Air Force One
-
నయా ఎయిర్‌ఫోర్స్‌వన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానం సరికొత్తగా, సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకోనుంది. ఎయిర్‌ఫోర్స్‌వన్‌గా ప్రస్తుతం 747–200 రకం బోయింగ్‌లను వాడుతున్నారు. ఇవి 1989–1993 మధ్య అధ్యక్షునిగా చేసిన జార్జి హెచ్.డబ్ల్యూ.బుష్ హయాంవి. వీటి స్థానంలో ఆధునీకరించిన రెండు 747–800 రకం విమానాలను ఎయిర్‌ఫోర్స్‌వన్ కోసం బోయింగ్ సంస్థ సిద్ధం చేయనుంది. సరికొత్త హంగులతో తొలి విమానం 2027లో, రెండోది 2028కల్లా అందుతాయి. విమానం వెలుపలి భాగం రంగులను అలాగే ఉంచాలని తాజాగా నిర్ణయించారు. అయితే అధ్యక్షుడు బైడెన్ సూచన మేరకు ప్రస్తుత రాబిన్ ఎగ్ బ్లూ బదులుగా బ్లూ, వైట్ రంగులు వాడతారు. సకల సౌకర్యాలు, ప్రపంచంలోనే అత్యంత హెచ్చు భద్రతతో కూడిన ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానాలను బోయింగ్ సంస్థే తయారు చేస్తూ వస్తోంది. ప్రస్తుత విమానాలను మార్చి కొత్తవి తీసుకోవాలని ట్రంప్ హయాంలోనే నిర్ణయించారు. వాటికి రెడ్–వైట్–బ్లూ– రంగులు వేయాలని అప్పట్లో ట్రంప్ ఆదేశించారు. ఇది ఆయన వ్యక్తిగత విమానం డిజైనే! ఈ ముదురు రంగుల వాడకంతో ఖర్చు పెరగడంతోపాటు డెలివరీ ఆలస్యమవుతుందని బోయింగ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రంగు మార్పు వద్దని బైడెన్ నిర్ణయించారు. -
బైడెన్ ఆరోగ్యం భద్రమేనా?
వాషింగ్టన్: జో బైడెన్.. అమెరికాకు అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా రికార్డు సృష్టించారు. 78 ఏళ్ల వయసులో స్వల్ప అనారోగ్య సమస్యలు సహజమే అయినా అగ్రరాజ్యాధిపతిగా ఆయన ఆరోగ్యంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే బైడెన్ ఈ మధ్య తరచుగా తడబడుతున్నారు. పేర్లు, హోదాలు చెప్పే విషయంలోనూ తికమక పడుతున్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను ప్రెసిడెంట్ హ్యారిస్ అని సంబోధించారు. శుక్రవారం తన అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి అట్లాంటాకు ఎయిర్‌ఫోర్స్ వన్‌లో బయలుదేరిన బైడెన్ మెట్లపై పలుమార్లు కిందపడ్డారు. అతికష్టం మీద రెయిలింగ్ పట్టుకొని పైకి లేచారు. ఇలా వరుసగా మూడు సార్లు జరగడం గమనార్హం. దీంతో ఆయన ఆరోగ్యంపై అమెరికా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. -
తొలిసారి ఎయిర్‌ఫోర్స్ వన్‌లో బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆ పదవిని అధిరోహించిన తరువాత తొలిసారి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించారు. వ్యాపార అవసరాల కోసం కాదు సుమా! వైట్ హౌస్‌లోని ఇంటికి కావాల్సిన జాబితా తయారు చేయడంలో తన భార్యకు సహకరించేందుకు డెలావర్‌లోని తన ఇంటికి బైడెన్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’విమానంలో వెళ్ళారు. అధ్యక్షుడిగా తానీ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించడం తనకొచ్చిన గొప్ప అవకాశమని బైడెన్ వ్యాఖ్యానించారు. సహచరికి తోడ్పడేందుకే ‘‘నా మనవలు, మనవరాళ్ళను చూసేందుకు, అలాగే కొత్త ఇంటికి కావాల్సినవి కొనుగోలు చేయడంలో నా భార్య జిల్కి తోడ్పడేందుకు విల్మింగ్టన్కి దగ్గర్లోని నా ఇంటికి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో వెళ్ళాను’’అని బైడెన్ అన్నారు. మరోవైపు బైడెన్ కొడుకు హంటర్‌కి గురువారానికి 51 ఏళ్ళు నిండాయి. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ప్రత్యేక ఏంటి? అమెరికా అధ్యక్షులంతా వాడేది ఎయిర్‌ఫోర్స్ వన్నే. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్. ‘‘అమెరికాకి చెందిన ఏ అధ్యక్షుడైనా, డెమొక్రాట్ కానీ, రిపబ్లికన్ కానీ ప్రయాణించేటప్పుడు ఎయిర్‌ఫోర్స్ వన్ నే ఉపయోగిస్తారు’’అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి చెప్పారు. ఇంకాస్త బాగుంది కూడా.. డెలావర్‌లో లాండ్ అయిన వెంటనే బైడెన్ రిపోర్టర్లతో మాట్లాడుతూ చాలావరకు ఈ విమానం, తాను 8 ఏళ్ళ పాటు వైస్ ప్రసిడెంట్‌గా ఉన్నప్పుడు ఉపయోగించిన ఫ్లైట్ మాదిరిగానే ఉన్నదని చెప్పారు. కాకపోతే ఇది ఇంకాస్త బాగా ఉన్నట్టు బైడెన్ వ్యాఖ్యానించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు వేర్వేరుగా ప్రయాణం నిజానికి అమెరికాలో అధ్యక్షుడి భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు సైతం ఒకే విమానంలో ప్రయాణించరు. వేర్వేరుగా ప్రయాణిస్తారు. అందుకు కారణం భద్రత దృష్ట్య ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. మూడు వారాల క్రితమే.. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) గైడ్‌లైన్స్ ప్రకారం ప్రయాణాలు కోవిడ్–19 వ్యాప్తిని ఉధృతం చేస్తాయని, ఈ సమయంలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని చెప్పిం ది. అయితే ఎవరైనా ప్రయాణాలు చేయదల్చుకుంటే మీ వంతు వచ్చాక, కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకున్న తరువాతే ప్రయాణించాలని సీడీసీ స్పష్టం చేసింది. సెకండ్ డోస్ తీసుకున్న తరువాత కూడా ప్రయాణించడానికి రెండు వారాలు వేచి ఉండాలని సీడీసీ సూచించింది. అయితే బైడెన్ మూడు వారాల క్రితమే తన సెకండ్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. బైడెన్‌కి 78 ఏళ్ళ వయస్సు కావడం వల్ల ఆయన హైరిస్క్‌లో ఉన్నప్పటికీ, ఈ ప్రయాణం వల్ల ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదని, ప్రజలు మాత్రం బయటకు రాకుండా ఉండాలని వైట్ హౌస్ ప్రజలను అభ్యర్థించింది. తొలిసారి దశాబ్దకాలం పాటు సెనేట్‌లోనూ, 8 ఏళ్ళ పాటు వైస్ ప్రసిడెంట్గానూ పనిచేసిన జోబైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత మొట్టమొదటిసారిగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించారు. 2000 సంవత్సరంలో తొలిసారి బిల్‌క్లింటన్‌తో పాటు బైడెన్ దక్షిణాఫ్రికాకి ఈ విమానంలో ప్రయాణించారు. అప్పుడు మాదకద్రవ్యాల సరఫరాని అడ్డుకునే విషయంలో, కొలంబియాకి సహాయపడేందుకు 1.3 బిలియన్ డాలర్ల నిధులను బిల్‌క్లింటన్ ఆ సందర్భంగా ప్రకటించారు. -
ఎయిర్ ఇండియా వన్ వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం తరహాలోనే మన దేశంలో వీవీఐపీలు ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్ ఇండియా వన్ అమెరికా నుంచి భారత్‌కి చేరుకుంది. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ కలిగిన బోయింగ్–777 విమానం అమెరికాలోని టెక్సాస్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ విమానం చేరుకున్నట్టు పౌర విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు. ఈ విమానంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య మాత్రమే ప్రయాణిస్తారు. వీవీఐపీలు ప్రయాణించడానికి వీలుగా డిజైన్ చేసి , క్షిపణి దాడుల్ని తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి ఆధునీకరించడం కోసం రెండు విమానాల్ని డల్లాస్‌లో బోయింగ్ సంస్థకి పంపారు. వీటిలో ఒకటి భారత్‌కు వచ్చింది. రెండో విమానం మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ విమానంపై భారత్ అనే అక్షరాలు, అశోక చక్రం ఉన్నాయి. గత జూలైలోనే ఈ విమానాలు భారత్‌కు చేరుకోవాల్సి ఉండగా కరోనా వైరస్, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. గడిచిన 25 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఎయిర్ఇండియా వన్ కాల్ సైన్‌తో బోయింగ్ 747 విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకతలివీ ► ఎయిర్ ఇండియా వన్ విమానంలో భద్రతా వ్యవస్థ అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌కి ఏ మాత్రం తీసిపోదు. ఈ విమానానికి క్షిపణి దాడుల్ని ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ ఉంది. లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రేర్డ్ కౌంటర్‌మెజర్స్ (ఎల్ఏఐఆర్సీఎం), సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ (ఎస్పీఎస్)ను అమర్చారు. ► అమెరికా అధ్యక్ష విమానం తర్వాత మన ఎయిర్ ఇండియా వన్‌లోనే ఎస్‌పీఎస్‌ను అమర్చారు. ఈ రక్షణ వ్యవస్థతో శత్రువుల రాడార్ ఫ్రీక్వెన్సీని జామ్ చెయ్యగలదు. క్షిపణుల్ని దారి మళ్లించగలదు. ► అమెరికా నుంచి భారత్ మధ్య ప్రయాణం ఎక్కడా ఆగకుండా చేయవచ్చు. ఇంధనం నింపడానికి కూడా ఆగాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం వాడుతున్న విమానంలో పది గంటల తరువాత మళ్లీ ఇంధనం నింపవలసివస్తుంది. కొత్త విమానం గంటకు 900 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ► విమానంలో ప్రధాని కార్యాలయం, సమావేశాల నిర్వహణకు పెద్ద హాలు ఉన్నాయి. ఈ లోహ విహంగం ఫూర్తి స్థాయి ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ మాదిరి పనిచేస్తుంది. ► ఈ విమానాల తయారీకి రూ.8,400 కోట్లు ఖర్చు అయింది. ► ఈ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడపరు. భారత వాయుసేనకి చెందిన పైలట్లు నడుపుతారు. ► ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్)కు ఈ రెండు విమానాల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు. -
వాయుసేన.. సిద్ధంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్ : సరిహద్దుల్లో భారత్ ఎప్పుడూ శాంతి మంత్రాన్ని పాటిస్తుందని భారత వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా స్పష్టం చేశారు. భారత సైనికులపై కవ్వింపులకు దిగితే మాత్రం అదే రీతిలో సమాధానం చెప్పగల సత్తా మన సైన్యం వద్ద ఉందని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ సమీపంలోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా విధుల్లో చేరబోతున్న క్యాడేట్లను ఉద్దేశించి భదౌరియా ప్రసంగించారు. భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటననను ఆయన గుర్తుచేశారు. చైనా ఆగడాలను ఎల్లప్పుడూ తిప్పుకొడుతున్న భారత జవాన్ల పోరాట పటిమను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం) పరేడ్ సందర్భంగా భదౌరియా మాట్లాడుతూ.. ‘చైనా సరిహద్దుల్లో అమరవీరుడైన కల్నల్ సంతోష్ బాబుతో పాటు 19 మందికి నివాళులు అర్పిస్తున్నాం. వారి ధైర్యం సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలి. లడఖ్‌లో ప్రస్తుత పరిస్థితులు చూస్తూనే ఉన్నాం. చర్చలు అని చెప్పి చైనా దాడులకు పాల్పడుతుంది. దేనికైనా సరే మనం సిద్ధంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాయుసేన సిద్ధంగా ఉంది. ఎలాంటి ప్రతికూల వాతావరణం లో అయినా దేశ సేవ ప్రధానం. పీపుల్ సేఫ్టీ ఫస్ట్.. మిషన్ ఆల్ వేస్... ఎప్పటికి మరిచిపోవద్దు. తమ పిల్లల కళను సాకారం చేసిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. గాల్వాన్ అమరుల త్యాగాలను వృథా కానివ్వం.’ అని పేర్కొన్నారు. కాగా పరేడ్ సందర్భంగా క్యాడేట్ల చేత గౌరవ వందన్నాన్ని చీఫ్ మార్షల్ స్వీకరించారు. కోవిడ్ 19 నేపధ్యంలో పరేడ్ తిలకించడానికి క్యాడేట్ల కుటుంబ సభ్యులకు అనుమతి నిరాకరించారు. కాగా మొత్తం 123 మంది క్యాడేట్లలో 19 మంది బాలికలు ఉన్నారు. వీరందరికీ చీఫ్ మార్షల్ అభినందనలు తెలిపారు. -
ట్రంప్ భారత్ టూర్లో రాజభోగాలు
వాషింగ్టన్, న్యూఢిల్లీ : ప్రపంచానికే పెద్దన్న దేశం విడిచి వస్తున్నాడంటే ఆయన రాజభోగాలకు కొరతేం ఉండదు. భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. అందుకే ఆయన ప్రయాణించే విమానం, కారు, హెలికాప్టర్ వేటి ప్రత్యేకతలు వాటికే ఉన్నాయి. ఎలాంటి దాడులనైనా తట్టుకుంటాయి. ఆత్మరక్షణ కోసం ఆయుధాలుగా కూడా మారుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25న భారత్‌కు వస్తున్న నేపథ్యంలో ఆయన ప్రయాణ సాధనాలు, వాటి ప్రత్యేకతలు... (వైరల్‌గా మారిన మొతేరా స్టేడియం ఫోటోలు) ఎయిర్‌ఫోర్స్ వన్ ► అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఏ విమాన్నయినా ఎయిర్‌ఫోర్స్ 1 అనే పిలుస్తారు. ► ప్రస్తుతం ట్రంప్ భారత్‌కు వస్తున్న విమానం బోయింగ్ 747–200. ఈ విమానంపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్న అక్షరాలు, అమెరికా జాతీయ జెండా ఉంటాయి. ► ఈ విమానానికి ఎలాంటి అణుబాంబులనైనా తట్టుకునే సామర్థ్యం ఉంది. దాడి జరిగే అవకాశం ఉందని ఉప్పందితే చాలు మొబైల్ కమాండ్ సెంటర్‌గా మారుతుంది. ► నాలుగు జెట్ ఇంజిన్స్‌తో ఈ విమానం నడుస్తుంది ► గంటకి వెయ్యి కి.మీ కంటే అధిక వేగంతో ప్రయాణిస్తుంది. ► 70 మంది వరకు ప్రయాణించవచ్చు. ► గాల్లోనే ఇంధనాన్ని నింపుకునే సౌకర్యం ఈ విమానానికి ఉండడం ప్రత్యేకత. దీంతో ఎంతసేపైనా ప్రపంచం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చుట్టేయగలదు. ► విమానం లోపల విస్తీర్ణం 4 వేల చదరపు అడుగులు ఉంటుంది. మూడు అంతస్తుల్లో ఈ –విమానాన్ని తయారు చేశారు. వైట్ హౌస్‌లో ఉన్న సదుపాయాలన్నీ ఇందులో ఉంటాయి. ► అధ్యక్ష కార్యాలయం, జిమ్, కాన్ఫరెన్స్ గది, డైనింగ్ రూమ్, అత్యాధునిక సమాచార వ్యవస్థ, సిబ్బంది ఉండేందుకు లాంజ్ సహా సకల సౌకర్యాలు ఉంటాయి. ► ఒకేసారి 100 మందికి వంట చేసే సదుపాయం కూడా ఉంది ► ప్రయాణ సమయంలో ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే అధునాతన వైద్య పరికరాలతో మినీ ఆస్పత్రి, అందుబాటులో వైద్యుడు ఉంటారు. అద్దాలే ఆయుధాలు ది బీస్ట్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ట్రంప్ 22 కి.మీ. మేర రోడ్డు ప్రయాణం చేస్తారు. ఆ సమయంలో ఆయన తన వెంట తెచ్చుకున్న కారులోనే వెళతారు. బీస్ట్ అని పిలిచే ఈ కారుకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ► ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ కారు తొలిసారి వాడకంలోకి వచ్చింది. ► ఈ కారుని కాడలిక్ 1 అని కూడా అంటారు. ప్రపంచంలోనే అత్యంత భద్రతా ఏర్పాట్లున్న కారు ఇదే ► ఇలాంటి బీస్ట్ కార్లు 12 అధ్యక్షుడు వెళ్లే కాన్వాయ్‌లో ఉంటాయి ► 5 అంగుళాల మందం కలిగిన స్టీల్, అల్యూమినియం, టైటానియం, సిరామిక్స్‌తో తయారు చేశారు. ► దాడి జరిగితే కారు కిటికీ అద్దాలే ఆయుధాలుగా మారిపోతాయి. ఈ కారు అద్దాలు అవసరమైతే గుళ్ల వర్షాన్ని కురిపించగలవు ► అమెరికా సీక్రెట్ సర్వీస్‌కు చెందిన వారు మాత్రమే ఈ కారుని నడుపుతారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా తప్పించుకోవాలో, 180 డిగ్రీల్లో కారుని తిప్పడం, ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడం వంటి వాటిలో డ్రైవర్‌కి శిక్షణ ఇస్తారు ► ఈ కారు పక్కనే బాంబు పేలినా లోపల ప్రయాణించే అధ్యక్షుడికి ఏమీ కాదు. ► జీవరసాయన దాడుల నుంచి కూడా తట్టుకొనే సౌకర్యం ఈ కారుకి ఉంది. ► రాత్రిపూట ప్రయాణాల్లో కనిపించే నైట్ విజన్ కెమెరాలు, గ్రనేడ్ లాంచర్స్, ఆక్సిజన్ అందించే ఏర్పాటు, అధ్యక్షుడి గ్రూప్ రక్తం .వంటి సదుపాయాలుంటాయి. ► అధ్యక్షుడు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఆ సీటు కారులో కూర్చొనే ఉపాధ్యక్షుడితో మాట్లాడడానికి వీలుగా శాటిలైట్ ఫోన్ ఉంటుంది. హెలికాప్టర్.. మెరైన్ వన్ అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా మెరైన్ వన్ హెలికాఫ్టర్ కూడా వెంట వస్తుంది. ఆయా దేశాల్లో చిన్న చిన్న దూరాలకు, తాను బస చేసే హోటల్‌కి వెళ్లడానికి ఈ హెలికాప్టర్ని వినియోగిస్తారు. ► వీహెచ్–3డీ సీ కింగ్ లేదంటే వీహెచ్–60ఎన్ వైట్ హాక్ హెలికాప్టర్లే అధ్యక్షుడి ప్రయాణానికి వినియోగిస్తారు. ► క్షిపణి దాడుల్ని సైతం ఈ హెలికాప్టర్లు తట్టుకుంటాయి. ఆ హెలికాప్టర్లో అత్యాధునిక సమాచార వ్యవస్థ ఉంటుంది. ► అధ్యక్షుడి భద్రత కోసం ఒకేసారి అయిదువరకు ఒకే రకంగా ఉండే హెలికాప్టర్లు ప్రయాణిస్తాయి. ఒక దాంట్లో అధ్యక్షుడు ఉంటే, మిగిలినవి ఆయనకు రక్షణగా వెళతాయి. ► అధ్యక్షుడు ప్రయాణిస్తున్న మెరైన్ వన్ ఎటు వెళుతోందో ఈ అయిదు హెలికాప్టర్లు ఒకదానికొకటి సమాచారాన్ని అందించుకుంటాయి. -
బుష్ గౌరవార్థం ‘స్పెషల్ ఎయిర్‌మిషన్ 41’
హూస్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు దివంగత జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ భౌతికకాయాన్ని వాషింగ్టన్ తీసుకెళ్లేందుకు అధ్యక్షుడి అధికారిక విమానం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ హూస్టన్‌కు చేరుకుంది. బుష్ గౌరవార్థం ఈ విమానానికి తాత్కాలికంగా ‘స్పెషల్ ఎయిర్‌మిషన్ 41’గా పేరుపెట్టారు. వాషింగ్టన్‌లోని నేషనల్ క్యాథడ్రల్ చర్చిలో అధికారిక లాంఛనాలతో ఓసారి, హూస్టన్‌లోని సెయింట్‌మార్టిన్ ఎపిస్కోపల్ చర్చిలో మరోసారి బుష్ అంత్యక్రియలు జరగనున్నాయి. గురువారం హూస్టన్‌లో ఆయన భార్య బార్బరా, కుమార్తె రాబిన్ పక్కన బుష్ పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు. మరోవైపు, బుష్ భౌతికకాయం వద్ద ఆయన పెంపుడు శునకం సల్లీ విచారంగా పడుకున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
పట్టువదలని ట్రంప్
► కొత్త వలస నిషేధ ఉత్తర్వుల జారీకి కసరత్తు ► వలస చట్టాల అమలును కఠినతరం చేస్తామని వెల్లడి వాషింగ్టన్ : కోర్టుల్లో వరుసగా షాక్‌లు తగులుతున్నా... నిషేధపు ఉత్తర్వులపై మాత్రం వెనక్కి తగ్గనంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్వల్ప మార్పులతో వచ్చే వారం కొత్త ఉత్తర్వులు జారీ చేస్తానని శనివారం ఆయన స్పష్టం చేశారు. ఏడు ముస్లిం దేశాల పౌరుల రాకను నిషేధిస్తూ జారీచేసిన ఉత్తర్వుల్ని కోర్టులు రద్దు చేసిన నేపథ్యంలో ఎలాగైనా పంతం నెగ్గించుకునే లక్ష్యంతో ట్రంప్ ముందడుగు వేస్తున్నారు. ‘ఈ యుద్ధంలో మేం గెలుస్తాం. అందుకు కొంత సమయం పట్టినా మాదే విజయం. ఇందుకోసం ఇతర ప్రత్యామ్నాయాల్ని కూడా పరిశీలిస్తున్నాం... అందులో ఒకటి కొత్త ఉత్తర్వులు జారీచేయడం’అని ట్రంప్ పేర్కొన్నారు. ఎయిర్‌ఫోర్స్ వన్ లో జపాన్ అధ్యక్షుడు షింజో అబేతో కలిసి ఫ్లోరిడాకు వెళ్తూ విలేకరులతో మాట్లాడారు. కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసే ఆలోచన ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా... ‘దాదాపు అలాంటిదే... భద్రత కోసం చర్యల్ని వేగవంతం చేయాల్సిన అవసరముంది. కోర్టు నిర్ణయంపై ఎలా ముందుకెళ్లాలనే నిర్ణయంపై వచ్చే వారం వరకూ వేచి చూస్తా. అది సోమవారం లేదా మంగళవారం కావచ్చు’అని ట్రంప్ వెల్లడించారు. ఇక నుంచి క్షుణ్నంగా తనిఖీలు: ట్రంప్ కొత్త ఉత్తర్వుల వివరాలు వెల్లడిస్తూ... వలస చట్టం అమలు కోసం పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘కొత్తగా భద్రతా చర్యలు పొందుపరుస్తాం. ఇక నుంచి చాలా క్షుణ్నంగా తనిఖీ చేయబోతున్నాం. మన దేశానికి రావాలనుకుంటున్న ప్రజలు మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేలా ఉండాలి’అని ట్రంప్ పేర్కొన్నారు. అంతకుముందు శుక్రవారం వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ... అమెరికాకు అదనపు భద్రత కోసం ఏదొకటి చాలా త్వరగా చేయాలని, వచ్చేవారం వాటిని మీరు చూస్తారంటూ దీమాగా చెప్పారు. ‘కోర్టులో పోరాటాన్ని కొనసాగిస్తాం. కేసు గెలుపుపై నాకు ఎలాంటి సందేహం లేదు’అని జపాన్ ప్రధాని షింజో అబేతో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. దేశ భద్రత కోసమే అధ్యక్షుడినయ్యా... ‘మనం దేశాన్ని సురక్షితంగా ఉంచాలనుకుంటున్నాం. దేశ భద్రత కోసం ఏది అవసరమో అది చేయాలనుకుంటున్నాం. మన నిర్ణయం విజయవంతమవుతుందని భావించాం.. అయితే ఇంత సమయం తీసుకోకూడదు. ఎందుకంటే దేశ భద్రతే మనకు ముఖ్యం. ఈ రోజున నేను ఇక్కడ ఉన్నానంటే అది దేశ భద్రత కోసమే.. నేను భద్రత ఇవ్వగలనని ఓటర్లు నమ్మారు’ అని ట్రంప్ చెప్పారు. అమెరికాకు ఎన్నో ముప్పులు పొంచి ఉన్నాయని, అలా జరిగేందుకు అనుమతించకూడదన్నారు. అధ్యక్షుడిగా చాలా తక్కువ సమయంలోనే అనేక విషయాల్ని నేర్చుకున్నానంటూ తన అనుభవాలు వెల్లడించారు. వాటికి నా దెబ్బ రుచిచూపిస్తా విదేశాలకు వ్యాపారాల్ని తరలించాలనే ఆలోచనలో ఉన్న కంపెనీలకు నిబంధనల్ని కఠినతరం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. కేవలం బై బై చెప్పి, అందర్నీ ఉద్యోగాల నుంచి తొలగించి వెళ్లిపోవడం అంత సులువు కాదనే విషయం ఆ కంపెనీలకు తెలిసేలా చేస్తానన్నారు. అమెరికా ప్రజల్ని ఉద్దేశించి శనివారం వారాంతపు ప్రసంగం చేస్తూ... భారీ పన్ను సంస్కరణల కోసం కసరత్తులు చేస్తున్నామని వెల్లడించారు. కొత్త పన్ను విధానాలు అమల్లోకి వస్తే ఉద్యోగులపై, వ్యాపారులపై భారం తగ్గుతుందని చెప్పారు. అమెరికాలో వ్యాపారాన్ని మరింత సులభతరం చేయాలనేది ప్రభుత్వ అభిమతమని, ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కొత్త ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.