పుల విరమణ వద్దా? నాకైతే అదే కావాలి. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మీరు కోరుతున్న ఒప్పందాల కంటే మీకు త్వరగా దక్కేది కాల్పుల విరమణే!
జెలెన్‌స్కీ: కాల్పుల విరమణపై మీవాళ్లనే అడిగి చూడండి. మీకే తెలుస్తుంది!
ట్రంప్: దానితో నాకు సంబంధం లేదు. అదంతా బైడెన్ అనే వ్యక్తి ఉండగా జరిగిన వ్యవహారం. కానీ అతనంత సమర్థుడు కాదు.
జెలెన్‌స్కీ: అప్పుడాయన మీ దేశాధ్యక్షుడు.
ట్రంప్: ఏం మాట్లాడుతున్నారు? బైడెన్ అనే కాదు. అంతకుముందు ఒబామా మాత్రం మీకేం సాయం చేశాడు? కేవలం కాగితాలిచ్చి సరిపెట్టాడు. నేనేమో మీకు శత్రువులపైకి ప్రయోగించేందుకు ఆయుధాలు సమకూర్చా. అందుకే చెప్తున్నా. మీరు నిజానికి మరింతగా కృతజు్ఞలై ఉండాలి. మీరిప్పుడు నిస్సహాయులు. మా దన్నే మీకు బలం. మేమే లేకపోతే మీకేమీ లేదు. పుతిన్ నన్ను గౌరవిస్తున్నాడంటే కారణం అధ్యక్షునిగా తొలి టర్ములో నా శైలిని దగ్గర్నుంచి గమనించాడు గనుకే.
(రష్యా గనుక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఏమిటన్న ఒక రిపోర్టర్ ప్రశ్నను ట్రంప్‌కు వాన్స్ వినిపించారు)
ట్రంప్: ఎందుకీ ఊహాజనిత ప్రశ్నలు? ఇప్పటికిప్పుడు మీ నెత్తిపై బాంబు పడితే? రష్యా ఒకవేళ ఉల్లంఘిస్తే ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. బైడెన్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రష్యా నిజంగానే ఉల్లంఘించింది. ఎందుకంటే అతనంటే వారికి గౌరవం లేదు. ఒబామా అన్నా అంతే. కానీ నా విషయం అలా కాదు. నేనంటే రష్యాకు, పుతిన్‌కు ఎంతో గౌరవం. ఒక్కటి చెప్తా వినండి. పుతిన్‌కు నేను చుక్కలు చూపించా! నేను చెప్పేదల్లా ఒక్కటే. ఒబామాతోనో, బుష్‌తోనో, చివరికి బైడెన్‌తో కూడా ఒప్పందాలను పుతిన్ ఉల్లంఘించి ఉండొచ్చు. నాకు తెలియదు. కానీ నాతో మాత్రం ఆయన అలా చేయలేదు. ఇప్పుడు కూడా ఒప్పందం చేసుకోవాలనే పుతిన్ అనుకుంటున్నాడు. (జెలెన్‌స్కీని ఉద్దేశించి) కానీ కాల్పుల విమరణకు ఒప్పుకునే ఉద్దేశం మీకేమాత్రం ఉందో లేదో నాకైతే తెలియదు.
మిమ్మల్ని నేను బలశాలిగా, శక్తిమంతునిగా తీర్చిదిద్దా. అమెరికా దన్నే లేకపోతే మీకెన్నటికీ అంతటి శక్తి ఉండేదే కాదు. మీ ప్రజలు చాలా ధైర్యశాలులు. చివరిగా ఒక్కటే మాట. మాతో (ఖనిజ వనరుల) ఒప్పందం చేసుకుంటారా, సరేసరి! లేదంటే రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి యత్నాల నుంచి అమెరికా వైదొలగుతుంది. అప్పుడిక మీ పోరాటం మీదే. అదంత సులువని నేనైతే అనుకోను. ఎందుకంటే పోరాడేందుకు మీ దగ్గర ఏమీ లేదు. మాతో ఒప్పందం కుదుర్చుకుంటే మీరు చాలా మెరుగైన స్థితిలో ఉంటారు. కానీ ఏ దశలోనూ మీరు కాస్త కూడా కృతజ్ఞతపూర్వకంగా వ్యవహరించడం లేదు. ఇది ఎంతమాత్రమూ సరైన పద్ధతి కాదు. నిజంగా చెప్తున్నా. మీ తీరు అస్సలు సరికాదు. చూడాల్సిందంతా చూసేశాం. కదా! టీవీలకైతే ఇదంతా నిజంగా పండుగే!
Comments
Please login to add a commentAdd a comment