తొలిసారి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో బైడెన్‌ | President Joe Biden flight home on Air Force One | Sakshi
Sakshi News home page

తొలిసారి ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో బైడెన్‌

Published Sun, Feb 7 2021 5:05 AM | Last Updated on Sun, Feb 7 2021 12:19 PM

President Joe Biden flight home on Air Force One - Sakshi

ఎయిర్‌ ఫోర్స్‌ విమానం నుంచి అభివాదం చేస్తున్న బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆ పదవిని అధిరోహించిన తరువాత తొలిసారి ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో ప్రయాణించారు. వ్యాపార అవసరాల కోసం కాదు సుమా! వైట్‌ హౌస్‌లోని ఇంటికి కావాల్సిన జాబితా తయారు చేయడంలో తన భార్యకు సహకరించేందుకు డెలావర్‌లోని తన ఇంటికి బైడెన్‌ ‘ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌’విమానంలో వెళ్ళారు. అధ్యక్షుడిగా తానీ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో ప్రయాణించడం తనకొచ్చిన గొప్ప అవకాశమని బైడెన్‌ వ్యాఖ్యానించారు.

సహచరికి తోడ్పడేందుకే
‘‘నా మనవలు, మనవరాళ్ళను చూసేందుకు, అలాగే కొత్త ఇంటికి కావాల్సినవి కొనుగోలు చేయడంలో నా భార్య జిల్‌కి తోడ్పడేందుకు విల్మింగ్టన్‌కి దగ్గర్లోని నా ఇంటికి ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో వెళ్ళాను’’అని బైడెన్‌ అన్నారు. మరోవైపు బైడెన్‌ కొడుకు హంటర్‌కి గురువారానికి 51 ఏళ్ళు నిండాయి.  

ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం ప్రత్యేక ఏంటి?  
అమెరికా అధ్యక్షులంతా వాడేది ఎయిర్‌ఫోర్స్‌ వన్‌నే. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌. ‘‘అమెరికాకి చెందిన ఏ అధ్యక్షుడైనా, డెమొక్రాట్‌ కానీ, రిపబ్లికన్‌ కానీ ప్రయాణించేటప్పుడు ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ నే ఉపయోగిస్తారు’’అని వైట్‌ హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకి చెప్పారు.  

ఇంకాస్త బాగుంది కూడా..
డెలావర్‌లో లాండ్‌ అయిన వెంటనే బైడెన్‌ రిపోర్టర్లతో మాట్లాడుతూ చాలావరకు ఈ విమానం, తాను 8 ఏళ్ళ పాటు వైస్‌ ప్రసిడెంట్‌గా ఉన్నప్పుడు ఉపయోగించిన ఫ్లైట్‌ మాదిరిగానే ఉన్నదని చెప్పారు. కాకపోతే ఇది ఇంకాస్త బాగా ఉన్నట్టు బైడెన్‌ వ్యాఖ్యానించారు.  

అధ్యక్ష, ఉపాధ్యక్షులు వేర్వేరుగా ప్రయాణం
నిజానికి అమెరికాలో అధ్యక్షుడి భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు. అధ్యక్ష, ఉపాధ్యక్షులు సైతం ఒకే విమానంలో ప్రయాణించరు. వేర్వేరుగా ప్రయాణిస్తారు. అందుకు కారణం భద్రత దృష్ట్య ఈ జాగ్రత్తలు తీసుకుంటారు.  

మూడు వారాల క్రితమే..
సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) గైడ్‌లైన్స్‌ ప్రకారం ప్రయాణాలు కోవిడ్‌–19 వ్యాప్తిని ఉధృతం చేస్తాయని, ఈ సమయంలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని చెప్పిం ది. అయితే ఎవరైనా ప్రయాణాలు చేయదల్చుకుంటే మీ వంతు వచ్చాక, కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేయించుకున్న తరువాతే ప్రయాణించాలని సీడీసీ స్పష్టం చేసింది. సెకండ్‌ డోస్‌ తీసుకున్న తరువాత కూడా ప్రయాణించడానికి రెండు వారాలు వేచి ఉండాలని సీడీసీ సూచించింది. అయితే బైడెన్‌ మూడు వారాల క్రితమే తన సెకండ్‌ డోస్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. బైడెన్‌కి 78 ఏళ్ళ వయస్సు కావడం వల్ల ఆయన హైరిస్క్‌లో ఉన్నప్పటికీ, ఈ ప్రయాణం వల్ల ఆయనకు ఎటువంటి ప్రమాదం లేదని, ప్రజలు మాత్రం బయటకు రాకుండా ఉండాలని వైట్‌ హౌస్‌ ప్రజలను అభ్యర్థించింది.

తొలిసారి
దశాబ్దకాలం పాటు సెనేట్‌లోనూ, 8 ఏళ్ళ పాటు వైస్‌ ప్రసిడెంట్‌గానూ పనిచేసిన జోబైడెన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత మొట్టమొదటిసారిగా ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో ప్రయాణించారు. 2000 సంవత్సరంలో తొలిసారి బిల్‌క్లింటన్‌తో పాటు బైడెన్‌ దక్షిణాఫ్రికాకి ఈ విమానంలో ప్రయాణించారు. అప్పుడు మాదకద్రవ్యాల సరఫరాని అడ్డుకునే విషయంలో, కొలంబియాకి సహాయపడేందుకు 1.3 బిలియన్‌ డాలర్ల నిధులను బిల్‌క్లింటన్‌ ఆ సందర్భంగా ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement